ప్రతి 100 కి.మీ. కు ఓ ప్రత్యేక హామీ ఇస్తున్న నారా లోకేష్

Wednesday, January 22, 2025

తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన `యువగళం’ పాదయాత్ర శుక్రవారం 40వ రోజుకు చేరుకోగా, గురువారం నాటికి 510 కిమీ పూర్తి చేసుకుంది. గత డిసెంబర్ నెల 27వ తేదీ కుప్పంలో మొదలైన పాదయాత్ర చిత్తూరు, తిరుపతి జిల్లాల గుండా సాగి ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో కొనసాగుతోంది. 

వివిధ వర్గాల ప్రజలతో మమేకం అవుతున్న లోకేష్ ప్రతి వంద కిలోమీటర్ల యాత్ర పూర్తి అయిన సందర్బంగా స్థానికులకు ప్రత్యేక హామీలు ఇస్తూ గుర్తుగా శిలా ఫలకం ఏర్పాటు చేసే ఆనవాయితీ ని కొనసాగిస్తున్నారు. యాత్ర 8వ రోజు న 100 కిలోమీటర్ల మైలు రాయి దాటినప్పుడు గత ఫిబ్రవరి 3వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాలెం వద్ద కిడ్నీ వ్యాధి గ్రస్తులకు డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

అలాగే యాత్ర 16వ రోజున 200 కిలోమీటర్లు ఆదిగమించినప్పుడు గంగాధర నెల్లూరు వద్ద డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఫిబ్రవరి 11వ తేదీన హామీ ఇచ్చారు. తర్వాత ఫిబ్రవరి 21వ తేదీన 23 వ రోజున యాత్ర 300 కిలోమీటర్లు దాటినప్పుడు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమానుపురం వద్ద 13 గ్రామాల దాహార్తి తీర్చే నీటి పధకాన్ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు.

ఆపై మార్చి 1వ తేదీన 32వ రోజు యాత్ర 400 కిలోమీటర్లు చేరినప్పుడు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నరేంద్ర పురం వద్ద ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక గురువారం యాత్ర 39వ రోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం సి టీ ఎం వద్ద 500 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది.

ఆ సందర్బంగా సి టీ ఎం 2 వద్ద టమోటో ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రతి వంద కిలోమీటర్లు పూర్తి అయిన చోట ఒక శిలాఫలాకాన్ని ఆవిష్కరించి తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామనే హామీలను ఇస్తున్నారు.

గురువారం చేనేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడుతూ పవర్ లూమ్ 500 యూనిట్స్ విద్యుత్ ఎత్తేశారని పేర్కొంటూ వైఎస్సార్ బీమా ఏం చేశారని ప్రశ్నించారు. చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నా కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. సబ్సిడీ ఏం చేశారని ప్రశ్నించారు.

63 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం పట్టించు కోలేదని నారా లోకేష్ విమర్శించారు. చేనేత కార్మికులకు గుర్తింపులు లేవని,  బీసీ సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని తెలిపారు.  రియల్ టైం టెక్నాలజీతో ఆదుకుంటానని వారికీ హామీ ఇచ్చారు. జి+3 ఇళ్లు, మగ్గాలకు ప్రత్యేక సదుపాయం కల్పించాలని చెప్పారు. పింఛన్లు ఎత్తేశారని.. జీఎస్టీతో నేతన్నలు ఇబ్బంది పడుతున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles