మునుగోడు ఉపఎన్నికల్లో తమ మద్దతుతో తమ అభ్యర్థిని సునాయనంగా గెలిపించుకున్న సీఎం కేసీఆర్ ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు గురించి ప్రస్తావించక పోవడంతో వామపక్షాలు అసహనంకు గురవుతున్నాయి. వామపక్షాలకు కంచుకోటగా భావించే ఖమ్మంలో జరిగిన బిఆర్ఎస్ మొదటి బహిరంగసభకు సహితం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల ప్రతినిధులు హాజరై, బిజెపిని ఓడించడం కోసం వచ్చే ఎన్నికలలో ఉమ్మడిగా పోటీచేస్తామని ప్రకటించారు.
రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభలలో వామపక్షాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇప్పటి వరకు స్వాతంత్య్రం అనంతరం ఇక్కడ వారికి అటువంటి పరిస్థితి ఏర్పడలేదు. పైగా, ఒకొక్క ఎన్నికల సమయంలో ఒకొక్క పార్టీతో (ఒక సారి టిడిపి, మరోసారి కాంగ్రెస్) పొత్తు పెట్టుకొంటూ గత నాలుగు దశాబ్దాలుగా గరిష్టంగా సీట్లు గెల్చుకొంటూ వస్తున్నారు.
అయితే, 2014 నుండి ఏ పార్టీ కూడా వామపక్షాలతో పొత్తుకు రెండు రాష్ట్రాలలో కూడా ముందుకు రావడం లేదు. దానితో రాజకీయంగా ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడడంతో మునుగోడు ఉపఎన్నికను అవకాశంగా తీసుకొని బిఆర్ఎస్ కు దగ్గర కాగలిగారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణా అసెంబ్లీలో ప్రాతినిధ్యం పొందేందుకు సమాయత్తం అయ్యారు.
అయితే, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల కీలక నాయకులు ఆశిస్తున్న నియోజకవర్గాలలో గత ఎన్నికలలో వారిని ఓడించిన బిఆర్ఎస్ నేతలు ఉండడంతో ఆయా సీట్లను ఇవ్వడం సీఎం కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారేఅవకాశం ఉంది. అందుకోసమే సిపిఎం, సిపిఐ నాయకులు ఒకొక్కరిని శాసనమండలికి పంపేందుకు నిర్ణయించినట్లు మీడియాకు లీక్ వదిలారు. అయితే, ఈ విషయమై కూడా కమ్యూనిస్ట్ పార్టీలతో చర్చించిన దాఖలాలు లేవు.
అసలు ఎన్ని సీట్లు తమకు కేటాయిస్తారో ముందు తేల్చుకోవాలని వామపక్షాలు భావిస్తున్నాయి. కేసీఆర్ ధోరణి చూస్తుంటే చెరో రెండు సీట్లు మించి ఇచ్చేటట్లు కనబడటం లేదు. వారయితే, కనీసం నాలుగైదు సీట్లు ఆశిస్తున్నారు. ఇట్లా ఉండగా, 9 నియోజకవర్గాలపై దృష్టి సారించినట్లు సిపిఎం సంకేతం ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌తో పొత్తు, రాజకీయ సర్దుబాటు చేసుకున్నప్పటికీ ఈ నియోజకవర్గాలకై పట్టుబట్టేందుకు సీపీఎం రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది.
ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో ఇటీవల జరిగిన పార్టీ కార్యదర్శివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతానికి పార్టీ కేడర్ బాగా ఉన్న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో పోటీ చేయాలని కూడా నిర్ణయించారు. సిపిఐ సహితం దాదాపు అటువంటి వ్యూహం అనుసరిస్తుంది. దాదాపు అభ్యర్థులను కూడా ఒకొక్క నియోజకవర్గంలో నిర్ణయించారు.
అయితే కేసీఆర్ ధోరణి చూస్తుంటే ఎన్నికల ప్రకటన వచ్చేంతవరకు వామపక్షాలతో సీట్ల సర్దుబాటు విషయం తేల్చేందుకు సిద్ధంగా లేన్నట్లు తెలుస్తున్నది. చివరిలో అయితే వామపక్షాలకు సీట్ల విషయంలో పట్టుబట్టే అవకాశం తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.