పార్లమెంటుకు ప్రవాసాంధ్రుల ఓటు హక్కు అంశం!

Saturday, September 14, 2024

ఎన్నారైల హక్కు కోసం లోక్ సభలో ప్రస్తావిస్తా
తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యం
డాలస్ కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు

ప్రవాసాంధ్రులకు తమ తమ సొంత నియోజకవర్గాల్లో ఓటు హక్కు కల్పించే అంశాన్ని తాను లోక్ సభలో లేవనెత్తుతానని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు అందరూ కూడా తమ సొంత ప్రాంతాల్లోని ఎన్నికల్లో ఆన్ లైన్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే ఏర్పాటు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా పర్యటనలో భాగంగా మే 20న డాలస్ లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
ప్రవాస భారతీయులకు సొంత ప్రాంతాల ఎన్నికల్లో పాల్గొనేలా ఆన్ లైన్ ద్వారా ఓటుహక్కు కల్పించే అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. లోక్ సభలో ఈ అంశం లేవనెత్తుతానంటూ స్వయంగా ఎంపీ అనడంతో కార్యక్రమానికి హాజరైన తెలుగువారిలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

తెలుగుదేశం విజయానికి ఎంపీ పిలుపు

తెలుగుదేశం పార్టీకి అభిమానులైన ప్రవాసాంధ్రులు రానున్న ఎన్నికల్లో, పార్టీ విజయం కోసం పనిచేయాలని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. ప్రవాసాంధ్రులు తమ తమ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో నాయకులను సమన్వయం చేసుకుని పార్టీ అభివృద్ధికి, విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు.
తెలుగుదేశం విజయం కోసం ప్రవాసాంధ్రులందరూ కూడా ఆర్థికంగానూ, ఇతరత్రా అన్ని రకాలుగానూ సహకారం అందించాలని ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ కోమటి జయరాం కోరారు. ప్రజాస్వామ్యం పరిపుష్టం కావడానికి, ప్రవాసులకు ఓటుహక్కు కల్పించాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దుర్మార్గపు పరిపాలనను పారద్రోలడానికి ప్రతి ఒక్కరూ కూడా కంకణ బద్ధులు కావాలని ఆయన కోరారు.
పార్టీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐలు అందరూ కూడా చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్ర పురోభివృద్ధికి స్పష్టమైన దిశానిర్దేశం చేయాలనే స్ఫూర్తితో పనిచేయాలని ఆకాంక్షించారు.
డాలస్ లో ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో తెలుగువాళ్లు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు విగ్రహానికి, కింజరాపు ఎర్రన్నాయుడు చిత్రపటానికి తొలుత పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కె.సి. చేకూరి, చింతమనేని సుధీర్, రామకృష్ణ గుళ్లపల్లి, లోకేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles