బాలినేని విషయంలో మెట్టు దిగిన జగన్!

Saturday, January 11, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగిలినప్పటి నుండి వరుసగా ఇబ్బందికర పరిణామాలు ఏర్పడుతూ ఉండటం, మరోవంక వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో బాబాయి భాస్కరరెడ్డి అరెస్ట్ కావడం, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ కావచ్చనే ప్రచారం జరుగుతూ ఉన్న సమయంలో పార్టీలో పెబులుకుతున్న అసమ్మతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్రమత్తమైన్నట్లు కనిపిస్తున్నది.

ఏకపక్ష ధోరణిలో వ్యవహరించిన కారణంగా నలుగురు ఎమ్యెల్యేలను సస్పెండ్ చేసినా, అసమ్మతి ఆగకపోవడం, మరింతగా పెరిగి సూచనలు కనిపిస్తుండడంతో ఎన్నికల సంవత్సరంలో తప్పుడు సంకేతాలు పంపవచ్చని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి కాలం నుండి ప్రకాశం జిల్లాలో తమ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటూ వస్తున్న సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధిక్కార ధోరణి ప్రదర్శించడంతో అవాక్కయిన్నట్లు చెబుతున్నారు.

స్వయంగా పిలిచి, వైవి సుబ్బారెడ్డి సమక్షంలోనే పంచాయతీ నడిపినా ఒక్క మెట్టు కూడా దిగడానికి బాలినేని సిద్ధం కాకపోవడం, పైగా అస్త్రసన్యాసం కావించి టిడిపి వైపు చూస్తున్నారనే సంకేతాలు వెలువడడంతో ఖంగారు పడినట్లు తెలిసింది. అందుకనే బాలినేని అసమ్మతికి ముఖ్యకారణమైన వైవి సుబ్బారెడ్డిని ప్రకాశం జిల్లా వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని వరించినట్లు చెబుతున్నారు.

బాలిరెడ్డి లకు తాజాకారణమైన ఒంగోలుకు బదిలీచేసిన డీఎస్పీని వెనుకకు పంపేశారు. అంతేకాదు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు బాలినేని ఏది చెబితే అదే చేయమని కూడా సీఎంఓ నుండి ఆదేశాలు వెళ్లాయి. దానితో ఇప్పటివరకు `అనారోగ్యం’ అంటూ అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటూవస్తున్న బాలినేని తిరిగి ఉత్సాహంగా తిరగడం ప్రారంభించారు.

ఒంగోలులో గెస్ట్ హౌస్ కు వెళ్లి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లను పిలిపించుకొని వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. అంతేకాకుండా, ఆపివేసిన `గడప గడపకు వైసీపీ’ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం ప్రారంభించారు. బాలినేని ఉదంతం అనుభవంతో ఇతరులపై ఆధారపడకుండా జిల్లాల వారీగా పార్టీ పరిస్థితులను స్వయంగా మదింపు చేయాలనీ, అసంతృప్తితో ఉన్నవారిని స్వయంగా దిద్దుబాటు చేసే ప్రయత్నం చేయాలని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

ఈ సందర్భంగా ఈ నెలాఖరు నుండి జగన్ చేబడుతున్న జిల్లాల పర్యటనల షెడ్యూల్ లలో కొన్ని మార్పులు చేస్తున్నారు.  కనీసం రెండు మూడు రోజులకు తగ్గకుండా ఒక్కో జిల్లాలో ఉంటూ అక్కడి నేతల మధ్య వ్యవహారాలను చక్కబెట్టే యోచనలో సీఎం జగన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఆసందర్భంగా ఆయా జిల్లాల్లోని నేతలతో స్వయంగా మాట్లాడటం, వారి ఇబ్బందులు తెలుసుకోవడం, ఆతరువాత వాటిని పరిష్కరించేలా ఏర్పాట్లు చేసుకోవాలనుకుంటున్నారు.

మరోవంక, పార్టీలో అసమ్మతిగా ఉన్న నేతలంతా రాజమహేంద్రవరంలో ఈనెల 27, 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న మహానాడులో చేరతారంటూ వస్తున్న ప్రచారాలపై కూడా సీఎం జగన్‌ దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఒకమోస్తరు నేతలు ఎవరైనా అసమ్మతితో ఉంటే వారి అసమ్మతికి సరైన కారణం ఉంటే దానిని సత్వరమే పరిష్కరించే దిశగా జగన్ స్వయంగా కసరత్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles