`ప్రజారాజ్యం’ విలీనంపై మరోసారి పవన్ అసంతృప్తి!

Sunday, December 22, 2024

తన అన్న చిరంజీవి `ప్రజారాజ్యం’ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు క్రియాశీలంగా వ్యవహరించి, ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారంలో కూడా పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ లో విలీనం చేసి, ఇద్దరు ముగ్గురు ఎమ్యెల్యేలకు రాష్ట్రంలో మంత్రి పదవులు ఇప్పుచుకోవడంతో పాటు, చిరంజీవి రాజ్యసభకు ఎన్నకై కేంద్ర మంత్రి కాగలిగారు.

అధికారం లేకుండా ప్రజారాజ్యం పార్టీ మనుగడను కొనసాగించడం సాధ్యం కాదనే ఆలోచనతోనే చిరంజీవి అటువంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రజారాజ్యంను అదేవిధంగా కొనసాగించి ఉండినట్లయితే 2014 నాటికి అధికారపక్షంగా మారిఉండేదని ఆ పార్టీలోని వారే కాకుండా, పలువురు ఇతరులు కూడా భావించారు.

కానీ, అధికారం లేకుండా పార్టీని నడిపే రిస్క్ తీసుకొనేందుకు అప్పట్లో చిరంజీవితో పాటు, పార్టీలో ఆయనతో ఉన్న పలువురు సుముఖత వ్యక్తం చేయలేదు. ముఖ్యంగా పలువురు ఎమ్యెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి, అధికారంలో భాగస్వాములం కావాలని తొందరపడి ఈ విషయమై చిరంజీవిపై వత్తిడి తీసుకొచ్చారు.

ఇప్పుడు `వారాహి విజయ యాత్ర’లో పవన్ కళ్యాణ్ ఆనాటి రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ తమ రాజకీయ పార్టీకి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించిందన్నారు. అయితే కొంతమంది కోవర్టుల వల్ల పార్టీని విలీనం చేయాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజోలు జనసేన నాయకులు, కార్యకర్తల్లా ఆనాడు నాయకులు బలంగా నిలబడి ఉంటే పార్టీని విలీనం చేయాల్సిన అవసరం వచ్చేదే కాదని అంటూ నాటి ప్రజారాజ్యం పార్టీలో నాయకులుగా కొనసాగిన వారిపై ధ్వజమెత్తారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో  రాజోలు నుండి ఒక సీట్ లో మాత్రమే జనసేన పార్టీ అభ్యర్హ్టి గెలుపొందారు. అయితే,  గెలిచిన ఎమ్మెల్యే స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ వదిలిపెట్టి వెళ్లిపోయారని పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. అయితే, ఎమ్యెల్యే వెళ్లి అధికారపక్షంలో చేరినప్పటికీ ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరు వెళ్లలేదని గుర్తు చేశారు.

రాజోలులో మార్పు కోసం అక్కడి ప్రజలు చిరు దీపం వెలిగించారని, అది భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అఖండ జ్యోతిగా మారి ప్రజలందరికీ వెలుగునిస్తుందని అంటూ వచ్చే ఎన్నికల్లో జనసేన అఖండ విజయం కైవసం చేసుకుంటుందనే భరోసా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పక్క పార్టీకి వెళ్లిపోయినా ఈ ప్రాంత వాసులు ఇంతటి ఘన స్వాగతం పలికారని, ఓడిపోయిన తరువాత కూడా తనను ప్రజలు భుజం తట్టి అండగా నిలబడటం ఒక్క జనసేన పార్టీ విషయంలోనే జరిగిందని పేర్కొన్నారు.

నిజంగా ఈ రోజు పార్టీలోనే ఆ ఎమ్యెల్యే ఉండి ఉంటే భుజాలపై పెట్టుకొని చూసుకునేవాళ్లమని చెప్పారు. ఎమ్మెల్యే వెళ్లిపోయినా పార్టీకి అండగా ప్రజలు నిలబడ్డారని సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ పాలన నుంచి ఉభయ గోదావరి జిల్లాలను విముక్తి చేయాలని తాను ఇక్కడి నుండి తన యాత్ర ప్రారంభించానని చెబుతూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని 34 నియోజకవర్గాలపై జనసేన ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles