బండి సంజయ్ ను వెంటాడుతున్న టెన్త్ పేపర్ లీక్ కేసు!

Saturday, January 18, 2025

నాటకీయ పరిణామాల అనంతరం హనుమకొండ కోర్టు బెయిల్ ఇవ్వడంతో టెన్త్ పేపర్ లీకేజీ కేసు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను వెంటాడుతున్నది. అసలు ఈ కేసులో తనకు సంబంధం లేదనట్లు, జైలు నుండి బైటకు వచ్చినప్పటి నుండి ఆ కేసు గురించి ప్రస్తావించకుండా  టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసునే ప్రస్తావిస్తూ, అందులో మంత్రి కేటీఆర్ దోషి అని, మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం వరంగల్ లో సంజయ్ ఆధ్వర్యంలో బిజెపి నిర్వహించిన నిరుద్యోగుల మార్చ్ లో నిరుద్యోగుల పరిస్థితులపైకన్నా తనపై `అక్రమంగా కేసు నమోదు’ చేసిన వరంగల్ పోలీసులపై ప్రతీకారం తీర్చుకోవడానికి అన్నట్లుగా బహిరంగసభలో మాట్లాడారు. అయితే సంజయ్ రెచ్చగొట్టే మాటలకు పోలీసులు రెచ్చిపోకుండా టెన్త్ పేపర్ లీకేజీ కేసులో తమదైన స్టైల్ లో ముందుకు వెడుతున్నారు.

ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న  బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బండి సంజయ్ తన సెల్‌ఫోన్ ఇవ్వడం లేదని..విచారణకు సహకరించడం లేదని పిటిషన్‌లో ఆరోపించింది. బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై వాదనలు విన్న హనుమకొండ కోర్టు నిర్ణయాన్ని మంగళవారంకు  వాయిదా వేసింది.

మరోవైపు ఈ కేసు విషయంలో బండి సంజయ్ గతంలోనే పోలీసులకు సమాధానం ఇచ్చారు. ఎంపీగా ఉన్న నాపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని అంటూ తన ఫోన్ పోయిందని ఇదివరకే ఫిర్యాదు చేశానని చెప్పారు. తన ఫోన్ దొరికే వరకు నన్ను విచారణకు పిలవొద్దని ఆయన స్పష్టం చేశారు.

ఒకవేళ పదే పదే తనకు నోటీసులు ఇస్తే.. ఈ విషయంలో లీగల్‌గా ముందుకు వెళతానని ఆయన పోలీసులకు తేల్చి చెప్పారు. ఈ మేరకు బండి సంజయ్ తరపున లీగల్ టీమ్ పోలీసులకు సమాచారం అందించింది. జైలు నుండి బైటకు రాగానే `నా ఫోన్ తో పోలీసులకు ఏంపని?’ అంటూ ప్రశ్నించిన సంజయ్ మూడు రోజుల తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో తన ఫోన్ పోయిందంటూ ఫిర్యాదు చేశారు.

మరొక సందర్భంలో ఆ ఫోన్ కేసీఆర్ వద్ద ఉందని, అందులో బిఆర్ఎస్ మంత్రులు, ఎమ్యెల్యేలు తనకు ఫోన్ చేసిన వివరాలు ఉండడంతో అవి బైటకు వస్తే ప్రమాదమని కేసీఆర్ ఆ ఫోన్ దాచుకున్నారని అంటూ పొంతనలేని మాటలు చెబుతూ వస్తున్నారు. ఏదేమైనా ఈ కేసు నుండి తప్పించుకోవడం కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

మరోవైపు ఈ కేసు తెరపైకి వచ్చిన తరువాత వరంగంల్ సీపీ రంగనాథ్, బండి సంజయ్ ల  మధ్య మాటల యుద్ధం నడిచింది. తనపై ఆరోపణలు చేసిన బండి సంజయ్‌కి వరంగల్ పోలీస్ కమీషనర్ రంగనాథ్ సవాల్ విసిరారు. తాను సెటిల్ మెంట్లు చేసినట్లు నిరూపించాలని సీపీ ఛాలెంజ్ చేశారు.

అయితే, ఇప్పటి వరకు సంజయ్ గాని, ఇతర బిజెపి నేతలు గాని రంగనాథ్ సవాల్ కు స్పందించనే లేదు. బండి సంజయ్ పోలీసులపై అనేక ఆరోపణలు చేస్తుంటారు. కొన్ని కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవడం వల్ల బాధ కలగొచ్చని రంగనాథ్ ఒక విధంగా ఎద్దేవా చేశారు. కానీ తాను ఎవరి పక్షాన ఉంటానో ప్రజలకు తెలుసని రంగనాథ్ చెప్పుకొచ్చారు.

తాను ఎక్కడ పని చేసిన ప్రజలు ఎక్కువగా గుర్తుంచుకుంటున్నారని అంటూ తాను సెటిల్ మెంట్లు చేస్తానని నిరూపిస్తే ఉద్యోగం వదిలేస్తానని సీపీ సవాల్ చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles