బండి సంజయ్ వర్సెస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ల వార్!

Saturday, January 18, 2025

కొద్ది రోజుల క్రితమే నిజామాబాద్ లో ఓ బిజెపి నాయకుడి గృహప్రవేశం కార్యక్రమంలో ఎదురవడంతో ఆప్యాయంగా పలకరించుకొని, తమ తమ పార్టీల నేతలను ఒకరికి మరొకరు పరిచయం చేసుకున్న బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. తెలంగాణ ప్రభుత్వంలో మహిళా సంక్షేమం గురించి సంజయ్ విమర్శలు గుప్పించడంతో ఆగ్రహించిన కవిత ఎదురు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. దీనిని ఉద్దేశించి బండి సంజయ్ ట్వీట్ చేశారు. “గవర్నర్ కు గౌరవం దక్కదు, ఆడబిడ్డలకు లేదు అండ, గిరిజన మహిళలపై పోలీస్ గిరీ, బతుకమ్మను అవమానపరిచినోడితో ఆలింగనం, కానీ ఇంటి బిడ్డకు మాత్రం బలగంతో అడ్డం నిలబడతావ్, కేసీఆర్ మహిళా సంక్షేమం అదిరింది” అంటూ ఎద్దేవా చేస్తూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.

సంజయ్‌ ట్వీట్ కు ఎమ్మెల్సీ కవిత ధీటుగా కౌంటర్‌ ఇస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం, మహిళా రెజ్లర్ల ఉద్యమాన్ని అణచివేయడం, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కు అండగా నిలబడి చర్యలు తీసుకోకపోవడం, సిలిండర్ల ధరలు పెంచడంలను ప్రస్తావిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు.

దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం, నినాదాలకే పరిమితమైన భేటీ బచావో భేటీ పడావో, సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కిచెన్ లో కన్నీళ్లు తెప్పిస్తున్న పరిస్థితి, మహిళకు విద్యా, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం అంటూ కౌంటర్ ట్వీట్ ఇచ్చారు.

“ఆడ బిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యం., ఆడబిడ్డ తలుచుకుంది .. ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది” అంటూ కవిత సంజయ్‌కు సమాధానంగా మోదీ ప్రభుత్వంకు చివరి రోజులు దాపురించినట్లు విమర్శలు గుప్పించారు. ఇక మహిళా సంక్షేమానికి కెసిఆర్ ఏం చేస్తున్నారో వివిధ పధకాలను ఆమె ఏకరువు పెట్టారు.

తెలంగాణ ఆడబిడ్డలకు తండ్రి లా, అన్నలా, తమ్ముడిలా, మేనమామలా మొత్తానికి మహిళా సంరక్షుడిగా సిఎం కెసిఆర్ వ్యవహరిస్తున్నారని ఆమె కొనియాడారు. మహిళా సంక్షేమానికి బిఆర్ ఎస్ ప్రభుత్వం కట్టుబడి వుందని, కంటికి రెప్పలా వారిని కాపాడుకునే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకున్నారని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టిన తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆమె స్పష్టం చేశారు.

అందుకు సమాధానంగా సంజయ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సొంత పార్టీలో మహిళా నేతలపైనే అకృత్యాలకు పాల్పడే గులాబీ కీచకులపై మౌనం, ఆడబిడ్డలను వేధించి పీడించి ప్రాణాలు తీసుకునే స్థితికి చేరినా ఆ నేతలపై చర్యలు శూన్యం అంటూ విమర్శలు చేశారు.
 పోడు భూముల కోసం పోరుబాట పట్టిన ఆడబిడ్డల చేతికి సంకెళ్లు వేసిన వైనం, పసి బిడ్డ నుంచి పండు ముసలి వరకూ ఎవరికీ లేని రక్షణ, తొలి కేబినెట్ లో కనీసం ఒక్క మహిళకు ప్రాతినిధ్యం దక్కకపోవడాన్ని ప్రస్తావించారు.

పాయఖానాలు సైతం లేక ఆడబిడ్డలు స్కూల్స్, కాలేజీలో అవస్థలు పడుతుంటే స్పందించని నిర్లక్ష్యం, డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో దగా చేసి మహిళలు గోస పెడుతున్నా అలసత్వం, బాలింతలు మృతి చెందినా పరామర్శించని కర్కశత్వం, రాజకీయాల కోసం మహిళా బిల్లు అంటూ వీధులకెక్కి నాటకాలు చేస్తున్న తీరుని తెలంగాణ మహిళా లోకం పసిగట్టిందని కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు గులాబీ పార్టీ పని పడతారని స్పష్టం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles