ప్రధాని మోదీతో జగన్ ముందస్తు ఎన్నికల ప్రస్తావన

Wednesday, January 22, 2025

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ లతో జరిపిన భేటీ వివరాలను గోప్యంగా ఉంచారు. ఎప్పటి మాదిరిగా పోలవరంకు నిధులు, నిర్వాసితుల పునరావాస ప్యాకేజి, విభజన హామీలు, బియ్యం కేటాయింపు వంటి అంశాలపై వినతి పత్రాలు ఇచ్చారంటూ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఈ ప్రకటనలో కొత్తగా ఇప్పుడు ప్రస్తావించిన అంశాలను ఏవీ లేవు. ప్రతిసారీ ప్రస్తావిస్తున్న అంశాలకు ప్రత్యేకంగా ఢిల్లీ వచ్చి కావలసిన అవసరం లేదు. అయితే, ఏపీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల ప్రతిపాదన గురించి ప్రధాని, హోమ్ మంత్రిలతో జగన్ చర్చించారని జాతీయ మీడియా తెలుపుతుంది.

ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా రాజకీయంగా తనకు మేలు జరుగుతుందనే ఆలోచనలో ఉన్న సీఎం జగన్ అందుకోసం కేంద్రం నుంచి సహకారం తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే కధనాలు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఏడాది నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఊహాగానాలను సీఎం జగన్ అప్పుడప్పుడు తమ మంత్రుల దగ్గర తోసిపుచ్చుతూ వస్తున్నారు.

నవంబరు లేదా డిసెంబరులో తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, రాజస్థాన్‌, మిజోరం అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఏపీలో కూడా ఎన్నికలు జరిపించాలని జగన్‌ ప్రధాని మోదీని, అమిత్‌షాను కోరినట్లు చెబుతున్నారు. వీరిద్దరితో జగన్‌ భేటీ ముగియగానే ‘ఇండియా టుడే’ డిప్యూటీ ఎడిటర్‌ అక్షితా నందగోపాల్‌ ఈ విషయమై ఒక ట్వీట్‌ చేశారు. 

‘‘ఏపీ ఎన్నికలను ముందుకు జరిపి, ఈ ఏడాదిలోనే నిర్వహించడంపై చర్చ జరిగినట్లు తెలిసింది’’ అని ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత జగన్‌ అనుకూల మీడియా కూడా ‘ముందస్తు’కు సిద్ధం అంటూ బ్రేకింగ్‌లు, చర్చలలో హోరెత్తించడం విశేషం. ఎన్నికల్లో కలిసొచ్చేలా పోలవరానికి అధిక నిధులు ఇవ్వాలని, కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించేలా విరివిగా నిధులు ఇవ్వాలని చివరిగా కలిసిన నిర్మలా సీతారామన్ ను ఆయన  కోరినట్టు చెబుతున్నారు.

ముందస్తు ఎన్నికల కోసం కొద్దీ నెలలుగా జగన్ ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా సెప్టెంబర్ లోనే అభ్యర్థులను ప్రకటించాలనే ఉద్దేశ్యంతో తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియను దాదాపుగా కొలిక్కి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం జరిగిన పార్టీ వర్క్ షాపులో గతంలో గెలిచిన ఎమ్మెల్యేల్లో 18 మందికి టికెట్లు ఇవ్వబోమనే సంకేతాలను ఇచ్చారని వార్తలు వచ్చాయి.

అయితే, జగన్ విన్నపంపై ప్రధాని, హోమ్ మంత్రి ఏ విధంగా స్పందించారన్నది మాత్రం తెలియరావడం లేదు. వారి ఆమోదం లేకుండా ముందస్తు కోసం అంటూ అసెంబ్లీని రద్దుచేస్తే ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. అందుకనే ముందుగా వారిని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

కేంద్రం ఉదారంగా నిధులు, రుణాలకు అనుమతులు ఇస్తుండడంతో మరో ఒకటి, రెండు నెలలపాటు ఆర్ధిక ఇబ్బందులు లేకుండా సౌలభ్యం లభించిందని, ఆర్ధిక సంవత్సరం చివరి వరకు ఆగితే ఎన్నికల ముందు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని జగన్ భయపడుతున్నట్లు తెలుస్తున్నది. కేంద్రం కూడా లోక్ సభ ఎన్నికల హడావుడిలో ఉంటూ తమ ఆర్థిక సమస్యలపై పట్టించుకొనక పోవచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే, జగన్ తో పాటు ఢిల్లీలో ఉన్న వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి మాత్రం ముందస్తు ఎన్నికల గురించి ప్రధాని, హోమ్ మంత్రిలతో చర్చించారని కథనాలను తోసిపుచ్చారు. ఒక్క రోజు కూడా ముందుగా ఎన్నికలు జరిపే ఆలోచన తమ ప్రభుత్వంకు లేదని స్పష్టం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles