సాధారణ పరిస్థితుల్లో చూసినప్పుడు.. ఒక వ్యక్తికోసం కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న, మళ్లీ అధికారంలోకి రాగలదనే ధీమాతో ఉన్న జాతీయ పార్టీ ఆయన ఎదుట సాగిలపడడం అనేది అనూహ్యమైన సంగతి. కానీ తెలంగాణలో నిత్యం ఎంత రాద్ధాంతం చేస్తున్నప్పటికీ.. గెలవబోయే సీట్ల పరంగా అంతంతమాత్రంగానే బలం కలిగిఉన్న కమలదళం.. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోసం వెంపర్లాడుతోంది. ఆయనను బతిమాలి అయినా తమ పార్టీలో చేర్చుకోవడానికి బేరసారాలు సాగిస్తోంది. ఇదొకవైపు నడుస్తోంటే.. ‘పొంగులేటి రాక’ అనే ఎపిసోడ్ చుట్టూతా కమలదళంలో ముఠా కుమ్ములాటలు నడుస్తున్నాయా.. అంతర్గతంగా ఉన్న విభేదాలు బయటపడుతున్నాయా? అనే అభిప్రాయం కూడా పలువురికి కలుగుతోంది.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి , వైఎస్ జగన్ కు ఆత్మీయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి వైసీపీ తరఫున ఖమ్మం ఎంపీగా నెగ్గారు. తర్వాత అనివార్య పరిస్థితుల్లో ఆయన గులాబీతీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీలో కుదురుగా ఉండలేకపోయారు. కేసీఆర్ ఆయనను పక్కన పెట్టారు. ఆయన కేసీఆర్ మీద కక్ష కట్టారు.సుమారు ఏడాదికి పైగా తిరుగుబాటు బావుటా ఎగరేసి తనంతట తాను ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుంటూ అభిమానుల్ని పోగేసుకుంటూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బలప్రదర్శన చేస్తున్న సమయంలో ఆయన మీద పార్టీ వేటు వేసింది. తర్వాత ఆయన కేసీఆర్ మీద డైరక్టు మాటల దాడికి దిగుతున్నారు. పనిలోపనిగా కేసీఆర్ మీద తిరుగబాటు చేస్తున్న పాలమూరు నాయకుడు జూపల్లి కృష్ణారావును కూడా కూడగట్టుకున్నారు.
సదరు పొంగులేటిని కమలదళంలోకి తీసుకురావడానికి సుదీర్ఘకాలంగా మంతనాలు సాగుతున్నాయి. తాజాగా గురువారం ఈటల నేతృత్వంలో బిజెపినేతలు కొందరు ఖమ్మం వెళ్లి ఆయనతోను, ఆయన అనుచరులతోను భేటీ అయ్యారు. చేరికల కమిటీ సారథిగా ఈటల ఇందుకు పూనుకోగా, ఇందుకు విరుద్ధంగా.. పొంగులేటి తమ పార్టీలోకి వస్తున్న సంగతి తనకు తెలియనే తెలియదని, ప్రయత్నాల గురించి కూడా తెలియదని తెలంగాణ కమలసారథి బండి సంజయ్ వ్యాఖ్యానించడం విశేషం. ఈటల-బండి మధ్య పొరపొచ్చాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పార్టీని బలోపేతం చేసే దిశగా పొంగులేటిని తీసుకువచ్చే ప్రయత్నాల్లో కూడా ఇలా ఇద్దరూ కొట్టుకుంటే పార్టీ ప్రస్థానం ఎలా సాగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
పొంగులేటి యవ్వారంపై కమలంలో కుమ్ములాట!
Wednesday, January 22, 2025