పొంగులేటి, జూపల్లిల చేరికపై చేతులెత్తేసిన ఈటెల!

Wednesday, January 22, 2025

బిఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను బీజేపీలో చేర్చుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఇక ముగింపు పలికిన్నట్లు తెలుస్తున్నది. వారితో కొంతకాలంగా ఈ విషయమై సమాలోచనలు జరుపుతున్న మాజీ మంత్రి, బిజెపి ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ వారిక బీజేపీలో చేరే అవకాశం లేదంటూ  చేతులెత్తేశారు.

అంతేకాదు, ఇప్పటివరకు వారిద్దరూ కాంగ్రెస్ లో చేరకుండా తాను అడ్డుకోగలిగానని చెబుతూ ఇక్కడి కూడా సాధ్యం కాదన్నట్లు సంకేతం ఇచ్చారు. మరోవంక వారిద్దరూ జూన్ 8 ప్రాంతంలో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది. బహుశా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో వారిద్దరూ ఆ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి.

చివరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహితం పొంగులేటిని పిలిపించి బీజేపీలో చేరమని సూచించినట్లు కధనాలు వచ్చాయి. అయితే తమ మద్దతు దారులెవ్వరు బీజేపీలో చేరేందుకు సుముఖంగా లేకపోవడం, తాము బీజేపీలో చేరితే వారంతా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దపడుతూ ఉండడంతో మరోమార్గం లేక వారిద్దరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తున్నది.

‘ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది. బీజేపీ బలంగా లేదు. పొంగులేటి, జూపల్లితో నేను రోజూ మాట్లాడుతున్నాను. వారే నాకు రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరకుండా మాత్రమే నేను ఆపగలిగాను. బీజేపీలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి’ అని ఈటల రాజేందర్ వెల్లడించారు.

అంతేగాక, ‘ఇప్పటికీ కమ్యూనిస్ట్ ప్రభావం ఉన్న జిల్లా ఖమ్మం. దేశానికి కమ్యూనిస్టు సిద్ధాంతం నేర్పిన గడ్డ తెలంగాణ. ఖమ్మంలో వామపక్షాలు, టీడీపీ సహా అన్ని పార్టీలుంటాయి. ప్రియాంక గాంధీని అప్పట్లో పొంగులేటి కలిశారని తెలిసింది. అంతకంటే ముందే ఖమ్మం వెళ్లి పొంగులేటితో చర్చించాను’ అని ఈటల తెలిపారు.

కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామంటున్న ఈ ఇద్దరు నేతలు ఏ పార్టీలోనూ చేరతామని స్పష్టం చేయలేక పోతున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ, వైయస్సార్ తెలంగాణ పార్టీలు ఈ ఇద్దరు నేతలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. మరోవంక, కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి లలోని అసంతృప్తి నేతలతో కలిసి కొత్తగా ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా తెరపైకి వచ్చింది.

అయితే, ఆ విధంగా చేయడం వల్లన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం ద్వారా బిఆర్ఎస్ ప్రయోజనం పొందే అవకాశం ఉందని వీరిద్దరూ వెనుకడుగు వేశారని చెబుతున్నారు. మొదట్లో బీజేపీలో చేరేందుకు ఆసక్తి కనబరిచిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు వీరిలో మార్పు తీసుకు వచ్చిన్నట్లు కనిపిస్తోంది.

వీరిద్దరి పరిస్థితి చూస్తుంటే బీజేపీలో ఇప్పటిలో ఇతర పార్టీల నుండి ప్రముఖులు ఎవ్వరో తెలంగాణాలో చేరే అవకాశం లేదని స్పష్టం అవుతుంది. అయితే, ఎన్నికల పక్రియ ప్రారంభమైన తర్వాత ఏ పార్టీలో సీట్ రాని వారు ఎన్నికలలో పోటీచేసేందుకు బీజేపీలో చేరే ఆ పార్టీ గుర్తుపై పోటీ చేసేందుకు వచ్చే అవకాశం ముంటుంది.

వారు గెలిచే వకాశం లేదనే ఆయా పార్టీలు సీట్ నిరాకరించిన నేతలకు సీట్లు ఇవ్వడం వల్లన బిజెపికి కూడా ప్రయోజనం చేకూరే అవకాశం ఉండదు. అందుకనే తెలంగాణాలో పరిస్థితుల పట్ల బిజెపి కేంద్ర నాయకత్వం సహితం సీరియస్ గా ఆలోచిస్తూ, పార్టీలో సంస్థాగతంగా కొన్ని మార్పులకు ఆలోచనలు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles