బండి సంజయ్ కొనసాగితే ఒక్క సీటు కూడా గెలవం!

Wednesday, December 18, 2024

మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తెలంగాణాలో మొన్నటి వరకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమదే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన బీజేపీ ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. కొత్తగా పార్టీలో చేరేవారు లేకపోగా ఉన్నవారే ఎవరు మిగులుతారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పార్టీలో నాయకులు ఎవ్వరికీ వారే అన్నట్లు వ్యవహరిస్తూ, పట్టీపట్టనట్లు మెలుగుతూ  ఎన్నికలకు సమాయత్తం కావడం పట్ల ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా తెలంగాణాలో పార్టీకి కొత్త ఊపు తీసుకు వస్తారని అగ్రనాయకులు భావించిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్, మాజీ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కొద్దిరోజులుగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. వారిద్దరూ కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది.

దానితో డామేజ్ కంట్రోల్ లో భాగంగా రంగంలోకి దిగిన హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా వారిద్దరిని శనివారం ఢిల్లీకి పిలిపించి మాట్లాడారు. వారు చెప్పిన అంశాలను ఓపికగా విన్నారు. ముఖ్యంగా  వారిద్దరూ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్  తీరుతెన్నులపై  ఆగ్రవేశాలు వ్యక్తం చేశారు. 

ఇదే విధంగా బండి సంజయ్ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవడం కష్టమని వారిద్దరూ తేల్చి చెప్పారు. సంజయ్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోనని పక్షంలో తమదారి తాము చూసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఒంటెద్దు పోకడలతో పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుందని, కర్ణాటక ఎన్నికల తర్వాత ఆయన గ్రూపులుగా నాయకులు వీడదీస్తూ ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులను చులకన చేస్తున్నారని తెలిపారు. 

తన అనుచరులకే అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇస్తూ పార్టీ కోసం పనిచేస్తే వారిని దూరంగా పెడుతున్నారని, పార్టీ బలోపేతం కోసం నిర్వహించే సమావేశాలకు తమకు సమాచారం లేదని, గతంలో ఉన్న విలువకూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కొత్తగా రాష్త్ర కార్యవర్గంలో సంజయ్ 125 మందిని నియమించిన తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము పార్టీ మారుతామని,   తాము బిజెపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతామనే జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేస్తూ బీజేపీలోని కొందరు నాయకులే తమను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసేందుకు కుట్ర చేస్తున్నారని వారిద్దరూ ఆరోపించారు. ప్రస్తుతం బిజెపిలో ఉన్నామని, భవిష్యత్తులో కూడా ఉంటామని పార్టీ బలోపేతం కోసం తమ వంతు కృషి చేస్తామని ఈటెల, కోమటిరెడ్డి స్పష్టం చేశారు. అయితే, తమను చేరమని కాంగ్రెస్ వైపునుండి తీవ్రమైన ఒత్తిడిలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో పూర్తిగా విఫలమైయ్యారని, వెంటనే ఆయనను పార్టీ బాధ్యతల నుంచి తప్పించి సీనియర్లకు అవకాశం ఇస్తే పార్టీ మరింత పుంజుకుంటుందని చెప్పారు. గతంలో పలుమార్లు విమర్శలు చేసి ప్రజల ముందు పార్టీ పరువు తీశారని, ప్రధాని మోదీ  9 సంవత్సరాల్లో ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించడంలో కూడా విఫలం అయ్యారని స్పష్టం చేశారు.

పార్టీలో అసమ్మతి నాయకులతో సమావేశం జరిపి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని, దీంతో చాలామంది నాయకులు ఇతర పార్టీలకు వలస వెళ్లేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వారు వెల్లడించినట్లు తెలిసింది. త్వరగా పార్టీకి కొత్త కార్యవర్గం నియమించి ఎవరికి బాధ్యతలు అప్పగించిన ఇతర నాయకులు అడ్డుపడకుండా చూస్తే అసెంబ్లీ ఎన్నికల నాటికి కమలం అన్ని నియోజకవర్గాల్లో బలం పుంజుకుంటుందని, అదే విధంగా ఇతర పార్టీల్లో అసమ్మతి నాయకులు బీజేపీలో చేరే అవకాశం ఉంటుందని చెప్పారు.

తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అమిత్ షా చాలా పట్టుదలతో ఉన్నారని చెబుతూ ఉన్నది ఉన్నట్టుగా అధినాయకత్వానికి చెప్పామని తెలిపారు. ఎన్నికలవేళ ఆలస్యం లేకుండా నిర్ణయాలు తీసుకుంటేనే మేలు జరుగుతుందని అంటూ భారం పార్టీ అగ్రనాయకత్వంపై వేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles