తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క కొనసాగిస్తున్న పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. జులై రెండవ తేదీన ఖమ్మంలో భట్టి పాదయాత్ర ముగింపు సందర్భంగా ‘జనగర్జన’ పేరుతో పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. ఇదే సభలోనే ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా జరుగుతుంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే అధికారికంగా ప్రకటించారు. తద్వారా తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతానికి భట్టి విక్రమార్క దే పైచేయి అని పరిశీలకులు భావిస్తున్నారు.
ఖమ్మంలో భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు దశకు వస్తున్న సమయంలో ఆయన ‘‘జన గర్జన’’ సభను వేరుగా నిర్వహించాలని, పొంగులేటి చేరిక సభ వేరుగా ఉంటుందని కొందరు నాయకులు సంకేతాలు ఇస్తూ వచ్చారు. వేరువేరుగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం వలన పార్టీకి డబల్ అడ్వాంటేజీ అవుతుందనే తరహాలో చెప్పుకొచ్చారు. అయితే తెర వెనుక వ్యవహారాలను గమనించినప్పుడు.. భట్టి విక్రమార్కకు పాదయాత్ర వలన అడ్వాంటేజీ దక్కకుండా అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి వర్గం ఇలాంటి ప్రయత్నం చేసినట్టుగా ప్రచారం జరిగింది.
ఎందుకంటే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక సందర్భంగా ఆయన సభా నిర్వహణను చూసుకున్నట్లయితే భారీగా జన సమీకరణ ఉంటుంది. తన చేరిక ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కు హెచ్చరిక సంకేతాలు పంపాలని కలగంటున్న పొంగులేటి ఖమ్మం సభను ఎంత గ్రాండ్ గా నిర్వహించాలనే విషయంలో చాలా ఆలోచనలు చేస్తున్నారు. దాని తర్వాత భట్టి పాదయాత్ర ముగింపు సందర్భంగా జనగర్జన సభను విడిగా నిర్వహిస్తే జన సమీకరణ కష్టం అవుతుంది. వెంట వెంటనే రెండు కాంగ్రెస్ సభలకు జనాలను పోగేయడం పార్టీ శ్రేణులకు ఇబ్బందికరం అవుతుంది. స్వయంగా రాహుల్ గాంధీ కూడా ఈ సభకు హాజరవుతున్నారు కాబట్టి.. పరిసర జిల్లాల నాయకులందరూ కూడా జన సమీకరణలో తమ వంతు కష్టపడాల్సి ఉంటుంది. రెండు సభలుగా నిర్వహించినప్పుడు రాహుల్ పొంగులేటి సభకు మాత్రమే వస్తే సంకేతాలు వేరే విధంగా ఉంటాయి. పర్యవసారంగా భట్టి సభ వెలవెల పోతుంది.
ఇలాంటి ప్రమాదం తలెత్తకుండా మాణిక్ రావు ఠాక్రే చొరవ తీసుకున్నారు. జులై రెండవ తేదీన జరిగే సభ భట్టి పాదయాత్ర ముగింపు సభగా, ‘జనగర్జన’ సభగా మాత్రమే ఉంటుందని, అదే సభలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పార్టీలో చేరుతారని, ఆ సభలో రాహుల్ గాంధీ బట్టి విక్రమార్కను ఘనంగా సన్మానిస్తారని తేల్చి చెప్పారు. మరొకరకమైన భేదాభిప్రాయాలకు అవకాశం లేకుండా పొంగులేటి- భట్టి ఇద్దరి సమక్షంలోనే ఈ విషయాలను ఆయన ప్రకటించడం గమనార్హం. పాదయాత్ర ద్వారా భట్టి విక్రమార్క సృష్టించుకోగల అడ్వాంటేజీకి గండి కొట్టాలని కాంగ్రెస్ లోని ఒక వర్గం చేసిన ప్రయత్నాలు ఈ నిర్ణయాలతో వీగిపోయాయి.