బిఆర్ఎస్ తో బిజెపి లాలూచి.. దూరమవుతున్న ఉద్యమకారులు!

Wednesday, January 22, 2025

తెలంగాణ ఉద్యమకాలం నుండి తనకు అండగా ఉంటూ వస్తున్న ఉద్యమకారులను అధికారంలోకి వచ్చాక ఒక్కరొక్కరుగా కేసీఆర్ దూరం చేసుకోవడమే కాకుండా, ఉద్యమంకు ద్రోహం చేసిన వారిని ఒకరొక్కరిని దగ్గరకు చేర్చుకోవడంతో పాటు, వారికి కీలక పదవులు ఇస్తూ రావడంతో ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న పలువురు తీవ్ర అసంతృప్తికి గురవుతూ వస్తున్నారు. 

అటువంటి సమయంలో ఉద్యమస్ఫూర్తితో తెలంగాణకు న్యాయం చేయగల పార్టీ బిజెపి అని భావించడంతో పాటు, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుండడంతో పలువురు నేతలు వరుసగా బీజేపీలో చేరారు.  తమ సీనియారిటీ, ప్రజలలో గల పలుకుబడిలను గుర్తించి పార్టీలో తగు గౌరవం కల్పించక పోయినా కేసీఆర్ ను ఓడించడమే ధ్యేయంగా  బీజేపీలో కొనసాగుతూ వచ్చారు. 

మొన్నటి వరకు తెలంగాణాలో కేసీఆర్ ను ఓడించగలిగింది తామే అంటూ బీజేపీ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణాలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడం, అంతర్గత సర్వేలలో బిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థితిలో ఆ పార్టీ ఉందని తెలియడం, బిజెపి ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని వెల్లడి కావడంతో బిజెపి అగ్రనాయకత్వం సర్దుబాటు చర్యలకు పాల్పడింది.

కాంగ్రెస్ మరో రాష్ట్రంలో అధికారంలోకి రానీయరాదని దృఢ సంకల్పంతో తెలంగాణాలో కేసీఆర్ ను ఓడించడంకన్నా, కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం మొదటి లక్ష్యంగా మార్చుకున్నారు. అప్పటి నుండి బిఆర్ఎస్ తో బీజేపీ లాలూచీ రాజకీయాలు నడపడం ప్రారంభించినట్లు స్పష్టమవుతూ వస్తున్నది.

మొదటగా కేసీఆర్ బీజేపీపై, మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం మానేశారు. అందుకు ప్రతిఫలంగా అన్నట్లు ఢిల్లీ మద్యం కేసులో అడ్డంగా బుక్ అయిన్నట్లు ప్రచారం చేస్తూవచ్చిన ఎమ్యెల్సీ కవితపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు తగ్గించాయి. ఆమెను నేడో, రేపో అరెస్ట్ చేస్తున్నారని, ఆమెకోసం తీహార్ జైలులో ఓ గది కూడా సిద్ధం చేస్తూ వచ్చారని చెబుతూ వచ్చిన బిజెపి నేతలు ఇప్పుడా విషయమే ప్రస్తావించడం లేదు. 

కేసీఆర్ ను ఓడించడం కోసం బీజేపీలో చేరితే ఇప్పుడు ఆ పార్టీ కేసీఆర్ తో లాలూచీ రాజకీయాలు జరపడాన్ని ఆ పార్టీలో చేరిన ఉద్యమకారులు సహించలేకపోతున్నారు.  కవితను అరెస్ట్ చేయనిదే రెండు పార్టీల మధ్య లాలూచీ లేదని జనం నమ్మరంటూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఢిల్లీలోనే స్పష్టం చేశారు. 

తమను చర్చలకు పిలిచి, అదే రోజు రాత్రి మంత్రి కేటీఆర్ కు అప్పోయింట్మెంట్ ఇవ్వడం పట్ల ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో హోమ్ మంత్రి అమిత్ షా అర్ధాంతరంగా కేటీఆర్ కు ఇచ్చిన అప్పోయింట్మెంట్ ను రద్దు చేసుకోవలసి వచ్చింది.

తాజాగా ప్రధాని మోదీ వరంగల్ లో కేసీఆర్ ది అవినీతి ప్రభుత్వం అనడం బాగానే ఉంది గాని, అవినీతిపై చర్యలు ఏమిటని బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఎ చంద్రశేఖర్ ప్రశ్నించారు. ఐదు సార్లు ఎమ్యెల్యేగా గెలిచి, మూడు సార్లు మంత్రిగా ఉన్న తాను బిజెపిలో చేరి రెండున్నరేళ్లు అవుతున్నా ఎటువంటి పదవి ఇవ్వలేదంటూ బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు.

మాజీ ఎంపీ రవీంద్రనాయక్ అయితే బిజెపి అగ్రనాయకత్వంకు అల్టిమేటం ఇచ్చారు. ఆగష్టు 15 లోగా కవితను అరెస్ట్ చేయాలనీ స్పష్టం చేశారు. లేని పక్షంలో బిజెపి – బిఆర్ఎస్ లాలూచి నిజమే అనే ప్రజల నమ్మకాన్ని సమర్ధించినట్లే అని తేల్చి చెప్పారు. 
ఆ తర్వాత, మాజీ జిల్లా అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి బీజేపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు మేలు చేసేలా బీజేపీ వ్యవహారం ఉందని జిట్టా ఆరోపింరు.

బీఆర్ఎస్‌తో స్నేహంపై ప్రజలకు క్లారిటీ ఇవ్వకుంటే బీజేపీ పతనం ఖాయమని హెచ్చరించారు. ఎంపీ సీట్లే బీజేపీకి ముఖ్యమని, అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ హైకమాండ్ లైట్ తీసుకుంటోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నప్పటకీ ఎందుకు సన్నద్ధం కావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles