పేపర్ లీకేజీలో అసలు దోషి కేటీఆర్ … సిబిఐ, ఈడీ దర్యాప్తుకై రేవంత్ రెడ్డి

Saturday, January 18, 2025

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పేపర్ లీకేజీ కుంభకోణం, ఆర్థిక లావాదేవీల వ్యవహారం ఇతర దేశాల్లోనూ మూలాలు ఉన్నాయని స్పష్టం చేస్తూ ఈ కేసు నుంచి మంత్రి కేటీఆర్ తప్పించుకోవడానికి ఎదురుదాడి చేస్తూ, విచారణ అధికారులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తీసుకువస్తున్నారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన ఈ విషయమై కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ ఉమ్మడిగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ రెండు సంస్థల డైరెక్టర్ లను కలిసేందుకు మూడు రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే,  సీబీఐ, ఈడీ డైరెక్టర్ల అపాయింట్ మెంట్ అడిగినా తమకు ఇవ్వడం లేదని చెబుతూ తమకు వెంటనే అపాయింట్ మెంట్ ఇవ్వాలని మీడియా ద్వారా కోరారు.

లీకేజీ వ్యవహారంతో కేటీఆర్ కు సంబంధం లేనప్పుడు, సిట్ విచారణ జరుగుతున్న సమయంలో, నివేదిక ఇంకా పూర్తి కాకముందే మంత్రి కేటీఆర్ కు పూర్తి సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ వద్ద నిర్ధిష్టమైన సమాచారం ఉందని, ఆయనకు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

కేటీఆర్ కు నోటీసులు ఇవ్వకుండా ప్రతిపక్ష నేతలపై  క్రిమినల్ కేసులు పెడుతామంటున్నారని కాంగ్రెస్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.   ‘‘సిట్ మాకు నోటీసులు ఇస్తోంది. కేటీఆర్ కు విచారణ చేసిన రహస్య సమాచారాన్ని ఇస్తున్నారు. సిట్ విచారణ కేటీఆర్ కనుసైగల్లోనే జరుగుతోంది” అని ఆరోపించారు.

పేపర్ లీకేజీల్లో జరిగిన లావాదేవీలను, ప్రమేయం ఉన్న వ్యక్తులను కాపాడేందుకు కేటీఆర్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నేరాన్ని చిన్నది చేసే ప్రయత్నం చేస్తున్నారని అంటూ  “మొత్తం ఆరోపణలు కేటీఆర్ పైనే చేస్తున్నాం. కేటీఆర్ కు సమాచారాన్ని ఎవరు ఇస్తున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ’’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

పేపర్ లీకేజీ విషయాన్ని తామే పసిగట్టామని కేటీఆర్ చెప్పడం పచ్చి అబద్దం అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. డబ్బు పంపకాల్లో వచ్చిన తేడాలవల్లే నిందితుల ద్వారా ప్రశ్నపత్రాల లీకేజీ బయటపడిందని తెలిపారు. దీన్ని కప్పిపుచ్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

విద్యార్థుల ఒత్తిడికి తలొగ్గి, రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిందని చెబుతూ అది కంటితుడుపు చర్య మాత్రమే అని స్పష్టం చేశారు.  తెలంగాణలో ఏదైనా సంచలన సంఘటనలు జరిగినప్పుడు, అందులో ప్రభుత్వ పెద్దల పాత్ర కనిపించినప్పుడు, వారిని కాపాడేందుకు, సమస్యను పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి సిట్ ను నియమిస్తోందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు వివిధ కేసుల్లో సిట్ ఒక్క నివేదికను కూడా ఇవ్వలేదని, నిందితులపైనా చర్యలు తీసుకోలేదని ఆయన చెప్పారు. 

ప్రశ్నపత్రాల కుంభకోణంలో ఉన్న పాత్రధారులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీకి, తనకు ఉన్న సంబంధం గురించి కేటీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలను ఉల్లంఘించి, అర్హత లేని వాళ్లను  టీఎస్‌పీఎస్సీ కమిషన్ సభ్యులుగా నియమించారని ఆరోపించారు.  టీఎస్‌పీఎస్సీ చైర్మన్, ఏడు మంది సభ్యుల నియామకంతోనే అవకతవకలకు పునాది వేశారని చెప్పారు.  

లీకేజీ విషయం కేవలం ఇద్దరు వ్యక్తులకు (ప్రవీణ్, రాజశేఖర్) సంబంధించినదని మంత్రి కేటీఆర్ ఎలా మాట్లాడారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సిట్ నియమించిన తర్వాత ఈ విషయాన్ని కేటీఆర్ ఎలా చెప్పారన్నారు. కస్టడీలోకి తీసుకోకముందే ఇద్దరు వ్యక్తులకే సంబంధం ఉందని కేటీఆర్ ఎలా చెప్తారని మరోసారి ప్రశ్నించారు. ఈ ఇష్యూలో కేటీఆర్ పీఏ తిరుపతి చిన్న పావు మాత్రమే అని అన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles