బిఆర్ఎస్ నాయకత్వంపై ఆగ్రహంతో పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరబోవడం పట్ల ఆయన మద్దతుదారులు ఎవ్వరికీ కూడా రుచించడం లేదని స్పష్టం అవుతుంది. వారిలో ఎంతమంది ఆయనతో బీజేపీలో చేరతారో అన్నది ప్రశ్నార్ధకరంగా మారింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నామమాత్రపు ఉనికి కూడా లేని బీజేపీలో చేరడంతో వచ్చే ప్రయోజనాల గురించి తన మద్దతుదారులకు సహితం ఆయన నచ్చచెప్పలేక పోతున్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ బలంగా ఉన్నాయి. ఇటీవల చంద్రబాబు నాయుడు హాజరైన బహిరంగసభకు అనూహ్య స్పందన లభించడం తెలిసిందే.
అయితే, టిఆర్ఎస్ కు చెప్పుకోదగిన బలం లేకపోయినప్పటికీ ఆ రెండు పార్టీలతో పాటు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను తన పార్టీలో చేర్చుకొని కేసీఆర్ అక్కడ నెట్టుకొంటూ వస్తున్నారు. అటువంటి కేసీఆర్ ను ఎదిరించే బలం లేకనే బిజెపి పొంగులేటి కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నది. అందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నట్లు కూడా వినవస్తుంది.
కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి ముందుగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోసం ప్రయత్నం చేశారు. దర్యాప్తు సంస్థల అధికారులే నేరుగా “మీరు బీజేపీలో చేరితే మాకు పదే పదే మీపై దాడులు చేసే అవసరం రాదు” అని చెప్పిన్నట్లు తెలుస్తున్నది. అయితే, ఆయన బిఆర్ఎస్ నుండి పార్టీ మారడానికి నిరాకరించడంతో ఆయన ఆస్తులను కేంద్ర సంస్థలను జప్తు చేశాయి.
అటువంటి బెదిరింపుల కారణంగానే ఇప్పుడు పొంగులేటి బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తున్నది. అయితే తన మద్దతుదారులతో మాత్రం కాంగ్రెస్ లో లేదా టిడిపిలో చేరితే తన ఒక్కరికే సీట్ ఇస్తారు, బీజేపీలో అయితే కనీసం నాలుగురైదుగురికి సీట్లు ఇప్పించుకోవచ్చని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే బీజేపీలో చేరితే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మాదిరిగా రాజకీయంగా ఒంటరిగా మిగలవలసి వస్తుందా? అనే భయం ఆయనకు పట్టుకున్నట్లు కనిపిస్తున్నది. రాజగోపాలరెడ్డి వెంట ఉన్న కాంగ్రెస్ నాయకులు చాలామంది ఆయనతో పాటు బీజేపీలో చేరలేదు. అందుకనే ఉపఎన్నికలో పరాజయం తప్పలేదు.
రాజగోపాలరెడ్డి విషయంలో సహితం రూ. 18,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు మంజూరు కోసమే బలవంతంగా ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేయించి, బిజెపి అగ్రనాయకత్వం తమ పార్టీలో చేర్చుకున్నదనే కధనాలు ఈ సందర్భంగా రావడం గమనార్హం. ఆయన ఉపఎన్నికకు సిద్దపడకపోయినా, బిజెపి నాయకత్వం బలవంతంతో సిద్దపడి, ఓటమి చెందవలసి వచ్చింది.