తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, తన హయాంలో తీసుకువచ్చిన పరిశ్రమలు, తాను సీఎంగా నిర్మించిన/పూర్తిచేసిన ప్రాజెక్టులు, తన ప్రభుత్వం పేదప్రజలకు నిర్మించిన నివాసగృహాలు… వాటి వద్ద నిల్చుని సెల్ఫీ దిగి.. సోషల్ మీడియా పోస్టుచేసి.. నీ హయాంలో ఏం చేశావు జగన్.. అని నిలదీసిన వ్యవహారాల సంగతి వేరు. అలాంటివి ఎదురైన ప్రతిసారీ.. జగన్ గానీ లేదా ఆయన కోటరీ గానీ.. ఏదో ఒక వితండమైన వాదనతో తెరమీదకు వచ్చి రాద్ధాంతం చేయడానికి, కౌంటర్ విమర్శలు చేయడానికి.. పెన్షను తీసుకుంటున్న అవ్వ వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకుందాం అంటూ మాటమార్చి బుకాయించడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే చంద్రబాబునాయుడు ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రశ్న సంధించారు. ఆ ప్రశ్నకు జవాబు చెప్పగల సత్తా, ధైర్యం జగన్ కు ఉంటాయా? అనేది సందేహమే. జవాబు చెప్పడం కాదు కదా.. ఆ ప్రశ్నను తమ కౌంటర్ విమర్శల్లో ప్రస్తావనకు తేవడానికి కూడా జగన్ మరియు ఆయన కోటరీ భయడతారేమో అనేంత సూటి ప్రశ్నను చంద్రబాబునాయుడు సంధించారు. ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఇంతకూ చంద్రబాబు ఏమన్నారంటే..
‘‘జగన్ ప్రతిసారీ నా వయసు గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రధాని మోడీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లకు కూడా ఇంచుమించు నా వయసే ఉంటుంది. వారికి రాని వయసు అడ్డంకి నాకు మాత్రం ఎందుకు వస్తోంది. మోడీ వయసు గురించి మాట్లాడే దమ్ము జగన్ కు ఉందా? వయసుతో పాటు వచ్చిన అనుభవంతోనే నేను దేశానికి ఎన్నో విధానాలను అందించాను’’ అని చెప్పారు.
ఇది చాలా సహేతుకమైన ప్రశ్న. ఎందుకంటే.. జగన్ ఏ సభలో ఏం మాట్లాడినా సరే.. ప్రతిసారీ ఆవు వ్యాసం లాగా.. చంద్రబాబునాయుడు వయసు వద్దకు వస్తుంటారు. విమర్శించడానికి చంద్రబాబులో మరే ఇతర అంశమూ తనకు తెలియదన్నట్టుగా.. ‘ఒక ముసలాయన ఉన్నాడు..’ అంటూ వెటకారంతో కూడిన మాటలతో ఎద్దేవా చేస్తుంటారు. ఆ ముసలాయన మళ్లీ సీఎం కావాలని ఆరాటపడుతున్నాడు.. అంటూ విమర్శిస్తారు. కానీ.. చంద్రబాబు మాటలు నిజం. నరేంద్రమోడీది కూడా ఆయన వయస్సే. ఇద్దరూ 1950లోనే పుట్టారు. చంద్రబాబు ఏప్రిల్ 20 న పుడితే, నరేంద్ర మోడీ సెప్టెంబరు 17 న పుట్టారు. బాబు కంటె మోడీ ఆరునెలలు చిన్న. ఇద్దరి వయస్సు 73 ఏళ్లు. అదే నవీన్ పట్నాయక్ విషయానికి వస్తే.. ఆయన వయస్సు 76 ఏళ్లు. 1946 అక్టోబరు 16న పుట్టారు. ఆయన ఒడిశాకు మళ్లీ సీఎం అవకాశాలే ఎక్కవ ఉన్నాయి. ఈ రకంగా నాయకులకు వయసు అనేది అడ్డంగా కనిపించడం లేదు. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చంద్రబాబునాయుడు విషయంలో ముసలాయన అంటూ ఎగతాళి చేసే జగన్, మోడీ కనిపిస్తే చాలు, కాళ్లమీద పడడానికి ఆరాటపడుతుంటారు. అందుకే చంద్రబాబునాయుడు సంధించిన ప్రశ్నకు జగన్ వద్ద జవాబు ఉంటుందా? అని తెలుగుదేశం శ్రేణులంతా పరమోత్సాహంగా ఉన్నారు.
బాబు ప్రశ్నకు జగన్ వద్ద జవాబుందా?
Sunday, December 22, 2024