బిఆర్ఎస్ ఎమ్యెల్యే వనమా ఎన్నిక కొట్టివేత

Sunday, December 22, 2024

మరో ఐదు నెలలు మాత్రమే పదవీకాలం ఉండగా బిఆర్ఎస్ ఎమ్యెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం నుండి కాంగ్రెస్ ఎమ్యెల్యేగా ఎన్నికైన వనమా ఆ తర్వాత బిఆర్ఎస్ లో చేరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.

పైగా, అసెంబ్లీ ఎన్నికల్లో  వనమా వెంకటేశ్వరరావుపై ఓడిపోయిన సమీప అభ్యర్థి జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా హైకోర్టు ప్రకటించింది. వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని, డిసెంబర్ 12, 2018 నుంచే జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా పరిగణిస్తూ హైకోర్టు డిక్లేర్ చేసింది. 2018 నుంచి ఇప్పటివరకు వనమా ఎమ్మెల్యే పదవీకాలం చెల్లదని స్పష్టం చేసింది.

ఎన్నికల అఫిడవిట్ లో వనమా తప్పుడు వివరాలను ఇచ్చారంటూ 2018లో హైకోర్టును జలగం వెంకట్రావు ఆశ్రయించారు.  వనమా ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, భార్య ఆస్తి వివరాలను పొందుపర్చలేదని జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు. ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించారంటూ కోరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వనమాకు 81,118 ఓట్లు రాగా.. వెంకట్రావుకు 76,979 ఓట్లు వచ్చాయి. కేవలం 4,139 ఓట్ల తేడాతో వెంకట్రావు ఓటమి పాలయ్యారు.

ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు వనమా ఎన్నిక చెల్లదని తీర్పును వెలువరించింది.  ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు వనమాకు రూ. 5 లక్షల జరిమానా విధించింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన వానామాపై జలగం వెంకట్రావు బిఆర్ఎస్ నుండి బరిలోకి దిగారు. ఇక ఇప్పడు ఆయనే ఎమ్మెల్యే అయ్యారు.

ప్రజాప్రాతినిథ్య చట్టం నిబంధనల ప్రకారం వనమా వెంకటేశ్వరరావుపై ఐదేళ్ల అనర్హత కూడా వర్తిస్తుందని జలగం తరపు న్యాయవాది రమేష్ తెలిపారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు బిఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్‌ దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా కోర్టు అనర్హత వేటు పడటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

కొద్ది నెలల క్రితం వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ ఓ కుటుంబాన్ని వేధించిన వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మీ-సేవ నిర్వాహకుడిగా ఉన్న వ్యక్తికి తన సోదరి, తల్లితో ఉన్న ఆస్తి గొడవలు సెటిల్ చేయడానికి అతని భార్యను తన వద్దకు పంపమని చెప్పాడు. 

సదరు బాధితుడు ఈ విషయాన్ని స్వయంగా వీడియో రికార్డు చేసి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో పరారీలో ఉన్న రాఘవను తీవ్రంగా గాలించి అరెస్టు చేసి జైలుకు పంపారు.ఆ తర్వాత వనమా రాఘవకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 

కొత్తగూడెం నియోజకవర్గంలో అడుగు పెట్టవద్దని, ప్రతీ శనివారం ఖమ్మం పోలీస్ స్టేషన్‌లో సంతకం చేయాలని ఆదేశించింది. సాక్ష్యులను మభ్య పెట్టడం, తారుమారు చేయడం వంటి పనులకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించింది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వనమా రాఘవ కొత్తగూడెం అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో అసాంఘిక శక్తిగా చెలరేగిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారం మొత్తాన్ని కొడుకు చేతిలో పెట్టడంతో వనమా వెంకటేశ్వరావు అప్రతిష్ట పాలయ్యారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో పదవిని కూడా కోల్పోయారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles