తెలంగాణ మంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు అంటే.. ఆ పార్టీ నాయకులందరికీ కూడా పెద్ద పండగ వాతావరణమే అని ఒప్పుకుని తీరాలి. కేటీఆర్ అంటే నేడో రేపో కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా. అలాంటప్పుడు ఆయనను ప్రసన్నం చేసుకుంటే రాజకీయ భవిష్యత్తు దివ్యంగా ఉంటుందనే కోరిక ఎవరికి మాత్రం ఉండదు! అందుకే కేటీఆర్ పుట్టిన రోజు నాడు ఎవరికి తోచిన రీతిలో వారు చిత్రవిచిత్రమైన చర్యలతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని పార్శీగుట్ట సమీపంలో.. ఎమ్మెల్యే ముఠా గోపాల్, కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రజలకు ప్లాస్టిక్ బుట్టల్లో పెట్టిన టమోటాలను పంపిణీ చేశారు. జనం చాలా సహజంగా వీటికోసం ఎగబడడం కూడా జరిగింది.
టమోటా అనేది ప్రస్తుతం సంపన్నుల వ్యవహారంలాగా మారిపోయిన సంగతి ప్రజలందరికీ తెలిసిందే. హోటళ్లలో భోం చేస్తున్నప్పుడు.. కూరలో ఓ టమోటా ముక్క కనిపిస్తే చాలు.. ‘నువ్వు సుడిగాడివిరా’ అనుకుంటూ ఆ ముక్క పడిన వాడిని చూసి ఇతరులు అసూయ పడేంతటి పరిస్థితి. టమోటా దుకాణాల్లో బౌన్సర్లను పెట్టుకుని మరీ.. వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్న పరిస్థితి. ఇంతకు మించిన చిత్ర విచిత్రమైన పరిణామాలు ఎన్నో టమోటా అధిక ధరలతో ముడిపడి చోటుచేసుకుంటున్నాయి. వాటికి తోడు టమోటా అధికధరలకు ముడిపెట్టి బోలెడన్ని మీమ్స్ కూడా తయారవుతూ ఉన్నాయి. పొట్ట చెక్కలయ్యేలా ప్రజలను నవ్విస్తున్నాయి. ఇలాంటి వాతావరణంలో ఒక ఎమ్మెల్యే టమోటాలు పంపిణీ చేయడం అనేది చాలా గొప్ప విషయమే.
అయితే ఇందుకు ప్రజలు ఆనందించాలా? దుఃఖించాలా? అనే సంగతే అర్థం కావడం లేదు. ఎందుకంటే.. ప్రభుత్వాలు అంటే నిత్యావసరాల ధరలను నియంత్రణలో ఉంచేందుకు ప్రయత్నించాలి. టమోటా ధర విషయంలో అటు కేంద్ర, ఇటు రాష్ట్రప్రభుత్వాలు అన్నీ కూడా చేతకానివి అనే సంగతి తేలిపోయింది. టమోటా ధర ఆకాశాన్ని అంటే పెరిగిపోతూ ఉండడం దుఃఖించాల్సిన సంగతి కాగా, కేటీఆర్ పుట్టిన రోజు నాడైనా కాసిని టమోటాలను ఎమ్మెల్యే వచ్చిన వాళ్లందరికీ పంచిపెట్టడం కాస్త సంతోషం. అందుకే ముషీరాబాద్ ప్రజలు కేటీఆర్ ను ప్రతిరోజూ పుడుతూ ఉండవయ్యా కేటీఆర్ అని దీవిస్తున్నారు. ప్రతిరోజూ పుడుతూ ఉంటే.. ప్రతిరోజూ ఆయన పుణ్యమాని ఉచితంగా బుట్టెడు టమోటాలు దక్కుతాయనే తమాషా ఆలోచన వారిది కావొచ్చు. అయితే ఇలాంటి టమోటా దానం లాంటి కార్యక్రమాలు చేసి.. తామేదో జాతిని ఉద్ధరించినట్టుగా డప్పు కొట్టుకోకుండా.. నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ధరలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి.