ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహారశైలి పట్ల అసమ్మతితో ఉన్న ఇద్దరు వైసిపి ఎమ్యెల్యేలకు తమ పార్టీలో చేరితే `డబల్ బోనాజా’ మాదిరిగా రెండు సీట్లు ఇచ్చేందుకు టిడిపి సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఆ పార్టీని దెబ్బతీసేందుకు ఈ రెండు జిల్లాలో పట్టున్న ఇద్దరు నాయకులను చేర్చుకునేందుకు టిడిపి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.
వీరిలో నెల్లూరు జిల్లా నుండి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పటికే వైసిపి నుండి బహిష్కరణకు గురయ్యారు. ఎమ్యెల్సీ ఎన్నికలలో టిడిపి అభ్యర్ధికి ఓటేసినందుకు వైసిపి బహిష్కరించిన నలుగురు ఎమ్యెల్యేలలో ముగ్గురు నెల్లూరు జిల్లావారే కావడం గమనార్హం. వారిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తప్పుడు ఇప్పటికే టిడిపిలో చేరారు.
శ్రీధర్ రెడ్డి సహితం తాను వచ్చే ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. మేకపాటి చంద్రశేఖరరెడ్డి రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇక, రామనారాయణ రెడ్డికి నెల్లూరు లోక్ సభ సీట్ తో పాటు, ఆయన కుమార్తెకు ఉదయగిరి అసెంబ్లీ సీట్ ఇచ్చేందుకు టిడిపి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగాయని చెబుతున్నారు.
ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ కు సమీప బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుండి వైసీపీకి జిల్లాలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. అయితే మంత్రిపదవి పోయినప్పటి నుండి అసంతృప్తిగా ఉంటూ వస్తున్నారు. రెండు సార్లు సీఎం జగన్ తో భేటీ జరిగినప్పటికీ ఆయనలో మార్పు రావడం లేదు. జగన్ సహితం ఉంటె ఉండు.. పోటీ పో అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది.
టీడీపీలో చేరితే ఆయనకు ఒంగోలు లోక్ సభ సీటుతో పాటు, ఆయన కుమారుడును దర్శి అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు టిడిపి సంసిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. జగన్ బంధువర్గంలోనే ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉంటున్న టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ సారి లోక్ సభకు ఒంగోలు నుండి పోటీచేసే అవకాశం ఉండడంతో, ఆయనపై పోటీకి బాలినేని సిద్ధపడుతున్నట్లు వినిపిస్తున్నది. పైగా, ఒంగోలులో టిడిపికి లోక్ సభకు పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థి కూడా లేరు.
ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వైసీపీ రాజకీయ ఆధిపత్యంకు గండి కొట్టేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న టిడిపి వీరిద్దరిని చేర్చుకోవడం ద్వారా అధికార పార్టీలో పెద్ద కుదుపు కలిగించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఇద్దరు కీలక నేతలను లోక్ సభకు పోటీచేయించడం ద్వారా వాటి పరిధిలోని అసెంబ్లీ సీట్లలో కూడా వైసీపీకి భారీగా గండికొట్టవచ్చని భావిస్తున్నారు.
టీడీపీ, జనసేనలు టికెట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపితే వైసీపీ నుంచి 60-70 మంది ఎమ్మెల్యేలు బయటకొస్తారని అంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజమండ్రిలో చేసిన ప్రకటన అధికారపక్షంలో ప్రకంపనాలు రేపుతోంది.