ప్రధాని మోదీకి జగన్ వకాల్తా.. ప్రతిపక్షాలకు రుసరుసలు!

Friday, November 22, 2024

ఎంతో వైభవంగా  నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్మించిన పార్లమెంట్ భవనంకు ప్రధాని స్వయంగా వచ్చే ఆదివారం ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పక్షాలకు మొక్కుబడిగా ఆహ్వానాలు స్పీకర్ కార్యాలయం ద్వారా పంపి ప్రభుత్వం సరిపెట్టుకుంది. కనీసం వారంతా హాజరయ్యే విధంగా చూసేందుకు చెప్పుకోదగిన ప్రయత్నం కూడా చేయడం లేదు.

ప్రధాన మంత్రి పార్లమెంట్ భవనంను ప్రారంభించడం పట్ల ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో భాగమైన రాష్ట్రపతి చేతగాని, లోక్ సభ స్పీకర్ ద్వారా గని ప్రారంభించ చేయాలనీ సూచించాయి. తమ వాదనను ప్రభుత్వం పట్టించుకోనందుకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు 19 రాజకీయ పక్షాలు సంయుక్త ప్రకటన చేశాయి.

అయితే ప్రతిపక్షాల బహిష్కరణకు హోమ్ మంత్రి అమిత్ షా చాలా తేలికగా తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిఒక్కరిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిందని, అయితే ఎవరి మనోభావాల మేరకు వారు స్పందిస్తారంటూ చెబుతూ ఊరుకున్నారు. కనీసం అందరూ హాజరు కావాలని విజ్ఞప్తి కూడా చేయలేదు.

ప్రతిపక్షాలు ఎవ్వరూ లేకపోయినా బిజెపి తన పార్టీ కార్యక్రమం మాదిరిగా, మిత్రపక్షాలతో కలిసి ఈ కార్యక్రమం జరిపేందుకు సిద్దపడుతున్నది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వకాల్తా పుచ్చుకొని ప్రతిపక్షాల బహిష్కరణ నిర్ణయాన్ని తప్పుబట్టారు. పైగా, అటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల చివాట్లు కూడా పెట్టారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై ట్వీట్ చేసిన జగన్ ముందుగా ప్రధాని మోదీకి పార్లమెంట్ ను జాతికి అంకితం చేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.

“గొప్ప, గంభీరమైన, విశాలమైన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసినందుకు శుభాకాంక్షలు. పార్లమెంటు, ప్రజాస్వామ్య దేవాలయం, మన దేశం యొక్క ఆత్మను ప్రతిబింబిస్తుంది.  మన దేశ ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినది. ఇలాంటి శుభకార్యక్రమాన్ని బహిష్కరించడం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు” అంటూ విపక్షాలకు జగన్ చురకలు అంటించారు.

అలాగే రాజకీయ విభేదాలన్నింటినీ పక్కనపెట్టి, ఈ మహత్తర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరుకావాలని కోరుతున్నానని జగన్ తెలిపారు. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి తన పార్టీ హాజరవుతుందంటూ చివర్లో జగన్ వెల్లడించడం ద్వారా తన `స్వామి భక్తి’ని చాటుకున్నారు. ఇప్పటికే పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన విపక్షాలపై జగన్ ట్వీట్ ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది చూడాల్సి ఉంది.

దేశంలో ప్రతిపక్ష శిబిరంలో రాజకీయ పక్షాలు అన్ని దాదాపుగా ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తుంటే, రెండు తెలుగు రాష్ట్రాలలోని మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలలో కదలిక లేకపోవడం గమనార్హం. వైసిపి, టిడిపి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మరోవంక, నిత్యం మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే బిఆర్ఎస్ తన అభిప్రాయాన్ని చెప్పలేదు. గురువారం చెబుతామని పార్లమెంటరీ పార్టీ నాయకుడు డా. కేశవరావు ప్రకటించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles