బీజేపీకి రాష్త్ర అధ్యక్షునిగా ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా తరచూ పొగడ్తలతో ముంచెత్తుతూ ఉండడంతో తనకు తిరుగు లేదనుకొని, ఒంటెత్తు పోకడలతో వ్యాహరించి చేతులారా పదవి పోగొట్టుకోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు. తన పదవిని తెలంగాణలోని బిజెపి నేతలే పితూరీలు చెప్పి హైజాక్ చేశారనే ఆగ్రహంతో ఇష్టం వచ్చిన్నట్లు చేయడం ప్రారంభించారు.
ఒక వంక సోషల్ మీడియాలో తన అనుచరులతో పార్టీలోని తన `ప్రత్యర్థుల’పై ముప్పేట దాడులు కొనసాగిస్తూ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్త్ర అధ్యక్షునిగా పార్టీ కార్యాలయంలో లాంఛనంగా బాధ్యతలు చేబడుతున్న సందర్భంగా తనలోని ఆక్రోశాన్ని అంతా వెళ్లగక్కారు. కొందరు పార్టీ నేతలు తనపై ఢిల్లీలో ఫిర్యాదులు చేసి తనకు పదవిని దూరం చేసారంటూ అర్థంలేని ఆరోపణలు చేశారు.
‘ఢిల్లీకి పోయి ఫిర్యాదులు చేయడం ఆపండి.. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పని చేసుకోనీయండి’ అంటూ ఈ సందర్భంగా సంజయ్ చేసిన వాఖ్యల పట్ల పార్టీ అధిష్టానం సీరియస్ అయిన్నట్లు తెలుస్తున్నది. ఎవ్వరో పితూరీలు చెబితే స్పందించే అంతటి బలహీనమైనది కేంద్ర నాయకత్వం అని సంజయ్ భావిస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు చెబుతున్నారు.
పైగా, కేంద్ర, రాష్త్ర నాయకులందరి సమక్షంలో మొన్నటి వరకు రాష్త్ర అధ్యక్షునిగా పనిచేసిన వ్యక్తం మాట్లాడటం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ తాజాగా బండిని పిలిపించుకుని సున్నితంగా మందలించినల్టు చెబుతున్నారు.
పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఇలా బహిరంగ వేదికపై నోరు జారడం ఏమిటని ప్రశ్నించినట్టు సమాచారం. రాష్ట్ర పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ ఉన్న వేదికపై అలా మాట్లాడటం హద్దు మీరినట్టేనని ఆయన స్పష్టం చేశారు. బీజేపీలో ఎంతో క్రమశిక్షణ కలిగిన నేతనని చెప్పుకుంటూ ఇలా మాట్లాడటం వెనుక అంతర్యం ఏమిటని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.
పదవిలో ఎవరు ఉండాలో, ఎవరు ఉండొద్దో నిర్ణయించేది అధిష్ఠానమైతే రాష్ట్ర నేతలకు ముడిపెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొన్నాళ్లపాటు మీడియాకు దూరంగా ఉండాలని, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది మాట్లాడొద్దని బండికి జవదేకర్ స్పష్టం చేసినట్టు తెలిసింది.
మరోవంక, తనను ఎందుకు పదవి నుండి తొలగించారో చెప్పకుండా, ఇంతకన్నా మరేదో గొప్ప పదవి ఇస్తారనుకొంటే జాతీయ కార్యవర్గ సభ్యునిగా చేసి ఊరుకోవడం పట్ల సన్నిహితుల వద్ద బండి సంజయ్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జాతీయ కార్యదర్శిగానో, కేంద్ర మంత్రిగానో చేస్తారు అనుకొంటే అటువంటి ప్రసక్తి ఎవ్వరు తేకపోవడంతో అసహనంకు గురవుతున్నారు.
అందుకనే, సోమవారం పార్లమెంటులోని హోం మంత్రి కార్యాలయంలో అమిత్ షా ను కలిసి తన ఆవేదనను వినిపించినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ దిగిపోయిన తర్వాత అమిత్ షాను బండి సంజయ్ కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బండి సంజయ్ తనను కలిసిన విషయాన్ని అమిత్ షా ట్వీట్ చేశారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. అయితే, ఎటువంటి భరోసా ఆయన నుండి సంజయ్ కు లభించలేదని చెబుతున్నారు.