పొత్తులకు `సీఎం అభ్యర్థి’ షరతు కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం

Sunday, December 22, 2024

వచ్చే ఎన్నికలలో  వైసీపీ వ్యతిరేక ఓటు‌ చీలనివ్వను అన్న దానికి కట్టుబడి ఉన్నామని, అందుకోసమే కలిసివచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని మరోసారి స్పష్టం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులకు ముఖ్యమంత్రి పదవి షరతుకాబోదని తేల్చిచెప్పారు.  టిడిపితో పొత్తుకోసం తాము ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని కోరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారవేసారు.

టిడిపి, బీజేపీలను ప్రాధేయపడితే ముఖ్యమంత్రి పదవి రాదనీ, తమ బలం పెరిగితే అదంతటఅదే  వస్తుందని చెబుతూ ప్రస్తుత కర్తవ్యం ఈ ప్రభుత్వాన్ని సాగనంపడమే అని చెప్పారు. తమ పార్టీ వ్యూహాత్మక పొత్తులను ఏర్పరచడానికి ఆసక్తిగా ఉందని  చెబుతూ కూటమి ఏర్పాటును మొదట్లో వ్యతిరేకించే ఏ పార్టీనైనా ఒప్పించేందుకు తాను వ్యక్తిగతంగా కృషి చేస్తానని తెలిపారు.

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక పొత్తుల ఏర్పాటును నిర్దేశించకూడదని కల్యాణ్ ఉద్ఘాటించారు. సీట్ల పంపకానికి సంబంధించిన ప్రమాణాలను వివరిస్తూ.. ఒక్కో పార్టీ బలం ఆధారంగా నిర్ణయిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తే జూన్‌లో క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పర్యటనలు ప్రధానంగా జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటాయని వెల్లడించారు.

‘భవిష్యత్తు లో ఎవరెవరు ఎలా కలుస్తామో చూడాలి. పొత్తలకు సంబంధించి ఆయా పార్టీ ల విధానాలు బట్టి ఉంటుంది. ప్రతి పార్టీ కి కొంత ఓటు శాతం ఉంటుంది… వాటిని బట్టి అడుగులు ఉంటాయి. వైసీపీ దుర్మార్గపు పాలన వల్లే వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అని తన విధానాన్ని వివరించారు.  తాను తన ఉనికి కోసం రాజకీయ పార్టీ పెట్టలేదని అంటూ అసెంబ్లీ లో బలమైన సమూహాన్ని పంపాలనేది‌ చూస్తామని తెలిపారు. 

2019 ఎన్నికల్లో 137 మంది అభ్యర్థులు ను పోటీకి పెట్టగలిగామని గుర్తు చేశారు. వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే… ప్రజలను ఇబ్బందులు పెడుతుంటే చూస్తూ కూర్చుంటామా అని ప్రశ్నించారు. “నేను పొత్తులు పెట్టుకుంటాను… బిజెపి కి ఇదే చెప్పాను. టిడిపి తో పొత్తు పై కూడా జనసేన సొంతంగా వెళ్లాలి” అని వివరించారు.

“నేను సిఎం అన్నారు. 2019 లో మాకు 30-40 స్థానాలు ఇచ్చి ఉంటే మేము బలంగా పోరాటం చేసే వాళ్లం. నేను సిఎం గా ఉండాలంటే కనీసం స్థానాలు ఉంటే మాట్లాడవచ్చు. నేను ఒక కులం కోసం పని‌చేయడం లేదు… రాష్ట్రం కోసం పని చేస్తున్నా. అందరూ కలిసి వస్తే… మా అభిప్రాయాలను గౌరవించే పార్టీ ల పొత్తుతో వెళతాం. ఈసారి‌ వైసీపీ దాష్టికాలను అడ్డుకుని సాగనంపుతాం” అంటూ భరోసా వ్యక్తం చేశారు.

తమకు బలం ఉన్న చోట మాత్రం తప్పకుండా మెజారిటీ స్థానాలు తీసుకుంటామని తెలిపారు.  “రాష్ట్ర భవిష్యత్తు బలోపేతం, వైసిపి నుంచి రాష్ట్రాన్ని రక్షించడం నా బాధ్యత. సిఎం పదవి మనల్ని‌ వరించాలి కానీ, వాటి కోసం పాలకులాడే వ్యక్తిత్వం నాది కాదు. వాళ్ల‌కోసం, వీళ్ల‌కోసం పవన్ పని చేస్తాడనే వాదన వదిలేయండి. గెలిపించే బాధ్యత తీసుకోకుండా ఉచిత సలహాలు ఇవ్వకండి” అంటూ హితవు చెప్పారు. తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అంటూ అందుకు ఎటువంటి నిర్ణయం అయినా తీసుకుంటానని చెప్పారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles