పొంగులేటిపై కసి తీర్చుకొనేందుకే ఖమ్మంలో అమిత్ షా సభ!

Sunday, December 22, 2024

తొమ్మిదేళ్లలో కేంద్రంలో మోదీ ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసుకునేందుకు బిజెపి దేశవ్యాప్తంగా నెలరోజులపాటు జరుపుతున్న మహజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా ఈ నెల 15న ఖమ్మంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో బహింరంగసభ జరపాలనుకోవడం  పార్టీని బలోపేతం చేయాలనుకుని కాకుండా, బీజేపీ కాకుండా కాంగ్రెస్ లో చేరుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కసి తీర్చుకొనేందుకు అన్నట్లుగా ఉంది.

బిజెపి ఎపుడూ అక్కడ డిపాజిట్ దక్కించుకోలేదు. అయితే బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణాలో బిజెపి తుడిచిపెట్టుకు పోతున్నదనే వాఖ్యలు చేస్తూ, బిజెపికి కేసీఆర్ ను ఓడించే సత్తా లేదని, కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉందంటూ ఆ పార్టీలో చేరేందుకు పొంగులేటితో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహితం నిర్ణయించుకోవడం పట్ల సంజయ్ ఆగ్రహంతో ఊగిపోతున్నట్లు తెలుస్తున్నది.

అందుకనే పట్టుబట్టి పొంగులేటి కాంగ్రెస్ లో చేరేందుకు ఖమ్మంలో భారీ బహిరంగసభ జరపడానికి ముందే అమిత్ షాతో బహిరంగసభ జరిపి బిజెపి సత్తా తెలపాలని సంజయ్ బహిరంగంగానే పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. అమిత్ షా బహిరంగసభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శుక్రవారం ఖమ్మం వచ్చిన ఆయన ఖమ్మంలో బీజేపీ ఎక్కడిది? అన్నవారికి సమాధానంగా ఈ సభను జరపాలని చెప్పడం గమనార్హం.

ఈటెల రాజేందర్ తదితరులు ఖమ్మం వచ్చి పొంగులేటి, జూపల్లిలను బీజేపీలో చేరమని కోరినప్పుడు ఇక్కడ బిజెపి ఎక్కడుందని వారడిగారు. దానిని దృష్టిలో పెట్టుకొనే ఈ వాఖ్యలు చేసిన్నట్లు స్పష్టం అవుతుంది. “ఇది మీకు అవమానకరం. మీ దమ్మేందో చూపించే రోజు రాబోతోంది” అంటూ బిజెపి శ్రేణులను రెచ్చగొట్టేరీతిలో మాట్లాడారు. ఇక్కడ అమిత్ షా సభ విజవంతమైన తరువాత అవసరమైతే ప్రధాని మోదీతో కొత్తగూడెంలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, జిల్లాల కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ  కర్ణాటక ఫలితాలను బూచిగా చూపి బీజేపీ పనైపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.కర్ణాటక ఎన్నికల తర్వాత అందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, బిజెపిలోకి ఎవ్వరూ రావడంలేదని ఈటెల పేర్కొనడం గమనార్హం.

కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణాలో కాంగ్రెస్ లో జోష్ వచ్చిందని వస్తున్న కథనాలపై ఒకింత ఆత్మరక్షణలో పడిన సంజయ్ వాటిని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. అదంతా ఓ పెద్ద కుట్రగా అభివర్ణించారు.

‘‘తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ యాడుంది? కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా దేశంలో ఎక్కడా ఆ పార్టీ  లేదు.. జాకీ పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేవదు” అంటూ సంజయ్ స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణాలో కాంగ్రెస్ పుంజుకొందని, బిజెపిని వెనుకకు నెట్టేసిందని జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందిస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఓ సెక్షన్ మీడియా బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నయని ఆరోపించారు.

ఇటువంటి కథనాలను బీజేపీ కార్యకర్తలెవరూ పట్టించుకోవద్దల్ని అంటూ రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని బీజేపీలో ఒకిత ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.  అదే సమయంలో తెలంగాణాలో టిడిపి మద్దతు కోసం బిజెపి ప్రయత్నం చేస్తున్నట్లు వస్తున్న కథనాలను సహితం ఆయన కొట్టిపారేశారు. బీజేపీ సింహంలాంటి పార్టీ అని, తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేసి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

అన్ని ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదని సంజయ్ గుర్తు చేశారు. అయితే నాగార్జునసాగర్, సూర్యాపేటలలో సహితం బిజెపికి డిపాజిట్లు గల్లంతైన విషయాన్ని మర్చిపోయినట్లున్నారు.  మీడియాలో బ్రేకింగుల పేరిట జరుగుతున్న షేకింగులను పట్టించుకోవద్దని కోరారు.

సగంకు పైగా నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులను పార్టీలో గుర్తించలేక, ఇతర పార్టీల నుండి ఎవ్వరు వచ్చి బిజెపి నుండి పోటీచేస్తారో అని ఎదురు చూస్తున్న పరిస్థితులలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని,  బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని అంటూ పార్టీ శ్రేణులలో ఒకవిధమైన ఆత్మనూన్యతను తగ్గించే ప్రయత్నం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles