పోలవరం ప్రాజెక్టుపై చేతులెత్తేసిన జగన్, మోదీ !

Monday, December 23, 2024

2019లో ప్రభుత్వం మారినప్పటి నుండి పోలవరం ప్రాజెక్ట్ ను సమాధి చేయడం ప్రారంభమైంది. వాస్తవానికి ఎన్నికలకన్నా ముందుగానే 2018 నాటికే ఈ ప్రాజెక్టు పూర్తికావలసి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం 2013లో తీసుకొచ్చిన భూసేకరణ సవరణ చట్టం కారణంగా భారీగా పెరిగిన నిర్మాణ వ్యయంను దృష్టిలో ఉంచుకొని సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించడంలో కేంద్రం జాప్యం చేయడంతో పూర్తి కాలేదు.

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాది లోగా ఈ ప్రాజెక్ట్ పూర్తిచేస్తామని కబుర్లు చెప్పారు. ఇప్పటికి కూడా కేంద్రం సవరించిన అంచనా వ్యయాన్ని సాంకేతిక కమిటీ ఖరారు చేసినప్పటికీ ఆమోదించి, నిధులను మంజూరు చేయడంతో ముందుకు వెళ్లడం లేదు. ఎంతసేపూ తన కేసుల విషయమై కేంద్రంతో లాబీ చేయడం మినహా ఏ ఈ నిధుల గురించి కేంద్రాన్ని గట్టిగా అడిగే ధైర్యం జగన్ చేయడం లేదు.

దానితో ఈ ప్రాజెక్ట్ ను పూర్తిచేసేందుకు గడువును ఎప్పటికప్పుడు పొడిగించుకొంటూవస్తు తాజాగా జూన్, 2025 నాటికి పూర్తి చేస్తామని కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. అంటే, మరో రెండేళ్ల వరకు పూర్తిచేయలేమని చేతులెత్తేసిన్నట్లయింది.

ఇప్పటికే పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన నిర్మాణ గడువు తాజాగా 2025 జూన్ వరకు పొడిగించినట్లు ఆంధ్రప్రదేశ్ సాగునీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి స్వయంగా వెల్లడించారు. గురువారం ఢిల్లీలోని జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన పోలవరం ప్రాజెక్టుపై జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన, సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. 

అయితే ప్రాజెక్ట్ నిర్మాణం గత ఐదేళ్లుగా జాప్యం జరుగుతూ రావడానికి కీలకమైన ఆర్థిక వనరులు, సవరించిన అంచనాల గురించి సమావేశంలో చర్చ అసలు జరగకపోవడం గమనార్హం.  కానీ,  సమావేశం అనంతరం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తవ్వాలన్నదే తమ సంకల్పమని అంటూ తీయని పలుకులు ఎప్పటి మాదిరిగా పలికారు.

నిర్మాణం వేగంగా పూర్తి చేసేందుకు వీలు కల్పిస్తూ అడహక్ నిధుల కింద రూ. 17,414 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అడిగితే, ఈ అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇవ్వడమే గాని నిర్దుష్టమైన సమాధానం ఇవ్వలేదు. సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లిన్నప్పుడల్లా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు హోమ్ మంత్రి అమిత్ షాకు కూడా పోలవరం నిధుల గురించి వినతి పత్రాలు ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. కానీ, కేంద్రం నుండి ఎప్పుడు కూడా ఎటువంటి స్పందన కనిపించడం లేదు.

2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడగానే కేంద్ర జలశక్తి మంత్రిగా ఉన్న ఉమా భారతి పోలవరంకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంను పరిష్కరించేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆమెను ఆ శాఖ నుండి మార్చారు. ఆమె తర్వాత ఆ శాఖను చేపట్టిన నితిన్ గడ్కరీ ఒకసారి పోలవరం పర్యటించి, ప్రతి మూడు నెలలకు ఒకసారి తాను వచ్చి పురోగతిని సమీక్ష జరుపుతానని ప్రకటించారు.

అంతేకాదు, పోలవరంకు కేంద్రం ఇవ్వాల్సిన నిధుల గురించి ఢిల్లీకి వచ్చి వివరాలు ఇస్తే ఒక నెల లోపు వచ్చేటట్లు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందో గాని ఆయన తిరిగి పోలవరం వైపు చూడనే లేదు. ఆ తర్వాత ఆ శాఖను ఆయన నుండి మార్చేశారు. గత ఇద్దరు మంత్రుల చేదు అనుభవాల దృష్ట్యా ప్రస్తుత మంత్రి మాటలతో కాలయాపన చేస్తూ, పోలవరం ముందుకు కదలకుండా మాత్రం చూస్తున్నారు.

ఏది ఏమైతే పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం పట్ల మోదీ ప్రభుత్వం ఆసక్తి లేదని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ప్రాజెక్ట్ ను పూర్తి చేయగల సాహసం చేసే పరిస్థితులలో సీఎం జగన్ లేరని వెల్లడి అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles