పోలీసుల అలవెన్స్ లలో జగన్ ప్రభుత్వం భారీగా కోత!

Sunday, December 22, 2024

డిప్యూటేషన్  పై వెళ్లి ఇతర విభాగాలలో పనిచేసే పోలీసులకు ఇస్తున్న ప్రత్యేక అలవెన్స్ లలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీగా కొత్త విధించింది.  పోలీస్ అలవెన్స్ ల్లో కోత విధిస్తూ జీవో నెం.79ను జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ పోలీస్ స్టేషన్ల సిబ్బందికి గతంలో కేటాయించిన 30 శాతం అలవెన్స్ ను పూర్తిగా తొలిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. 
అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే యాంటీ నక్సలిజం స్క్వాడ్ సిబ్బందికి ఉన్న 15 శాతం అలవెన్స్ ను కూడా తొలిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

ఏజెన్సీలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు అడిషనల్ హెచ్ఆర్ఏ కూడా కోత పెట్టింది. కానిస్టేబుల్స్ సైకిల్ అలవెన్స్ తొలిగించింది. ఏసీబీలో నేరుగా నియమితులైన వారి అలవెన్స్ 10 నుంచి 8 శాతానికి కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  డిప్యూటేషన్ పై ఏసీబీలో పనిచేస్తున్న వారి అలవెన్స్ కూడా 30 నుంచి 25 శాతానికి కుదించింది. జులై 12న అలవెన్స్ లలో కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం. 79ని తీసుకొచ్చింది. ఈ జీవోకు అనుకూలంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వానికి డీజీపీ కార్యాలయం ఓకే చెప్పింది. దీంతో పోలీసుల అలవెన్స్ ల్లో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది.

ఈ అల‌వెన్స్ ల‌లో కోత విధించడం ప‌ట్ల పోలీస్ వ‌ర్గాల‌లో అసంతృప్తి వ్య‌క్త‌మవుతున్న‌ది.. అలాగే విప‌క్షాలు సైతం ఈ కోత అల‌వెన్స్ ల జీవోను త‌ప్పుప‌డుతున్నాయి. శాంతిభద్రతలను కాపాడటంతో పాటు ప్రజల, ప్రభుత్వ ఆస్తులు, ప్రాణాలు కాపాడటంకోసం రేయింబవళ్ళు శ్రమిస్తున్న వారికి ఎప్పటి నుండో ఇస్తున్న అలవెన్స్ లను తొలగించడం ఏమిటని విస్తుపోతున్నారు.  

కానిస్టేబుల్‌కు చాలా ఏళ్లుగా సైకిల్‌ అలవెన్స్‌ను ఇస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు పోలీసులు ఎవరూ సైకిల్‌ వాడట్లేదని, రూ.300 సైకిల్‌ అలవెన్స్‌ తొలగించారు. సైకిల్‌ బదులు బైక్ వాడుతున్నాం కదా, బైక్ అలవెన్స్ ఇవ్వాలి కదా అంటూ సోషల్ మీడియాలో కొందరు బయటకు చెప్పలేక వాపోతున్నారు. విధులకు రావాలంటే వాహనం తప్పనిసరి కాబట్ దానికి తగ్గట్టు ఇతర అలవెన్స్ పెంచాలంటూ వాట్సాప్‌ గ్రూపుల్లో తమ ఆవేదనను వ్యక్తం చేసుకొంటున్నారు.

నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎందరో పోలీసులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్‌ నుంచి ఉన్నతాధికారుల వరకూ మందు పాతర్లకు, మావోయిస్టుల తూటాలకు ఎంతో మంది మరణించారు. మావోయిస్టు ప్రాంతాల్లో యాంటీ నక్సల్‌ స్క్వాడ్‌ను పోలీసుశాఖ ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతాల్లో ఉద్యోగం చేసే పోలీసులకు 15 శాతం రిస్క్‌ అలవెన్సును గతంలో ఇచ్చారు. 
తాజాగా ఈ రిస్క్‌ అలవెన్స్‌ను ప్రభుత్వం తొలగించింది.

దీంతో ఏఎన్‌ఎస్‌ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఎస్‌ఐకి పది నుంచి పన్నెండు వేల వరకూ జీతం తగ్గిపోగా, హెడ్‌ కానిస్టేబుల్‌కు రూ.8 వేలు, కానిస్టేబుళ్లకు రూ.6 నుంచి 8 వేల వరకూ అలవెన్స్ లు తగ్గిపోయాయని వాపోతున్నారు. ఈ కోతలకు ఎటువంటి హేతుబద్దత లేదని, కేవలం ప్రభుత్వపు దివాలాకోరు ఆర్ధిక పరిస్థితులను మాత్రమే అద్దం పడుతున్నట్లు స్పష్టం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles