బాబును బూచిగా చూపిస్తే.. తమరు గెలుస్తారా?

Thursday, January 23, 2025

సాధారణంగా సినిమాలలో ఒక సిద్ధాంతం ఉంటుంది. విలన్ ఎంత బలంగా ఉంటే, అంతగా హీరోకు ఎలివేషన్ వస్తుందనేది ఆ సిద్ధాంతం. ఎంతో బలమైన విలనిజం ఉంటే హీరోయిజం కూడా అంతగా పండుతుందని సినిమా ప్లానింగ్ లో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సిద్ధాంతం రాజకీయాలకు కూడా వర్తిస్తూ ఉందా? అని అనిపిస్తోంది. ఎందుకంటే విలన్ ను ఎక్కువగా ఎలివేట్ చేయడం ద్వారా తాము లబ్ధి పొందాలని, తాము విజయం సాధించాలని నాయకులు అనుకుంటూ ఉండడమే ఇక్కడ అసలు సంగతి.
మంత్రి ధర్మాన ప్రసాదరావు, తాజాగా వాలంటీర్లతో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. వారికి హితోపదేశం చేశారు. ఆయన చెప్పినదల్లా ఏంటంటే వాలంటీర్లు అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత తీసుకోవాలని! వాలంటీర్లు అందరూ ఇంటింటికి తిరిగి జగనన్న చేపడుతున్న సంక్షేమ పథకాలు అన్నింటిని వారికి వివరించి ఫ్యాన్ గుర్తుకు మాత్రమే ఓటు వేయాల్సిన అవసరాన్ని కూడా తెలియజేయాలని ధర్మాన ప్రవచనం!!
‘ఏ పార్టీకి ఓటు వేయాలో ,ఏ పార్టీకి ఓటు వేయకూడదో ప్రజలందరికీ చెప్పడానికి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని.. వాలంటీర్లు కూడా పౌరులే గనుక, వారికి కూడా రాజకీయ ప్రచారం చేసే హక్కు ఉంటుందని’ ధర్మాన గారు హక్కుల గురించి నీతి ప్రవచనాలు చెబుతున్నారు! ప్రభుత్వం దగ్గర ప్రజల సొమ్ము వేతనంగా తీసుకుంటూ రాజకీయ పార్టీలకు ప్రచారం చేస్తూ గడిపితే.. దానిని హక్కుల కింద ఆయన సమర్థిస్తున్నారు.
ఇదే పనిని రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరూ కూడా చేస్తే మంత్రిగారు ఊరుకుంటారా? పీఆర్సీ విషయంలో ప్రభుత్వం మీద బీభత్సమైన అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు, సిపిఎఫ్ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని మోసం చేసిందని ఆగ్రహిస్తున్న ఉద్యోగులు, వేతనాలు నెలనెలా ఒకటో తేదీకి రావడం లేదనీ- తమ జీవితాలు అగచాట్ల పాలవుతున్నాయని ప్రతినెలా నిత్య ఆందోళనలతో భయంతో కాలం గడుపుతున్న ఉద్యోగులు, ‘తాము కూడా పౌరులమే ఏ పార్టీకి ఓటు వేయాలో ఏ పార్టీకి ఓటు వేయకూడదో చెప్పే హక్కు మాకు కూడా ఉంటుంది’ అని మంత్రి ప్రవచనాన్ని నమ్ముతూ రాజకీయ పార్టీలకు ప్రచారం చేయడం మొదలెడితే ధర్మాన గారు సహించగలరా? ఆ పార్టీ ప్రజల మన్నన చూరగొనగలదా? అనే ప్రశ్న ప్రజలలో ఉత్పన్నం అవుతోంది.
‘వాలంటీర్ల వ్యవస్థను మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువజనంతో నింపేశారు’ అనేది సత్యం! ‘వాలంటీర్లు అంటే మా పార్టీ కార్యకర్తలే కదా’ అని పాలక పక్షానికి చెందిన అనేక మంది పెద్దలు, అనేక అనేక సమావేశాలలో బహిరంగంగానే వెల్లడించారు. నియోజకవర్గాలలో వాలంటీర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రభుత్వ అనుకూల ప్రచారం చేయాలని జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించాలని వాలంటీర్లకు హితబోధ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మేధావి అయిన ధర్మాన ప్రసాదరావు మరొక అడుగు ముందుకు వేసి రాజకీయ ప్రచారం చేయడం వారికి హక్కు అని తెలియజేస్తూ ఒక భరోసా అందిస్తున్నారు. ఇక చెలరేగిపొండి రాజకీయ కార్యకర్తల లాగే ప్రవర్తించండి, పార్టీ జెండాలను భుజాన వేసుకుని తిరగండి అని అన్యాపదేశంగా సంకేతాలు అందిస్తున్నారు. మీకు వచ్చిన ఢోకా ఏమి లేదు అని చెబుతున్నారు
పనిలో పనిగా చంద్రబాబును బూచిని చేసి చూపించే ప్రయత్నమే అసహ్యంగా ఉంది. చంద్రబాబు నాయుడు నెగ్గితే గనుక, ఈ వాలంటీర్ల వ్యవస్థ మొత్తం రద్దవుతుందని మొదటి వేటు వాలంటీర్ల మీదనే పడుతుందని ధర్మాన హెచ్చరిస్తున్నారు. ‘ఉద్యోగాలు పోతాయి అని బెదిరిస్తే తప్ప వాలంటీర్లలో చంద్రబాబు పట్ల వ్యతిరేకతను నాటలేం’ అనే భయం.. పాలక పక్షాన్ని, ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్లను వెంటాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఉద్యోగం పోతుంది అనే భయంతో వారిని బెదిరించకపోతే, వాలంటీర్లు కూడా చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తారేమో అని అనుమానం కూడా వారిలో ఉన్నట్లుంది. అందుకే ఇలాంటి వక్రబుద్ధులతో, దుర్మార్గపు ప్రచారాలతో దిగజారి మరీ వ్యవహారం నడిపిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles