బండి సంజయ్ మార్పుపై బీజేపీలో గందరగోళం

Saturday, January 18, 2025

రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ ను మార్చే విషయంలో తెలంగాణ బీజేపీలో గందరగోళం నెలకొని ఉంది. సంజయ్ నేతృత్వంలో తెలంగాణాలో పార్టీ ముక్కలై, అందరూ మీడియా ప్రచారం కోసం తప్ప సంస్థాగతంగా పార్టీని పటిష్ట పరచేందుకు కృషి చేయడం లేదని విమర్శలు చెలరేగుతున్నాయి.

సంజయ్ నేతృత్వంలో తెలంగాణాలో ఒక్క సీట్ కూడా గెల్చుకోలేమని కేంద్ర నాయకులను కలిసిన పలువురు స్పష్టం చేశారు. దానితో నేడో, రేపో ఆయనను మార్చబోతున్నారనే వార్త కధనాలు వెలువడ్డాయి. సంజయ్ సహితం ఒక సభలో నిరాశతో `నడ్డా ఫోన్ చేయగానే అధ్యక్ష పదవి వదులుకునేందుకు సిద్దంగానే ఉన్నా..’ అంటూ చెప్పడం కూడా జరిగింది.

డిసెంబర్ లో ఐదు రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీలో, ప్రభుత్వంలో ప్రక్షాళన జరగాలని ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకులు కసరత్తు చేస్తున్నారు. అటువంటి సమయంలో బుధవారం ఒక వంక కేంద్ర మంత్రి కె కిషన్ రెడ్డి, మరోవంక పార్టీ రాష్త్ర ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్, బండి సంజయ్ వంటి వారు మీడియా ముందుకు వచ్చి `అధ్యక్షుడి మార్పు లేదంటూనే మారుస్తున్నారంటూ ఎందుకు వార్తలు వస్తున్నాయి?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.

మరోవంక, సంజయ్ ను మార్చని పక్షంలో బీజేపీలో కొనసాగడం సాధ్యం కాదనే సంకేతం ఢిల్లీలో ఇచ్చి వచ్చిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాత్రం నిబ్బరంగా కనిపిస్తున్నారు. ప్రగతి భవన్ నుండే తనపై దాడులకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

ఇటువంటి సమయంలో బండి సంజయ్ కు మద్దతుగా, ఈటెలకు వ్యతిరేకంగా ఈ మధ్య కొందరు నేతలతో తన ఇంట్లో సమావేశం జరిపిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్ చేయడం పార్టీలో కలకలం రేపుతోంది. దున్నపోతును తన్ని ట్రాలీలో ఎక్కిస్తున్న వీడియోను ట్వీట్ లో పోస్ట్ చేస్తూ.. తెలంగాణ బీజేపీ నేతలకు ఇలాంటి ట్రీట్ మెంట్ అవసరమని పేర్కొన్నాడు. ఈ వీడియో ట్వీట్ ను బిఎల్ సంతోష్, హోంమంత్రి అమిత్ షా, బన్సాలీకి ట్యాగ్ చేశారు.

మొత్తం మీద చూస్తుంటే తెలంగాణ బీజేపీ నాయకులలో తలెత్తిన సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కిషన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. వచ్చే ఏడాదిలోగా ఎన్నికలు జరిగే కొన్ని రాష్ట్రాలలో కేంద్ర మంత్రులనే రాష్త్ర పార్టీ అధ్యక్షులుగా నియమించాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.  ఆ మేరకు తెలంగాణ, ఒడిశా, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అధ్యక్షుల మార్పు జరుగబోతున్నట్లు చెబుతున్నారు.

దానితో రెండు రోజులుగా కిషన్ రెడ్డిని రాష్త్ర బీజేపీకి అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, వ్యూహాత్మకంగా అటువంటి ప్రయత్నాలు ఏవీ జరగడం లేదని, ఇలాంటి వార్తలు ఎందుకు వచ్చాయో తమకు తెలవదని అంటూ మీడియా ముందు అమాయకంగా ప్రశ్నించారు.

బండి సంజయ్ అయితే తనను అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తలు అన్ని సీఎం కేసీఆర్ కుట్రగా అభివర్ణించారు. గత ఏడాది కాలంగా తనను రాష్ట్ర అధ్యక్షుడిగా మారుస్తున్నారంటూ వస్తున్న వార్తలు సీఎం కేసీఆర్ చేస్తున్న కుట్రగా ఆరోపించారు.  బీజేపీలో తనకు వ్యతిరేకంగా ఏమి జరిగినా అందులో ఆయనకు ఎప్పుడు కేసీఆర్  కనిపిస్తుంటుంది.

 ‘‘తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై తరుణ్ చుగ్ సహా జాతీయ నాయకులు అనేకసార్లు స్పష్టమైన ప్రకటన చేశారు. అయినా నన్ను మారుస్తున్నారంటూ కొన్ని ఛానళ్లు పదేపదే వార్తలు రాస్తున్నాయి. ఆ వార్తలు చూసి చూసి మా కార్యకర్తలకు అలవాటైపోయింది. రాసి రాసి మీకు అలవాటైనట్లుంది” అంటూ కొట్టిపారేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles