పొంగులేటి మద్దతుదారుల ప్రశ్నలతో ఈటెల ఉక్కిరి, బిక్కిరి

Saturday, January 18, 2025

రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దె దించే శక్తి బీజేపీ మాత్రమే ఉందని పేర్కొంటూ తమ పార్టీలో చేరాలని టిఆర్ఎస్ బహిష్కృత నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను ఆహ్వానించడం కోసం ఖమ్మం వెళ్లిన ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అక్కడ వారి మద్దతుదారులు వేసిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

వారి ప్రశ్నలు వింటుంటే, తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమదే అధికారం అంటూ మీడియాలో అదరకొడుతున్న బిజెపి నాయకులకు క్షేత్రస్థాయిలో తమపార్టీ గురించి ఎటువంటి చులకనభావం నెలకొందో వెల్లడవుతుంది.  ఈటెల ఒక్కడే కాకుండా తమ కమిటీ సభ్యులు అందరినీ – ఎమ్యెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వరరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులతో కలసి పొంగులేటి నివాసంకు వెళ్లారు.

వీరంతా కలిసి బీజేపీలో చేరమని కోరేందుకు ఒక నాయకుడిని ఇంత బహిరంగంగా కలవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వారిద్దరూ బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే అభిప్రాయంతో వెళ్లిన్నట్లు తెలుస్తున్నది. సుమారు ఐదు గంటలపాటు మంతనాలు జరిపినా వారెటు తేల్చకపోవడం, పరోక్షంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత చూసుకొందాములే అన్నట్లు చెప్పడంతో వారు ఒకింత నిరాశకు గురయిన్నట్లు కనిపిస్తున్నది.

మరోవంక, చివరిలో పొంగులేటి అనుచరులతో వారు జరిపిన ఇష్టాగోష్టిలో వారు వ్యక్తం చేసిన ప్రశ్నలు చూస్తుంటే బీజేపీలో చేరడంవల్లన రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం ఉండబోదనే అభిప్రాయంతో వారున్నట్లు స్పష్టం అవుతుంది. జిల్లాలో బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేదు కదా! అంటూ మొహం మీద అడిగేసారు. పైగా, అసలు తెలంగాణాలో బిజెపి అధికారంలోకి వస్తుందా? అని అడిగేసరికి నేరుగా సమాధానం చెప్పలేక ఈటెల బృందం షాక్ కు గురైనట్లు తెలుస్తున్నది.

వీటన్నింటికి మించి బిజెపి, బిఆర్ఎస్ ఒకటే అని ప్రచారం జరుగుతుంది గదా? అంటూ వారు అడిగేసరికి అదేమీ లేదంటూ సంజాయిషీ ఇచ్చుకున్నట్లు ఎంతో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ విషయమై తాము జాతీయ పార్టీ నాయకత్వం నుండి స్పష్టమైన వివరణ తీసుకున్నామని చెప్పుకోవాల్సి వచ్చింది.

బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకటి కాదని, దీనిపై పార్టీ జాతీయ నాయకత్వం కూడా విస్పష్ట హామీ ఇచ్చిందని చెప్పారు. అదేనిజమైతే, లిక్కర్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తే బీజేపీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది కదా! అని ఒకరు ప్రశ్నించగా  చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేపీ ముఖ్య నేతలు నిస్తేజంగా సమాధానం చెప్పారు. 

ఏదేమైనా పొంగులేటి మద్దతుదారులు కాంగ్రెస్ లో చేరడం వల్లన రాజకీయంగా ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటుందని, కేసీఆర్ ను ఓడించాలంటే కాంగ్రెస్ కె మద్దతు ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నారని వారి ప్రశ్నలను బట్టి తెలుస్తున్నది. వారి మూడ్ ను గ్రహించిన ఈటెల బిఆర్ఎస్ మొదటినుండి కాంగ్రెస్ ను అణచివేసేందుకు చేయవలసింది అంతా చేస్తుందని వివరించారు.

కాంగ్రెస్ నుండి గెలుపొందిన 12 మంది ఎమ్యెల్యేలను ఏవిధంగా తమ పార్టీలో చేర్చుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పని అయిపోయినట్లేనని, ఆ పార్టీతోపాటు బీఆర్‌ఎస్‌ నుంచి కూడా బీజేపీలోకి చేరికలు ఉంటాయని చెప్పడం ద్వారా వారి దృష్టిని కాంగ్రెస్ నుండి మళ్లించే ప్రయత్నం చేశారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles