రామచంద్రపురం సీట్ తమ కుటుంబానికి కాకుండా ప్రస్తుత మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణకు ఇస్తే రాజ్యసభసభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తామని అల్టిమేటం ఇచ్చిన సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రస్తుతంకు చల్లబడినట్లు కనిపిస్తున్నది. తాడేపల్లికి పిలిపించి, మరోసారి నియోజకవర్గంలో సర్వే జరిపిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆయన సహితం వెనుకడుగు వేశారు.
అయితే మంత్రి వేణుతో భేటీకి మాత్రం ససమేరా కుదరదని తేల్చి చెప్పారు. రామచంద్రాపురంలో తనపని తనదని, మంత్రి వేణు పని వేణుదని స్పష్టం చేశారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే నిలదీసేందుకు ముందుంటానని తేల్చి చెప్పారు. తన కార్యకర్తలను వేధిస్తూ, వారిపై భౌతిక దాడులకు పాల్పడుతుంటే బాధ కలిగి, రాజీనామా చేస్తానని చెప్పాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
అయితే ఇది వ్యూహాత్మక వెనుకడుగా? పార్టీ అధిష్టానంకు హెచ్చరిక పంపడం జరగడంతో ప్రస్తుతంకు మౌనంగా ఉండాలనుకొంటున్నారా? అన్నది ముందు ముందు గాని తేలే అవకాశం లేదు. ఆ విధంగా చెప్పడం ద్వారా పార్టీ అధిష్టానం చివరకు మంత్రి వెనుకే ఆ సీట్ కట్టబెట్టితే తనకు తిరగబడటం ఖాయం అనే సంకేతం కూడా ఇవ్వడం గమనార్హం.
తాడేపల్లి నుండి పిలుపు రావడంతో కుమారుడితో కలిసి వచ్చిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి, నియోజక వర్గ ప్రాంతీయ సమన్వయకర్త మిథున్ రెడ్డిలతో సమాలోచనలు జరిపారు. నియోజక వర్గంలో పరిస్థితులపై సర్వే నిర్వహించి, ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో దానిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నట్లు ఈ సందర్భంగా బోస్ ప్రకటించారు. పార్టీ అధిష్టానం నుంచి మంచి నిర్ణయమే వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు.
అయితే, నియోజక వర్గంలోని పార్టీ శ్రేణుల్లో గూడుకట్టుకున్న నిరాశను తొలగించి, వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు అవసరమైతే పార్టీకి రాజీనామా చేసి తాను లేదా తన కుమారుడు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తామని ప్రకటించాల్సి వచ్చిందని అంటూ తన `తిరుగుబాటు’ను సమర్ధించుకోవడం గమనార్హం.
కాగా, పార్టీని వీడుతానని తీవ్రమైన పదాలు ఉపయోగించినందుకు ముఖ్యమంత్రికి మీడియా సమక్షంలో ఎంపీ బోస్ క్షమాపణలు తెలిపారు. వెంకటాయపాలెంలో జరిగిన సమావేశంలో కార్యకర్తల ఆవేదన తనను బాధపెట్టడంతో అలా మాట్లాడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో జరిగిన పరిణామాలను జగన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యతతో పాటు కార్యకర్తలు ఆవేదన చెందినప్పుడు వారిని ఓదార్చాల్సిన బాధ్యత తనకు ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఇలా ఉండగా, జనసేనలో చేరబోతున్నట్లు రెండు రోజులుగా మీడియాలో వార్తలు వస్తుండగా మౌనంగా ఉంటూ వచ్చిన బోస్ తాడేపల్లి భేటీ తర్వాత ఆ కథనాలను కొట్టిపారవేసారు. సీఎం జగన్ కు తనకన్నా ఎవ్వరు వీర విధేయులు అన్నట్లు మాట్లాడారు.
‘జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టిననాటి నుంచి ఆయన వెన్నంటే ఉన్నానని, పార్టీ నిర్మాణంలో పాలు పంచుకున్నానని పార్టీకి ఒక మూల స్తంభం వంటి వాణ్నని చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం లేదు” అంటూ పేర్కొన్నారు. వైసీపీ తన సొంత పార్టీ అని, తన చేతులతో నిర్మించిన పార్టీ అని చెబుతూ .రాజశేఖరరెడ్డి నుంచి జగన్‌మోహన్‌రెడ్డి వరకు తనకు ఏ లోటు చేయలేదని, తనకు వ్యక్తిగత అవసరాలేమీ లేవని కూడా తెలిపారు.