ఫేక్ స‌ర్టిఫికెట్ల దుమారంలో స్పీకర్ తమ్మినేని 

Sunday, January 12, 2025

తెలుగు దేశం పార్టీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించి, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో ఆశించిన మంత్రి పదవి లభించకపోయినా స్పీకర్ పదవితో సరిపెట్టుకుంటూ, ఏకపక్షంగా సభాకార్యక్రమాలు నిర్వహిస్తూ తరచూ వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇప్పుడు ఫేక్ సర్టిఫికెట్ల దుమారం చిక్కుకున్నారు. డిగ్రీ అర్హత లేకుండానే లా డిగ్రీ చేశారనే విమర్శలకు గురవుతున్నారు.

రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం ఆ పదవికి తీరని కళంకం తెచ్చారని, డిగ్రీ పూర్తి చేయకుండానే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న మహాత్మా గాంధీ లా కళాశాలలో మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సులు ఎలా చేరారని మాజీ విప్, తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు కూన రవికుమార్ తీవ్రమైన ఆరోపణలు చేశారు.

మూడు సంవత్సరాల లా కోర్సులో చేరాలంటే తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే 2019 మార్చి నెలలో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసినప్పుడు తమ్మినేని సీతారాం ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన అఫిడవిట్ లో తాను డిగ్రీ మధ్యలో ఆపేసినట్లు పేర్కొన్నారు. అయితే అదే సంవత్సరం ఆగస్టులో లా కళాశాలలో ఆయన చేరేందుకు దరఖాస్తు చేశారని ఇప్పుడు బైటపడింది.

డిగ్రీ పూర్తి చేయకుండా ఉన్న తమ్మినేని లా కోర్సు చేసేందుకు ఎటువంటి సర్టిఫికెట్లు అందజేశారు? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.  ఒకవేళ డిగ్రీ పూర్తి చేసిన సర్టిఫికెట్లు సమర్పించినా అవి నకిలీ సర్టిఫికెట్ లే అవుతాయని రవికుమార్ స్పష్టం చేస్తున్నారు.

ఫోర్జరీ సర్టిఫికెట్లతో లా కళాశాలలో చేరిన తమ్మినేని సీతారాం స్పీకర్ పదవిని అగౌరవపరిచారని, అటువంటి వ్యక్తి ఆ పదవిలో కొనసాగే హక్కులేదని టిడిపి నేత స్పష్టం చేశారు. ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తాను రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, రాష్ట్ర గవర్నర్ కు, హైకోర్టుకు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వ్యవహారంలో శాసనసభ స్పీకర్ ప్రతిష్టను పెంచేలా చేయాలంటే తక్షణమే స్పీకర్ పదవి నుంచి తమ్మినేనిని తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి కూడా స్పీకర్ తమ్మినేనిపై సంచలన ఆరోపణలు చేశారు.

2019లో స్పీకర్ అయ్యాక ఉన్నత చదువు కోసం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మహాత్మాగాంధీ లా కాలేజీ (ఎల్బీ నగర్, హైదరాబాద్)లో ఎల్ ఎల్ బి 3 ఏళ్ల కోర్స్ చదవటానికి అడ్మిషన్ పొందారని చెప్పారు. అకడమిక్ ఇయర్ 2019-20 హాల్ టికెట్ నెంబర్ 1724 1983 1298గా ఉందని తెలిపారు.

 ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్స్ చదవాలంటే కచ్చితంగా డిగ్రీ పాసై ఉండాలని, లేని పక్షంలో డిగ్రీకి సమానమైన అర్హత కలిగిన కోర్స్ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులని తెలిపారు.  డిగ్రీ మధ్యలోనే వదిలేసిన తమ్మినేని సీతారాం ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సులో ఎలా అడ్మిషన్ పొంచారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అని పేర్కొన్నారు.

అనేక టీవీ ఇంటర్వ్యూలలోనే ‘డిగ్రీ డిస్ కంటిన్యూడ్’ చేసినట్లు తమ్మినేని స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. సీతారామ్‌కు ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు ఏమైనా మినహాయింపు ఇచ్చారా? అని ప్రశ్నించారు. అత్యున్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles