పోటీకి సిద్ధపడుతున్న గల్లా అరుణకుమారి!

Sunday, November 17, 2024

మాజీ మంత్రి, చంద్రగిరి నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు గెలుపొందిన ఏకైక ఎమ్యెల్యేగా పేరొందిన గల్లా అరుణకుమారి తిరిగి ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా చంద్రగిరి నుండి ఓటమి చెందిన తర్వాత ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఉన్నప్పటికీ ఇక తాను రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండలేనని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సహితం స్పష్టం చేశారు. అయితే, కొద్దీ రోజులుగా ఆమె తిరిగి చంద్రగిరి నియోజకవర్గంలో తిరుగుతూ ఉండడంతో ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పలువురు భావిస్తున్నారు.

ఆమె కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి రెండుసార్లు ఎంపీగా ఉన్నారు. అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయనను టార్గెట్ గా చేసుకొని, ఆయన వ్యాపారాలపై దాడులకు దిగి, భారీ నష్టం కలిగించడంతో కొంతకాలంగా రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. పైగా, తన వ్యాపార పెట్టుబడులను అటు చెన్నైకి, ఇటు తెలంగాణకు తరలిస్తున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభకు పోటీ చేయడంపై కూడా ఆయన నిరాసక్తను వ్యక్తం చేశారని తెలుస్తున్నది. మరో అభ్యర్థిని చూసుకోమని ఇప్పటికే చంద్రబాబునాయుడుకు తెలిపారని చెబుతున్నారు. అటువంటి పరిస్థితులలో ఇప్పుడు హఠాత్తుగా చంద్రగిరి నియోజకవర్గంలో గల్లా అరుణకుమారి యాక్టివ్ కావడం రాజకీయ వర్గాలలో ఆసక్తి కలిగిస్తున్నది.
అరుణ పార్టీ నేతలతో సమావేశమై నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. స్థానికులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.దీంతో గల్లా అరుణ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నారని, ఆమె చంద్రగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సంకేతాలు ఇస్తున్నాయి. 

ఎన్నికలకు ముందు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని గల్లా అరుణను చంద్రబాబు నాయుడు,నారా లోకేష్ కోరినట్లు తెలుస్తోంది.ఆమె కనుక చంద్రగిరి నుంచి పోటీకి దిగితే ప్రస్తుత నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పులవర్తి నాని నుంచి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు అని  టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.  వైఎస్ జగన్ ఇప్పుడు చిత్తూరు జిల్లాపై ఫోకస్ పెట్టి, ఆ పార్టీకి ఒక సీటు కూడా దక్కకుండా చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 

అందుకనే అరుణ కుమారి వంటి నేతలను పోటీకి దింపడం అవసరమని చంద్రబాబు సహితం భావిస్తున్నట్లు తెలుస్తోంది.  చంద్రగిరి నుండి వరుసగా రెండుసార్లు గెలుపొందిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎం వైఎస్ జగన్ కు చాలా నమ్మకస్తుడు. అయితే ఇటీవల కాలంలో చిత్తూరు రాజకీయాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శాసిస్తూ ఉండడంతో భాస్కర్ రెడ్డి గాని, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గాని మంత్రి పదవులు పొందలేకపోయారు.  వారిద్దరూ వచ్చే ఎన్నికలలో తాము పోటీ చేయబోవడం లేదని ఇప్పటికే ప్రకటించారు. తమ కుమారులను ఎన్నికల బరిలోకి దింపుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles