పొత్తు లేకపోతే కన్నా, సుజనా, విష్ణుకుమార్ రాజు టీడీపీ వైపు

Monday, November 18, 2024

ఆంధ్ర ప్రదేశ్ లో  తమకు నోటా కన్నా తక్కువ ఓట్లు మాత్రమే ఉన్నా, సొంతంగా ఒక్క స్థానం కూడా గెలుచుకునే సామర్థ్యం లేకపోయినా టిడిపితో పొత్తుకు బిజెపి కేంద్ర నాయకత్వం విముఖంగా ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. పైగా, టిడిపితో పొత్తుకు ప్రయత్నం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సహితం స్వయంగా  ప్రధాని నరేంద్ర మోదీ వంటి వారే టిడిపితో కలవకుండా నిరుత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు. 

అధికారంలో ఉన్న, దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వంగా పేరొందిన వైసిపి అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కాపాడాలని ప్రధాని మోదీ నిశ్చయించుకున్నట్లు స్పష్టం అవుతున్నది. అందుకనే సొంతంగా సీట్లు గెల్చుకోవడంకన్నా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక తెచ్చేందుకే ప్రయత్నం చేస్తున్నారు. 

పైగా, చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయితే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ నాయకుడు కావడంతో బిజెపి నాయకత్వంకు పోటీగా మారవచ్చని భయం కూడా వారిని వెంటాడుతున్నది. సొంత పార్టీలోనే కాకుండా, ఏ పార్టీలో కూడా జాతీయ ప్రజల దృష్టిని ఆకట్టుకొనే నాయకులు ఎవ్వరు ఉండరాదనే మోదీ, అమిత్ షా ద్వయం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఒక విధంగా వారిని అభద్రతా భావం వెంటాడుతున్నది. 

అయితే, ఏపీ బీజేపీలో జగన్ నుండి నెలవారీ ముడుపులు స్వీకరిస్తున్నట్లు సొంత పార్టీ వారి నుండే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొద్దిమంది నాయకులు తప్ప, కొద్దో, గోప్పో ప్రజాబలం గల నాయకులందరూ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే తమ రాజకీయ భవిష్యత్ ను బలి ఇవ్వడంగానే ఆందోళన చెందుతున్నారు. అందుకనే, టిడిపితో బిజెపి పొత్తు పెట్టుకొనని పక్షంలో తమదారి తాము చూసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 

పుష్కరకాలం పాటు మంత్రిగా ఉంటూ ఐదుసార్లు ఎమ్యెల్యేగా గెలిచినా బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే టిడిపి నాయకత్వంతో సమాలోచనలు జరుపుతున్నారు. తాజాగా, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ సహితం స్వయంగా వెళ్లి కన్నాను కలిశారు. ఆ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీ నుండి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలిసింది. 

అదేవిధంగా 2014లో విశాఖపట్నం నుండి శాసనసభకు ఎన్నికై, పార్టీ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించిన ప్రస్తుత బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సహితం పొత్తు లేని పక్షంలో టీడీపీలో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. 2014 ఎన్నికల తర్వాత టిడిపి నుండి బీజేపీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి సహితం స్వయంగా మోదీ, అమిత్ షా లను కలసి టిడిపితో పొత్తు అవసరాన్ని నచ్చచెప్పే ప్రయత్నం చేసారని తెలుస్తున్నది. 

అయితే, వారి నుండి సానుకూల స్పందన లేకపోవడంతో విసుగు చెందిన ఆయన కూడా టిడిపిలో చేరి విజయవాడ నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. విజయవాడ సీట్ కోసం టిడిపిలో ప్రస్తుత ఎంపీ  నాని,ఆయన తప్పుడు  తగువు  పడుతూ ఉండడంతో ఓ విధంగా సుజనా అభ్యర్థి కావడం చంద్రబాబుకు సహితం ఎంతో ఉపశమనం కలిగించినట్లు కాగలదు. 

ఇక, మరో మాజీ రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ బీజేపీలో చేరినా ఆయన కుమారుడు ఇప్పటికి కర్నూల్ టిడిపి ఇంచార్జ్ గా ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్థిగా అక్కడి నుండి పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి డి పురందేశ్వరి సహితం టిడిపితో పొత్తుతో లోక్ సభకు పోటీ చేయాలని ఉత్సాహం చూపుతున్నారు. పొత్తు లేని పక్షంలో ఆమె కుమారుడు టిడిపి అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ  చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.  

కడప జిల్లాలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సహితం పొత్తు లేని పక్షంలో తిరిగి మాతృ పార్టీలో ప్రవేశించి, టిడిపి అభ్యర్థిగా కడప జిల్లాలో పోటీకి ఉత్సాహం చూపుతున్నారు.  పొత్తు లేకుండా బీజేపీలో బలమైన అభ్యర్థులు ఎవ్వరు పోటీకి ఆ పార్టీలో మిగిలి ఉండే ఆస్కారం లేదని స్పష్టం అవుతుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles