తమ పరిస్థితి బాడ్ గా ఉన్న నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గుడ్ లుక్స్ లో పడడానికి నానా పాట్లు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. జగన్ తమను ప్రత్యేకంగా గుర్తించాలంటే, ఆదరించాలంటే అందుకు చంద్రబాబు నాయుడును ఎడాపెడా తిట్టడం ఒక్కటే సరైన మార్గమనే ఆలోచన వారికి కలుగుతున్నట్లుగా ఉంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లో చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జరిగిన రచ్చను గమనిస్తు, వైసీపీ నాయకుల ఓవరాక్షన్ చూస్తే ఎవరికైనా సరే ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. చంద్రబాబును దళిత ద్రోహిగా చిత్రీకరిస్తూ, మంత్రి ఆదిమూలపు సురేష్ స్వయంగా రోడ్డక్కడం, చొక్కా విప్పి పడేసి అర్థనగ్నప్రదర్శన చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడం ఈ సందర్భంగా గమనార్హం.
చంద్రబాబు నాయుడు మీద దాడి చేస్తే, ఆయన పర్యటనను అడ్డుకొని రభస చేస్తే, ఆయన పర్యటన సజావుగా సాగకుండా ఆటంకాలు సృష్టిస్తే తమ అధినేత జగన్ దృష్టిలో ఎక్కువ మార్కులు పడతాయని వైసిపి నాయకులు తలపోస్తున్నట్టుగా ఉంది. అందుకే ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా, మంత్రి ఆదిమూలపు సురేష్ సారథ్యంలో నానా రచ్చ చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు నోరెత్తడానికి కూడా వీల్లేదని నిర్దేశించే తరహాలో ఏకంగా చంద్రబాబు కాన్వాయ్ మీద రాళ్ల దాడికి దిగారు. మంత్రి ఆదిమూలపు సురేష్ స్వయంగా ఇక్కడ వైసీపీ నిరసనకు నేతృత్వం వహించడం విశేషం. చంద్రబాబు కాన్వాయ్ మీద రాళ్లు రువ్వడాన్ని అందరూ ఖండిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు పాల్పడిన ఈ రాళ్ల దాడిలో చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్న ఎన్ఎస్జి అధికారి తలకు రాయి బలంగా తగలడం, ఆయన చికిత్స చేయించుకుని, కట్టుకట్టుకుని మరీ చంద్రబాబు భద్రత విధుల్లో పాల్గొనడం కూడా చర్చనీయాంశం అవుతోంది.
చంద్రబాబు సభలకు ఇదేం ఖర్మ రాష్ట్రానికి పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు రోజురోజుకు పెరుగుతున్న జనాదరణ చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక పోతున్నారని విశ్లేషకులు అంటున్నారు.
వైసీపీ నాయకుల ఆగడాలను చంద్రబాబునాయుడు కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఆదిమూలపు సురేష్ కార్యాలయం ఎదురుగానే తన కాన్వాయ్ ను ఆపి, తన రాకపట్ల నిరసనలు తెలియజేస్తున్న వారిని హెచ్చరించారు. ఆ సమయంలో తెలుగుదేశం నాయకులు మంత్రి సురేష్ కార్యాలయంపై రాళ్లు రువ్వారని, తమ పార్టీ కార్యకర్తలు ముగ్గురికి గాయాలయ్యాయని ఆయన ఆరోపించడం విశేషం. మొత్తానికి రాష్ట్రంలో రాజకీయ హీట్ అనేది హింసాత్మక రూపు దాలుస్తున్న వైనం కనిపిస్తోంది. ఎన్నికలు ఏడాది దూరంలో ఉన్నా ఇప్పటినుంచే రాజకీయ సభలు కొట్లాటలుగా మారే పరిణామాలు కనిపిస్తున్నాయి.