ఎన్నికలు సుమారుగా మరో ఏడాది వ్యవధిలో జరుగుతాయని రాష్ట్రంలోని పార్టీలు సిద్ధం అవుతున్న వేళ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది! ఆ పార్టీలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న సీనియర్లు అనేక మంది.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి విముఖంగా ఉన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతమంది పూర్తిగా రాజకీయమే చాలించుకుందామని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మిగిలిన వాళ్లు తాము ఎన్నికలబరినుంచి తప్పుకుని తమ వారసులను ఇప్పుడే రంగప్రవేశం చేయించాలని ఆలోచిస్తున్నారు. వీరిలో చాలా మంది ఇప్పటికే జగన్ తో ఈ మేరకు సమాచారం కూడా ఇచ్చారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, విపరీతమైన సంక్షేమం చేసేస్తున్నామని మళ్లీ ఢంకా బజాయించి గెలుస్తామని వారంతా చెప్పుకుంటున్న తరుణంలో.. సీనియర్ నాయకులు ఎన్నికల బరినుంచి తప్పుకోవాలని ఎందుకు అనుకుంటున్నారనేది సస్పెన్స్ గా ఉంది. కర్ణాకర్ణిగా వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి.. అంతర్గతంగా పార్టీలో ఉన్న వాతావరణమే వారి వైముఖ్యానికి కారణమని వినిపిస్తోంది.
ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనే చాలా మంది సీనియర్ నాయకులు, రాబోయే ఎన్నికల్లో తాము పోటీచేయలేమని అవకాశం ఉంటే తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే వారినుంచి అలాంటి ప్రతిపాదనల్ని అప్పట్లో జగన్ ఖండించారు. ఈ ఎన్నికల్లో మాత్రం ఇప్పుడు సిటింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారంతా తప్పనిసరిగా పోటీచేయాల్సిందే. మీ వారసులకు అవకాశం కావాలంటే ఆ తర్వాతి ఎన్నికల్లో చూద్దాం అని జగన్ చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. మీరు పోటీనుంచి తప్పుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి అని కూడా ఆయన అన్నట్లుగా బయటకు వచ్చింది. అప్పటికి ఆ గొడవ సద్దుమణిగింది.
కానీ నెలలు గడుస్తున్నప్పటికీ.. ఇప్పటికీ చాలామంది సీనియర్లు రాజకీయం చాలించుకోవాలనుకుంటున్నారనే తెలుస్తోంది. వీరిలో కొందరికి జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఉదాహరణకు చెవిరెడ్డి భాస్కరరెడ్డి! చంద్రగిరి ఎమ్మెల్యే అయిన ఆయనకు మంత్రి పదవి రాలేదనే అసంతృప్తి ఉంది. ఆయన గడపగడపకు కార్యక్రమంలో సరిగా పాల్గొనడం లేదని ఇల్లిల్లు తిరగడం లేదని ఆ మధ్య సమీక్షలో జగన్ మందలించారు కూడా. ఆ తర్వాత కూడా ఆయనేమీ చురుగ్గా తిరుగుతున్నది లేదు. తిరగకపోగా.. తన కొడుకుతో నియోజకవర్గంలో పాదయాత్ర చేయిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు కొడుకే ఎమ్మెల్యేగా పోటీచేస్తారని అంతా అనుకుంటున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా పోటీనుంచి తప్పుకుంటారని, ప్రస్తుతం డిప్యూటీ మేయర్ గా ఉన్న కొడుకు అభిషేక్ రెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా పోటీచేస్తారని అంటున్నారు. ఇవి కేవలం ఉదాహరణలే. తాము తప్పుకోవాలని అనుకుంటున్న సిటింగుల సంస్థ పదికి పైగానే ఉందని సమాచారం.
పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లోనే ఇందరు రాజకీయం చాలించుకోవాలనుకుంటున్నారంటే దాని వెనుక మర్మం ఏమిటి? అది ప్రస్తుతానికి అంతు చిక్కడం లేదు. వీరిలో ఎందరిన జగన్ తప్పుకోడానికి అనుమతిస్తాడు. ఎందరి విషయంలో కఠినంగా ఉంటాడు. తప్పుకుంటే వారసులకు కూడా టికెట్లు ఇవ్వను అని భీష్మిస్తాడు అనే దానిని బట్టి.. వారు తప్పుకోవాలనుకోవడానికి గల కారణాలు బయటకు రావొచ్చు. పార్టీలో ప్రస్తుతం ఉన్న వాతావరణం పట్ల కొందరు సీనియర్లు ఇమడలేకపోతున్నారని తెలుస్తోంది.