పేప‌ర్ లీకేజ్ పై భ‌గ్గుమ‌న్న విద్యార్ధి, యువజన సంఘాలు

Friday, November 22, 2024

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాల‌యం నుంచి ఉద్యోగ ప‌రీక్ష ప‌త్రాలు లీక్ కావ‌డం ప‌ట్ల విద్యార్ధులు,నిరుద్యోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పేప‌ర్ లీకేజ్ బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ బిజెపి యువమోర్చ, యువజన కాంగ్రెస్, టిజెఎస్ కార్యకర్తలు విడివిడిగా మంగళవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ను ముట్ట‌డించారు.

వారు కార్యాల‌యం వ‌ద్ద భైఠాయించారు. ఆందోళనకారులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ బోర్డును పీకేశారు. గేట్లు దూకారు. ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లారు పోలీసులు. పలువురిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, వారికి మధ్య తోపులాటలు జరిగి, ఉద్రిక్తకు దారితీసింది.

ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చినట్లే ఇచ్చి . పేపర్లు లీక్ చేసి అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారంటూ భగ్గుమన్నారు. ఎగ్జామ్ పేపర్లను అమ్ముకుంటూ నిరుద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సంవత్సరాల తరబడి కష్టపడి చదువుతుంటే . పేపర్లు లీక్ చేసి మోసం చేస్తున్నారని న్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగులు.

పేపర్ లీకేజీలు ప్రగతిభవన్ డైరెక్షన్ లో జరుగుతున్నాయని ఆరోపించారు. ఇంజనీరింగ్ విభాగంలోని టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ పేపర్ లీక్ తరహాలోనే.. గ్రూప్ వన్, ఇతర కాంపిటీషన్ ఎగ్జామ్స్ పేపర్లు కూడా లీక్ చేసి ఉంటారనే అనుమానాలను సైతం వ్యక్తం చేశారు. పరీక్షల పేపర్లును కాపాడుకోకపోతే టీఎస్పీఎస్సీ బోర్డు ఎందుకని ప్రశ్నించారు.

ఈ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అటు ఉస్మానియా యూనివర్సిటీలోనూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజపై ఓయూ బహుజన విద్యార్థి సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. ఓయూ రోడ్పై విద్యార్థులు భైఠాయించి ఆందోళన చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నిరుద్యోగ విద్యార్థులతో చెలగాటం ఆడిన టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఓయూ విద్యార్థులు డిమాండ్ చేశారు.

కాగా, టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీపై నిరుద్యోగులు రోడ్డెక్కారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని లైబ్రరీ దగ్గర ఆందోళనకు దిగారు. తిండి తిప్పలు మానేసి కష్టపడి చదివినా తమకు ఉద్యోగం రాలేదని..అలాంటి ప్రవీణ్ కు వందకు పైగా మార్కులు రావడమేంటని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మరోవంక, గ్రూప్ 1 పేపర్ కూడా లీకైనట్లు విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 పరీక్ష రాసిన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము కూడా లీకేజీతోనే ఫెయిలయ్యామా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది అక్టోబర్ 16న గ్రూప్ 1 పరీక్ష జరిగింది. 2.86 లక్షల మంది గ్రూప్ 1 పరీక్ష రాయగా…1:50 నిష్పత్తిలో 25వేల 50 మంది క్వాలిఫై అయ్యారు.

ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో నిందితుడు ప్రవీణ్ గ్రూప్ 1 పరీక్ష రాశాడనే ప్రచారం సాగుతోంది.   ప్రవీణ్ రాసిన ప్రిలిమినరీలో అతడికి 103 మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్‌ పేపర్‌ను ప్రవీణ్ లీక్‌చేశాడా? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.

ఈ కేసులో ప్రవీణ్ తో పాటు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, వారిని నాంపల్లి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. మరోవైపు లీకేజీకి కారకుడైన ప్రవీణ్‌‌పై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేటు వేసింది. ప్రవీణ్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మరో ఉద్యోగి రాజశేఖర్‌ను కూడా ఉద్యోగం నుంచి తొలగించినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles