ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఏకపక్ష విభజనకు గురవడంతో వనరులు, ఆదాయం, ఆస్తులు అన్ని కోల్పోయి కనీసం రాజధాని కూడా లేకుండా బలవంతంగా గెంటివేతకు గురయిన రాష్ట్ర ప్రజలకు ఉజ్వలమైన భవిష్యత్ కు హామీ ఇవ్వగల పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఇవ్వగలమని చట్ట రూపకంగా భరోసా ఇస్తే సరిపెట్టుకున్నాము.
అయితే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇటువంటి భారీ ప్రాజెక్ట్ పూర్తయితే తిరిగి ఏపీ ఆర్ధికంగా కోలుకొని గుజరాత్ కు పోటీ ఇచ్చే విధంగా అభివృద్ధి చెందగలదనే అక్కసుతో గాని, రాజకీయ కారణాలతో గాని ఈ ప్రాజెక్ట్ ను నీరుకార్చేందుకు కుట్రలు పన్నుతూనే ఉంది.
ఈ కుట్రలను ఉహించనప్పటికీ, ఇటువంటి భారీ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కేంద్రం చేపడితే ప్రాధాన్యతల దృష్ట్యా సత్వరం పూర్తికావడం కష్టం కాగలదని, రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించే విధంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ప్రతి సోమవారం పోలవరం అంటూ వెంటపడి వేగంగా నిర్మాణపనులు చేపట్టి, 2019 ఎన్నికల లోగా పూర్తిచేసేందుకు కసరత్తు చేశారు.
అయితే, కేంద్రం అడుగడుగునా అడ్డంకులు కల్పించడం, ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేయకపోవడం, కనీసం ప్రాజెక్ట్ డిజైన్ ఆమోదం విషయంలో సహితం ఆలస్యం చేయడం, కేంద్రం తీసుకొచ్చిన పునరావాసం చట్టం ప్రకారం గణనీయంగా పెరిగిన నిర్మాణ వ్యయం మేరకు ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఇప్పటికీ పెంచకుండా అడుగడుగునా కేంద్రం అడ్డంకులు కల్పిస్తూ వచ్చింది. అయినప్పటికీ 70 శాతంకు పైగా నిర్మాణం పూర్తిచేశారు.
అయితే, ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాగానే కాంట్రాక్టర్ ను మార్చివేసి నిర్మాణం సకాలంలో పూర్తికాకుండా నేరమయ నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వచ్చారు. మరోవంక, కేంద్రంకు వినతి పత్రాలు ఇవ్వడమే గాని నిలదీసి అడిగే ధర్యం చేయలేదు. దానితో ప్రాజెక్ట్ నిర్మాణం మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనుకకు అన్నట్లుగా ఉంది. అసలు ఎప్పటికి పూర్తవుతుందే ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ఈ లోగా, మొత్తం ప్రాజెక్ట్ సామర్ధ్యంనే కుదించే ప్రయత్నం కేంద్రం చేస్తుంటే జగన్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. తాజాగా, ప్రస్తుతానికి ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని, అంత మేరకే నీటిని నిల్వ చేయనున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రశ్నకుసమాధానంగా లోక్ సభలో స్పష్టం చేయడం గమనిస్తే కేంద్రం కుట్ర వెల్లడి అవుతుంది.
పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల కాంటూరు పరిధిలో 92 టీఎంసీలే నీరు నిల్వ చేయబోతున్నారని ఇంతకాలం సాగునీటి రంగ నిపుణులు, రైతులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు వాస్తవమే అని స్పష్టం అయింది. 45.72 మీటర్ల కాంటూరులో 194.60 టీఎంసీల నీటిని గరిష్ఠ స్థాయిలో నిల్వ చేయకుండా, 92 టీఎంసీలకు సరిపుచ్చి ప్రాజెక్టును మినీ రిజర్వాయరుకే పరిమితం చేస్తారని కేంద్రం మాటలను బట్టి తేలిపోయింది.
పైగా, తొలి దశ సహాయ పునరావాసం కూడా ప్రాజెక్టు ఎత్తు మేరకే ఉంటుందని చెప్పారు. 1.06 లక్షల మంది నిర్వాసిత కుటుంబాల్లో తొలి దశలో 20,946 మందే ప్రభావితులవుతారని, అయితే 2023 ఫిబ్రవరి నాటికి కేవలం 11,677 కుటుంబాలకే పునరావాసం అమలు చేశారని తెలిపారు. అంటే పునరావాస కార్యక్రమాలలో, బడ్జెట్ నిధులలో సహితం భారీకోత విధించబోతున్నట్లు చెప్పకనే చెప్పారు.
ముందుగా అనుకున్నట్లు ప్రాజెక్టు 2023 మార్చిలోపు పూర్తయ్యే అవకాశం లేదని, అది మరింత ఆలస్యమవుతుందని కూడా కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. రెండో దశ, 45.72 మీటర్ల కాంటూరు గురించి ఆయన అసలు ప్రస్తావించకపోవడం గమనార్హం.
92 టీఎంసీల నిల్వకే పరిమితమైతే ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టుగా కాకుండా, మినీ రిజర్వాయరుగా మిగిలిపోతుంది. ఇంకోవైపు, 2020, 21 వరదలకు దెబ్బతిన్న డయాఫ్రం వాల్ మరమ్మతుకు రూ.1,900 కోట్ల దాకా వ్యయమవుతుందని అంచనా వేయగా, ఈ డబ్బులు మాత్రం ఇస్తామని కేంద్రం తెలిపింది.
ఈ డయాఫ్రం వాల్ మరమ్మతు పనులు చేస్తూనే తొలి దశను చకచకా పూర్తిచేసి, ఈ ఏడాది డిసెంబరులో ప్రాజెక్టును ప్రారంభించేసి, పోలవరాన్ని తానే పూర్తిచేశానని ప్రచారం చేసుకోవడానికి సీఎం జగన్మోహన్‌రెడ్డి సిద్ధపడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. అందుకే ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతను తగ్గించే కేంద్ర ప్రభుత్వ కుట్రలకు జగన్ తలవూపుతున్నట్లు స్పష్టం అవుతుంది.