ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడెల్లా కొన్ని నాటకీయ, స్టీరియోటైప్ వ్యవహారాలు నడుస్తుంటాయి. ప్రధాని మోడీతో గానీ, హోం మంత్రి అమిత్ షా తో గానీ అపాయింట్మెంట్ దొరికిందంటే.. సీఎం వెళ్లి కొంత సేపు వారితో మాట్లాడి వస్తారు. తర్వాత సహజంగానే మీడియాను ఉద్దేశించి మాట్లాడకుండా వెళ్లిపోతారు. ఆ తర్వాత ఆయన తరఫున ఒక పత్రికా ప్రకటన విడుదల అవుతుంది. అందులో రాష్ట్రానికి ప్రత్యేకహోదా, రైల్వేజోన్, వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టుకు సత్వరమే పూర్తిగా నిధులు గట్రా గట్రా అన్నీ అడిగేసినట్టుగా ఒక జాబితా ఉంటుంది. ప్రతిసారీ ఆ ప్రకటనతో ఢిల్లీ పర్యటనను మమ అనిపిస్తారు. ముందే తయారుచేసి పెట్టుకున్న ప్రకటనలో తేదీలు మార్చి రిలీజ్ చేసినట్టుగా ఉంటుంది.
ఇలాంటి ప్రకటనల్లో తప్ప.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం గురించి చిత్తశుద్ధితో పోరాడే ఉద్దేశం అసలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నదా? అనేది ఇప్పుడు ప్రజలకు ఎదురవుతున్న పెద్ద ప్రశ్న. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉండగా.. ఒకవైపు ఆ పార్టీ కూడా ప్రత్యేకహోదా డిమాండ్ ను బలంగా వినిపిస్తున్న తరుణంలో.. దానిని సాదించాలంటే.. ఒకే ఒక్క దారి అని పేర్కొంటూ.. ఉప ఎన్నికలు రావడానికి అవకాశం లేనంత కాలదూరంలో తన పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు అలాంటి కార్యచరణ ఎందుకు మర్చిపోయారనేది ప్రజల సందేహం. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం తన పార్టీ ఎంపీలందరూ త్యాగాలు చేశారని డప్పు కొట్టుకున్న జగన్ రెడ్డి.. ఇప్పుడు కనీసం వారు గొంతెత్తి అడగాలని కూడా ఎందుకు దిశానిర్దేశం చేయలేకపోతున్నారు.
ఇటీవలి కాలంలో.. జగన్ ప్రత్యేకహోదాను ప్రత్యేకంగా ప్రస్తావించిన ఏకైక సందర్భం విశాఖలో మోడీ సభ. మోడీ ఉన్న సభలో తన ప్రసంగంలో హోదా కావాలని కూడా ఆయన అడిగారు. ప్రధానిని వంద రకాలుగా కీర్తించి.. హోదా లేకపోవడం వల్ల రాష్ట్రానికి నష్టాలను వివరించకుండా, దానిని పొందడంలో తమ హక్కు ఉన్నదని చెప్పకుండా.. మాటవరసకు ఆ పదం తన ప్రసంగంలో చొప్పించారు. అంతే.. తర్వాత యథాతథంగా మర్చిపోయారు.
ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతున్నాయి. మరి 25 మంది ఎంపీలను కలిగిఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యచరణ ఏమిటి? ప్రత్యేకహోదా కోసం వారు పార్లమెంటులో ఏం చేయబోతున్నారు? అని ఆలోచించడం ప్రజల తప్పు అవుతుందా?
కానీ, వైసీపీ ఎంపీలు హోదా కోసం తపిస్తారు, ప్రయత్నిస్తారు అనుకోవడం చాలా పెద్ద భ్రమ. భారతీయ జనతా పార్టీతో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ.. వారి ద్వారా తమ స్వకార్యాలు చక్కబెట్టుకోవడానికి ఇచ్చే ప్రాధాన్యం వారు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం ఇచ్చిఉంటే ఎప్పుడో వచ్చేసి ఉండేది అనే విమర్శ కూడా ప్రజల్లో వినిపిస్తోంది.
ప్రత్యేకహోదా అడిగే దమ్ముందా?
Thursday, November 14, 2024