పేపర్ లీకేజీపై సొంతపార్టీని ఇరకాటంలోకి నెట్టిన బండి సంజయ్

Friday, April 26, 2024

సమయం, సందర్భం లేకుండా ప్రతి అంశాన్ని రాజకీయం చేసి, కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత దాడులకు దిగడం ద్వారా మీడియాలో హైలైట్ కావాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిత్యం తాపత్రయపడుతూ ఉంటారు. ఆ విధంగా చేస్తూ పలు సందర్భాలలో సొంతపార్టీనే ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు.

పిజి విద్యార్థిని డా. ప్రీతీ ఆత్మహత్యకు పాల్పడగానే `లవ్ జిహాద్’ అంటూ సంజయ్ గగ్గోలు పెట్టారు. ఆ తర్వాత నిజం తెలుసుకొని ఆ మాటెత్తలేదు అనుకొండి. అట్లాగే ఢిల్లీ మద్యం కేసులో ఎమ్యెల్సీ కవితకు ఈడీ నోటీసులు పంపగానే అరెస్ట్ చేయడం కోసమే పంపారంటూ ఆమెపట్ల అనుచిత పదాలు ఉపయోగించడంతో బిజెపిపై దాడికి కేసీఆర్ కు బ్రహ్మాస్త్రం ఇచ్చిన్నట్లయింది.

కవిత ఈడీ విచారణలో ఉన్న రోజంతా తెలంగాణాలో, ఢిల్లీలో సంజయ్ దిష్టి బొమ్మలు దగ్ధం చేయడంతో పాటు నిరసనలు చేస్తూ ప్రజల దృష్టి అటు మళ్లించారు. దానితో రాజకీయాలలో మాటలు జాగ్రత్తగా వాడాలంటూ  హోమ్ మంత్రి అమిత్ షా సున్నితంగా చివాట్లు పెట్టారు.

తాజాగా, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి విషయం తెరపైకి రాగానే ముందు, వెనుక ఆలోచింపకుండా బాధ్యత వహిస్తూ కంప్యూటర్ నుండి పేపర్ లీక్ కావడంతో ఐటి మంత్రిగా ఉన్న కేటీఆర్ ను మంత్రివర్గం నుండి తొలగించాలంటూ నిరసనలు చేపట్టారు. పైగా, సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ మాటలే ఇప్పుడు బిజెపిని ఇరకాటంలో పడేస్తున్నాయి. బిజెపి అధికారంలో ఉన్న పలు రాస్త్రాలలో ఈ విధంగా ప్రశ్నాపత్రాలు లీక్ అవుతూ వస్తున్నాయి. ఎక్కడైనా ఒక మంత్రిని తొలగించారా? న్యాయ విచారణకు ఆదేశించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దానితో బిజెపి నాయకులు ఆత్మరక్షణకు దిగాల్సి వచ్చింది.

ప్రభుత్వ వ్యవస్థలపై బండి సంజయ్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని  మంత్రి కేటీఆర్  విమర్శించారు. ఓ వ్యక్తి చేసిన నేరాన్ని మొత్తం వ్యవస్థకు ఆపాదిస్తున్నారని పేర్కొంటూసంజయ్ నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్ ను నాశనం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ లో 13 సార్లు క్వశ్చన్ పేపర్ లీకైందని,మోడీని రాజీనామా చేయమనే దమ్ము సంజయ్ కు ఉందా.? అని ప్రశ్నించారు

హర్యానాలో బీజేపీ హయాంలో మొత్తం 28 పేపర్‌ లీక్‌ సంఘటనలు జరిగాయని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2020 డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా జరిగిన యూజీసీ నెట్‌ పరీక్షల ప్రశ్నాపత్రం హర్యానాలో లీకయ్యింది. 2021 ఆగస్టులో జరిగిన హర్యానా పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామక పరీక్ష ప్రశ్నాపత్రం లీకయ్యింది. అక్కడున్న బిజెపి ప్రభుత్వంపై సంజయ్ ఈ విధమైన డిమాండ్లు చేయగలరా?

తాజాగా, బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సాంలో పదో తరగతి పరీక్షల పేపర్‌ లీకయ్యింది. సైన్స్‌ పరీక్ష పేపర్‌ను వాట్సాప్‌లో అమ్మకానికి పెట్టారు. రూ.100 నుంచి రూ.3,000 వరకు పేపర్‌ను అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. పేపర్‌ లీక్‌ ఘటన తమ ప్రభుత్వ వైఫల్యమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా అసెంబ్లీలో ఒప్పుకోవాల్సి వచ్చింది. మరోసారి ఇలాంటి జరగనివ్వమని సంజాయిషీ ఇచ్చుకున్నారు.

కర్ణాటకలో అవకతవకలు, అక్రమాల ఆరోపణలు రాకుండా పోటీ పరీక్షలు జరగడం లేదు. ఈ అక్రమాలలో కొందరు బీజేపీ నేతల పాత్ర కూడా ఈ వ్యవహారాల్లో బయటపడుతున్నాయి. అట్లాగే మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో కూడా బయటపడ్డాయి.

సంజయ్ ఈ పేపర్ లీకేజ్ పై నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీలో ఒక రిటైర్డ్ ఐఏఎస్, ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వారొక్క రాజకీయ ప్రకటన విడుదలచేశారు గాని టీఎస్పీఎస్సీలో నెలకొన్న లోపలగురించి లోతైన అధ్యయనం చేసే ప్రయత్నం చేయలేదు. పైగా, అదొక్క స్వతంత్ర సంస్థ అన్న విషయాన్ని మరచిపోతున్నారు. కమిషన్ చైర్మన్ గా ఉన్న బి జనార్దనరెడ్డి నిజాయతీకి పేరొందిన అధికారిగా పేరుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles