పొత్తులపై పవన్ వెనుకడుగు! సీఎం పదవిపై పట్టు!!

Friday, November 22, 2024

మొన్నటి వరకు వచ్చే ఎన్నికలలో వైసిపి వ్యతిరేక ఓటు చీలకుండా, `వైసిపి ముక్త ఆంధ్ర ప్రదేశ్’ కోసం టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడిగా పోటీచేయాలని చెబుతూ వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ విధమైన పొత్తుల కోసం తాను కృషి చేస్తానని చెప్పుకొంటూ వచ్చారు. ఒక విధంగా ఈ మూడు పార్టీలు కలసి వచ్చేటట్లు చూడటం తన బాధ్యత అన్నట్లుగా స్పష్టం చేస్తూ వచ్చారు.

కానీ `వారాహి విజయ యాత్ర’ ప్రారంభించినప్పటి నుండి గత వారం రోజులుగా ఆయన ధోరణి పొత్తుల విషయంలో పూర్తిగా మారిపోయింది. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తానని మాటమాత్రంగా కూడా చెప్పడం లేదు. పైగా, యాత్ర సందర్భంగా `ముఖ్యమంత్రి పదవి ఇస్తే .. ‘ అంటూ ప్రజలకు హామీలు ఇస్తూ వస్తున్నారు. ఆయన మద్దతుదారులు సహితం `సీఎం సీఎం పవన్’ అంటూ నినాదాలు ఇస్తున్నారు.

తాజాగా, పొత్తుల విషయం తన చేతులలో లేదని తేల్చి చెప్పారు. అది ఏ స్థాయిలో ఎలా జరగాలి అనేడిది తానొక్కడినే ప్రతిపాదించేది కాదని స్పష్టం చేశారు. అందుకోసం, అన్ని పార్టీల నుంచి ఏకాభిప్రాయం రావాలని అంటూనే ఏకాభిప్రాయం కుదరడం కొంత కష్టసాధ్యమైన విషయమని కీలక వ్యాఖ్యలు చేసారు.

అంటే పొత్తుల విషయమై పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదని చెప్పకనే చెప్పారు. ఎన్నికలు దగ్గరపడ్డాక పొత్తులపై మరింత స్పష్టత వస్తుందని చెప్పటం ద్వారా పొత్తులకు ద్వారాలు మూసుకు పొలేదనే సంకేతం ఇచ్చారు. పొత్తుల విషయమై తన వైపు నుంచి తాను చెప్పానని,  తాను ఇప్పటికే మూడు సార్లు చంద్రబాబును కలిసానని గుర్తు చేశారు.

అంటే పొత్తుల గురించి ఇక చంద్రబాబు చొరవ తీసుకోవాలి గాని, తాను కాదనే సంకేతం ఇచ్చారు. ఇన్నిసార్లు చంద్రబాబును కలిసినా ఒక్కసారీ సీట్లు గురించి చర్చించలేదని పవన్ చెప్పడం ద్వారా పొత్తులకు సంబంధించిన ప్రాధమిక చర్చలు కూడా ప్రారంభం కాలేదని వెల్లడించారు.

మూడు నెలల క్రితం `పవన్ సీఎం సీఎం’ అని మద్దతుదారులు నినాదాలు ఇస్తుంటే వారించేవారు. వాస్తవాలు తెలుసుకోకుండా సీఎం పదవి కోరడం భావ్యం కాదని హితవు చెప్పేవారు. కానీ ఇప్పుడు, అభిమానులు సీఎం..సీఎం అని నినదిస్తుంటే..’నేను సిద్ధం’ అని సంకేతాలు పంపానని చెప్పుకొచ్చారు.

సీఎం సీఎం అని తన వాళ్లు అదేపనిగా అరుస్తుంటే… తన కేడర్‌ స్టేట్‌మెంట్‌ను ఆమోదించానని వెల్లడించారు. అంటే, ముఖ్యమంత్రి పదవిలోకి రావడం తన లక్ష్యం అన్నట్లుగా చెప్పకనే చెప్పారు. అదీకాకుండా, ముఖ్యమంత్రి పదవి ఒకేసారి వస్తుందా? అంచెలంచెలుగా వస్తుందా? అనేది చూడాలని చెప్పడం ద్వారా టిడిపితో పొత్తు పెట్టుకోవాలంటే ముఖ్యమంత్రి పదవిని రెండు పార్టీలు పంచుకోవలసిందే అనే సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

కోట్ల మంది జీవితాలను ముందుకు తీసుకువెళ్లే పదవి అంటే చాలా అనుభవం కావాలని చెబుతూ అందుకోసమే క్షేత్రస్థాయి పర్యటనలు, సమస్యలపై అవగాహన తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు పరోక్షంగా తన యాత్ర ఉద్దేశ్యాన్ని బయటపెట్టారు. సీఎం అని తన వాళ్లు అనుకుంటే సరిపోదని.. ప్రజలు కూడా అనుకోవాలని పవన్ తేల్చి చెప్పారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles