ప్రధాని మోదీ కోసం చంద్రబాబు మరో తప్పటడుగు వేస్తున్నారా!

Monday, December 23, 2024

ప్రధాని నరేంద్ర మోదీతో తనకు సైద్ధాంతిక విభేదాలు లేవని, 2018లో కేవలం ఏపీకి ప్రత్యేక హోదా సెంటిమెంట్ విషయంలో ఎన్డీయేకు దూరం కావలసి వచ్చిందంటూ  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వాఖ్యలో తిరిగి ఎన్డీయేలో చేరేందుకు, అందుకోసమైనా ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు పొందేందుకు తాపత్రయ పడుతున్నట్లు ఓ తప్పుడు సంకేతం ఇచ్చినట్లయిందని పరిశీలకులు భావిస్తున్నారు.

రిపబ్లిక్ టీవీ జరిపిన `రిపబ్లిక్ సమ్మిట్’లో మాట్లాడుతూ మోదీ పాలనను ఆకాశానికెత్తారు. బహుశా, ఈ మధ్య కాలంలో బిజెపియేతర నాయకుడు ఎవ్వరూ మోదీ పరిపాలనపై ఇంతగా పొగడ్తల వర్షం కురిపించిన సంకేతాలు లేవు. పైగా, ఏపీలో నోటా కన్నా తక్కువ ఓట్లున్న బిజెపితో బంధం కోసం ప్రయత్నించడం ఓ విధమైన బలహీనతను వెల్లడి చేసినట్లయింది.

ముఖ్యంగా, బిజెపి అగ్రనాయకులు అందరూ టిడిపితో తమకు పొత్తు అవసరం లేదని ఖచ్చితంగా చెబుతూ వస్తున్నారు. మరోవంక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ మనుగడకు అవసరమైన `ఆక్సిజన్’ను అందిస్తున్నారు. దేశంలో బలమైన రాజకీయ నాయకులు ఇతర పార్టీలలోని కాకుండా, సొంత పార్టీలో కూడా ఉండకూడదనుకొంటున్న మోదీ, అమిత్ షా వంటి వారు చంద్రబాబుతో పొత్తు కోసం ముందుకు వస్తారనుకోవడం అపోహ మాత్రమే కాగలదు.

రాష్ట్ర విభజన విషయంలో, ఆ తర్వాత ఏపీకి కాంగ్రెస్ ఎంతగా ద్రోహం చేసిందో, బిజెపి సహితం అంతకన్నా ఎక్కువ చేసిందని రాష్ట్రంలో సాధారణ ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. అటువంటి సమయంలో, బీజేపీ నుండి ఏవిధమైన సానుకూల సంకేతాలు లేకుండా వారితో పొత్తుకోసం ఆరాటపడుతున్నామనే అభిప్రాయాన్ని చంద్రబాబు కలిగించడం రాజకీయంగా `ఆత్మహత్య సాదృశ్యం’ కాగలదని స్పష్టం అవుతుంది.

గతంలో ఆచార్య ఎన్జీ రంగా గురించి ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కారణంగా రాజకీయంగా ఎదగలేక పోయారని భావిస్తుండేవారు. ‘సరైన సమయంలో తప్పుడు నిర్ణయం తీసుకొంటారు’ అని చెబుతుండేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిష్టితి సహితం రాష్ట్ర విభజన దగ్గర నుండి అదేవిధంగా సాగుతూ వస్తుందనే విమర్శలు సొంతపార్టీ వర్గాల నుండే వినిపిస్తున్నాయి.

యుపిఎ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి రాష్త్ర విభజనకు సానుకూలంగా చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వకుండా ఉంటె, విభజనకు నాటి ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉండెడిది కాదు. పైగా, అసెంబ్లీలో ఆవేశంగా `దమ్ముంటే రాష్ట్ర విభజన చేయండి’ అంటూ ఒక విధంగా రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారు.

ఈ విషయాన్నీ సన్నిహితుల వద్ద చంద్రబాబు నాయుడు ఆ తర్వాత స్వయంగా ఒప్పుకున్నారు. అంతేకాదు. లేఖ ఇచ్చిన తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓటమి చెందింది. ‘ప్రజలు రాష్ట్ర విభజనను కోరుకోవడం లేదు’ అంటూ అప్పుడైనా విభజనకు వ్యతిరేకంగా స్వరం వినిపించినా మరో విధంగా ఉండెడిది.

2018లో ఎన్డీయే నుండి బైటకు వచ్చినా రాష్ట్రానికి పరిమితమై  ఉంటె ఒక విధంగా ఉండెడిది. కానీ రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లి జాయింట్ ప్రెస్ మీట్ లో ప్రసంగించడాన్ని మోదీ ఎన్నటికీ మరచిపోరని గ్రహించాలి. ఆ విధంగా చంద్రబాబు రాహుల్ ఇంటికి వెళ్లడాన్ని బీజేపీ అగ్రనేతలు కాకుండా కాంగ్రెస్ కు సన్నిహితంగా ఉండే శరద్ పవర్, మమతా బెనర్జీ వంటి నాయకులు సహితం ఆశ్చర్యం చెందారు. వారే ఇప్పటివరకు రాహుల్ ఇంటికి వెళ్ళాక పోవడం గమనార్హం.

అందుకనే ఏపీలో వైఎస్ జగన్ వంటి `కీలుబొమ్మ’ ప్రభుత్వం కావాలని బిజెపి అగ్రనేతలు కోరుకొంటున్నారన్నది స్పష్టం.  జగన్ ఓడిపోతే టీడీపీ ఎక్కడకు పోతుందిలే అన్నట్లు చంద్రబాబుతో అప్పుడప్పుడు చిరునవ్వులు చిందిస్తున్నారు. చంద్రబాబు సహితం హుందాగా, అదేవిధంగా ఉంటె అవసరం అనుకొంటే బీజేపీ వారే దగ్గరకు వస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ఎదురు దెబ్బలు తగిలితే టిడిపి వద్దకు రాక తప్పదు.

పైగా, ఏపీలో జగన్ ను వ్యతిరేకిస్తున్న వారంతా బిజెపిని కూడా వ్యతిరేకిస్తున్నారని గమనించాలి.  ఎమ్యెల్సీ ఎన్నికలలో ఓటమి అనంతరం స్వయంగా బిజెపి నేతలే కొందరు ఈ విషయం చెప్పడం గమనార్హం. చంద్రబాబు ఎన్డీయేలో ఉన్న సమయంలో సహితం మోదీ ప్రభుత్వం విభజన హామీల అమలు విషయంలో సహితం ఏపీ పట్ల ఉదారంగా వ్యవహరింపలేదని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles