ఫోన్ మిస్సింగ్ లో పోలీసులపై నెపం నెట్టివేస్తున్న బండి సంజయ్

Monday, December 23, 2024

రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితునిగా ఆరోపనలు ఎదుర్కొంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన ఫోన్ పోయిందని ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చేసిన నేరారోపణలు కీలక ఆధారంగా ఉన్న ఆ ఫోన్ తమకు ఇవ్వడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు.

పైగా, ఆధారాలు సేకరించేందుకు బండి సంజయ్ ఫోన్ ను తమకు ఇవ్వాలని పోలీసులు కోరారు.  అయితే, ఇప్పుడు బండి సంజయ్ తన ఫోన్ పోయిందని, వెతికిపెట్టాలరి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో తనతో ఉన్న పోలీసులకు కూడా తన ఫోన్ పోయిన విషయం తెలుసని, అప్పుడే సమాచారం ఇచ్చినట్లు చెబుతూ తన ఫోన్ మిస్సింగ్ నెపం పోలీసులపై నెట్టివేస్తున్నారు.

అయితే, పోలీసులు మాత్రం సంజయ్ తమకు ఫోన్ ఇవ్వట్లేదని, విచారణకు సహకరించట్లేదని కోర్టులో ఆరోపించారు. కానీ  పోలీసులే ఆయన ఫోన్ ను లాక్కున్నారని అంటూ సంజయ్ న్యాయవాదులు ఆరోపించారు. సంజయ్ సాధారణంగా వాడే మొబైల్ ఫోన్ కాకుండా, మరో ఫోన్ కూడా వాడుతున్నట్లు, ఆ ఫోన్ ను గోప్యత అవసరమైన అంశాలతోనే వాడుతున్నట్లు ఆయన ఫిర్యాదును పరిశీలిస్తే స్పష్టం అవుతుంది. అందుకనే ఈ కేసులో ఈ ఫోన్ కీలకంగా మారింది.

ప‌దో తరగతి పేపర్ లీకేజ్ కేసులో ఈ నెల 4వ తేదీన అర్ధ‌రాత్రి పోలీసులు బండి సంజయ్ ని అరెస్ట్ చేసి, బొమ్మల రామారం పీఎస్‌కు తరలించారు. ఈ క్రమంలోనే తన ఫోన్ పోయిందని ఆ ఫిర్యాదులో బండి పేర్కొన్నారు. ఫోన్‌లో కీలక సమాచారం ఉందని వెల్లడించారు. తన ఫోన్‌ను వెతికిపెట్టాలని పోలీసులను కోరారు.

పోలీసుల వద్దే తన ఫోన్ ఉందని, జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత తన ఫోన్‌తో పోలీసులకు ఏం పని? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. తనను కరీంనగర్‌లో అరెస్ట్ చేసి సిద్దిపేటకు తీసుకెళ్లే సమయంలో పోలీసుల వాహనంలో తన ఫోన్ మిస్ అయిందని ఫిర్యాదులో పొందుపర్చారు.

 పోలీసుల దగ్గరే తన ఫోన్ ఉందని, పోలీసుల మీదే తనకు అనుమానం ఉందని స్పష్టం చేస్తున్నారు. తన ఫోన్‌ను వెంటనే తనకు అప్పగించాలని కోరారు. ఆధారాలు సేకరించేందుకు తన ఫోన్‌ను పోలీసులు తీసుకున్నారని, తన ఫోన్ మిస్సింగ్‌పై అప్పుడే తాను పోలీసులకు సమాచారం ఇచ్చానని చెబుతున్నారు.

పోలీసులు తన ఫోన్‌ను అప్పగించడం లేదని, విచారణకు సహకరించడం లేదని కోర్టులో ఆరోపించారని అంటూ, పోలీసులే తన ఫోన్‌ను లాక్కున్నారని చెబుతూ పోలీసులను ఆత్మరక్షణలో పడవేసి ప్రయత్నం చేస్తున్నారు. ఫిర్యాదులో ఈ ఫోన్ తన చెల్లెలు పేరుతో ఉందని, అందులో కీలకమైన, రహస్య సమాచారం ఉందని అంటూ భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఫోన్ ను వాడుతున్నట్లు పేర్కొన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles