మాజీ మంత్రి, అధికార పార్టీ తరఫున పవన్ కల్యాణ్ మీద విరుచుకుపడడంలో సదా ముందు వరుసలో ఉండే మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తన రాజకీయ సన్యాసాన్ని ఇంచుమించుగా ప్రకటించారు. ఇదేమీ యథాలాపంగా మిత్రులతోనో, దారినపోయేవారితోనో అన్నమాట కూడా కాదు. సాక్షాత్తూ తమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పాల్గొన్న కార్యక్రమంలోనే అన్నటువంటి మాట. సీఎం వేదిక మీద ఉండగానే.. స్థానిక ఎమ్మెల్యేగా ప్రసంగించిన పేర్ని నాని.. ‘‘మరోసారి నేను జగన్ తో సమావేశం అవుతానో లేదో తెలియదు’’ అనే వైరాగ్యాన్ని ప్రకటిస్తూనే.. ‘హా రిటైర్ అవుతున్నాను’ అనికూడా ధ్రువీకరించేశారు. పేర్ని నాని రాజకీయ సన్యాసం అనేది కొత్త సంగతి కాదు. ఈ మాట చాలా కాలం నుంచి వినిపిస్తున్నదే. అయితే ఆయన ప్రస్తుత పార్టీ పరిస్థితుల పట్ల వైరాగ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారా? మళ్లీ పార్టీ గెలిచే అవకాశం లేదనే భయంతో నిర్ణయం తీసుకున్నారా? అనే చర్చ ఇప్పుడు రేకెత్తుతోంది.
పేర్ని నాని సుమారు ఏడాది కాలానికంటె ముందే తన రాజకీయ సన్యాసం గురించి సంకేతాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలోనే ఆయన ఓపెన్ గానే.. వచ్చే ఎన్నికల్లో తనకు పోటీచేసే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో టికెట్ తన కొడుక్కు ఇవ్వాలని కూడా అభ్యర్థించారు. అయితే జగన్ ఆ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. నేను ఈ దఫా మాత్రం మీ అందరితో కలిసే మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నా.. అనే మాట అన్నారు. వారసులను తెరమీదకు తెచ్చే ఆలోచన ఉంటే వాయిదా వేసుకోండి. ఈసారికి అందరం కలిసి పోటీచేద్దాం అని జగన్ అన్నారు. అయినా సరే పేర్ని నాని ఆలోచనలో మార్పు వచ్చినట్టు లేదు. జగన్ ఎదురుగా బహిరంగ వేదిక మీద నుంచే ఆయన తన సన్యాసం నిర్ణయాన్ని ప్రకటించారు.
మంత్రి పదవిని కూడా వెలగబెట్టిన పేర్ని నాని వైరాగ్యంతో ఈ నిర్ణయం తీసుకోడానికి అంత గొప్ప కారణాలు కనిపించడం లేదు. కాబట్టే, మళ్లీ పార్టీ గెలిచే అవకాశం లేదని, నియోజకవర్గంలో తాను గెలిచే అవకాశం లేదని తెలియడం వల్లనే ఆయన నిర్ణయం తీసుకున్నారని పలువురు అంటున్నారు. నాని తన కొడుకును ఇప్పటినుంచే బాగా ప్రొజెక్టు చేస్తున్నారు.
ఇదే తరహాలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా ఓటమి భయంతో పోటీనుంచి తప్పుకున్నారు. తన కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ దక్కేలా జగన్ నుంచి మాటతీసుకున్నారు కూడా! ఆయన జగన్ కోటరీలో ఉంటూ పార్టీకి సేవలందించేలా మాట కుదుర్చుకున్నారు. మరి పేర్ని నాని కొడుక్కు కూడా టికెట్ ఇవ్వడానికి జగన్ సిద్ధమేనా? ఆయన అలాంటి సంకేతాలు ఇస్తే.. పార్టీలో ఇంకా ఎంత మంది వచ్చే ఎన్నికల బరిలోకి దిగకుండా జారుకుంటారో అనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.
పేర్నినాని సన్యాసం.. వైరాగ్యమా? భయమా?
Sunday, December 22, 2024