‘బాబాయిని చంపిందెవరు’.. లోకేష్ పోస్టర్లతో కలకలం

Wednesday, January 22, 2025

ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాలో యువగళం పాదయాత్ర జరుపుతున్న టిడిపి ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తీరుపై ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత జిల్లా కావడమే కాకుండా వైసీపీకి కంచుకోటగా పేరున్న ఈ జిల్లాలో `బాబాయిని చంపిందెవరు?’ అంటూ పోస్టర్లు ప్రదర్శిస్తూ వినూత్నంగా లోకేష్ పాదయాత్ర జరపడం రాజకీయంగా కలకలం రేపుతున్నది.

యువగళం పాదయాత్ర ప్రస్తుతం వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పాదయాత్రలో ఆ పార్టీ శ్రేణులు గురువారం వివేకా హత్యకు సంబంధించిన పోస్టర్లు, ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ చేశారు. వివేకానందరెడ్డిని ఎవరు చంపారంటూ.. వైఎస్ వివేకా, సీఎం జగన్‌, కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఫొటోలను ప్రదర్శిస్తూ ‘బాబాయిని ఎవరుచంపారు?’ అని రాసి ఉన్న పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు.

`బాబాయిని ఎవరు చంపారు?’ అనే నినాదాలతో లోకేష్ పాదయాత్ర పొడవునా ర్యాలీగా వెళ్లారు. నారా లోకేష్ కూడా ప్లకార్డులు పట్టుకొని పాదయాత్ర వెంట ప్రజలకు చూపించారు. ప్రొద్దుటూరు టౌన్‌లో ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ ప్లకార్డులు ప్రజలకి చూపించి బాబాయ్‌ని చంపింది ఎవరు? అంటూ లోకేశ్‌ స్థానిక ప్రజలను అడిగారు.

బాబాయిని ఇద్దరు అబ్బాయిలు వేసేశారు. గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించారు. సొంత పత్రిక, టీవీలో నారాసుర రక్తచరిత్ర అంటూ రాసుకున్నారు. హూ కిల్డ్‌ బాబాయ్‌? బాబాయిని ఎవరు చంపారు..? అబ్బాయిలే వేసేశారని సీబీఐ తేల్చింది. బాబాయి హత్యలో జగన్‌ పాత్ర ఉందని కోర్టుకు చెప్పింది. ఆయన్ను విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయనగానే అబ్బాయి హుష్‌ కాకి అంటూ ఢిల్లీ వెళ్లి పెద్దలకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. కేసుల కోసం 22 మంది ఎంపీలను తాకట్టుపెట్టారు. అబ్బాయిలిద్దరివీ బెయిల్‌ బతుకులు’ అని లోకేశ్‌.. సీఎం జగన్‌, ఎంపీ అవినాశ్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఓ సందర్భంలో ఆ పోస్టర్లను పోలీసులు లాక్కోవడంతో తెలుగు దేశం పార్టీ నాయకులు అభ్యంతరం తెలిపారు. దీంతో పోలీసులతో ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్తత నెలకొంది. దీంతో టీడీపీ నేతల పోస్టర్లు, ప్లకార్డులను పోలీసులు లాక్కున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా మోహరించి ప్లకార్డులతో టీడీపీ శ్రేణుల నినాదాలు చేశారు. టీడీపీ శ్రేణుల నినాదాలతో పోలీసులు అక్కడి నుంచి జారుకున్నారు.

మరోవైపు పాదయాత్రలో ప్లకార్డులు ప్రదర్శించకూడదంటూ టీడీపీ కార్యకర్తలను ప్రొద్దుటూరు డీఎస్పీ నాగరాజు వారించారు. దీనిపై లోకేష్ మాట్లాడుతూ.. అన్నీ అనుమతులు తీసుకొనే తాము పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. తమను రెచ్చగొట్టేలా వైసీపీ వాళ్లు ఫ్లెక్సీలు పెట్టినప్పుడు మీరెక్కడ ఉన్నారని డీఎస్పీని లోకేష్ ప్రశ్నించారు. ముందు వెళ్లి వైసీపీ ఫ్లెక్సీలు తొలగించండని చెప్పడంతో పోలీసులు నీళ్ల్లు నములుతూ అక్కడి నుంచి వెనుదిరిగారు.

లోకేష్ పాదయాత్ర సాగుతున్న దారి వెంట టీడీపీ ప్లెక్సీలకు పోటీగా వైసీపీ ఫ్లెక్సీలు, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేశారని తెలుగుదేశం నేతలు పోలీసులను ప్రశ్నించారు. పాదయాత్ర పొడవున భారీ సంఖ్యలో యువత, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

యువగళం 113వ రోజు పాదయాత్ర గురువారం వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. శివాలయం సెంటరులో జరిగిన బహిరంగసభకు జనం పోటెత్తారు. లోకేశ్‌ మాట్లాడుతూ.. జగన్‌ మాయమాటలు చెబుతూ రాష్ట్రాన్ని జీరో చేశాడని.. ప్రజలకు గుండుసున్నా చుట్టాడని ధ్వజమెత్తారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles