చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఒక సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో పేదలతో మమేకం అయి.. వారితో నిత్యం సన్నిహితంగా మెలుగుతూ పార్టీ పట్ల వారిలో సానుకూల అభిప్రాయాన్ని నిర్మింపజేసే యంత్రాంగానికి ఆయన శ్రీకారం చుట్టారు. పార్టీ కోసం పనిచేయడానికి సెక్షన్ ఇన్చార్జీలు గా ఇన్నాళ్లు ఉన్నవారిని ఇప్పుడు మరింత బాధ్యతగా మారుస్తూ, వారికి కుటుంబ సాధికార సారధులు అని చంద్రబాబు నాయుడు నామకరణం చేశారు. ఈ గుర్తింపుతో కీలకంగా మహిళా కార్యకర్తలు తమ సేవలు అందించాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ కుటుంబ సాధికార సారధులు ఏఏ బాధ్యతలు నిర్వర్తించాలో, ఎప్పటికప్పుడు తాను స్వయంగా తెలియజేస్తుంటానని చంద్రబాబు నాయుడు వివరించారు.
నిజానికి తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు మరింతగా చేరువ చేసే మంచి వ్యవస్థ ఇది అని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. హ్యూమన్ రిలేషన్స్ అనేవి ఎప్పుడూ కూడా సంస్థకు వ్యవస్థకు ఉపయోగపడతాయి. తెలుగుదేశం పార్టీని ఇష్టపడేవాళ్లు ఎంతమంది అయినా ఉండవచ్చు గాక వారితో పార్టీ తరఫున ఎవరో ఒకరు నిర్దిష్ట కాల వ్యవధిలో మానవ సంబంధాలను కొనసాగిస్తూ ఉండడం అనేది కచ్చితంగా వారికి పార్టీ పట్ల ప్రేమను పెంచుతూ ఉంటుంది. పార్టీ తరఫున పెద్దపెద్ద నాయకులే కానవసరం లేదు. ఎవరో ఒకరు, ప్రతి కుటుంబాన్ని పలకరించి.. ఎలా ఉన్నారు? మీ కష్టనష్టాలు ఎలా ఉన్నాయి? పార్టీ నుంచి ఎలాంటి తోడ్పాటును కోరుకుంటున్నారు? అని అడిగితే చాలు! ఆమాత్రం ఆధార పూర్వకమైన పలకరింపులు ప్రజలకు పార్టీ పట్ల అనుబంధాన్ని పెంచుతాయి. సరిగ్గా ఈ మానవీయ విలువల మీదనే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దృష్టి పెట్టారు. మానవ సంబంధాల పునాదుల మీద పార్టీని బలంగా నిర్మించే ప్రయత్నంలోకి వచ్చారు. అందుకే కుటుంబ సాధికార సారథులు అనే వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.
చంద్రబాబు నాయుడు ప్రకటించిన ప్రకారం ఈ కుటుంబ సాధికార సారథులు అనే పార్టీ యంత్రాంగం.. ఒక్కొక్కరు తమ పరిధిలో 30 కుటుంబాలతో అనుబంధాన్ని కొనసాగిస్తారు. నిత్యం వారితో కలుస్తూ కష్టసుఖాలు తెలుసుకుంటూ ఉంటారు. సంక్షేమ ముసుగులో అధికార పక్షం ఎలాంటి సామాజిక ద్రోహానికి పాల్పడుతున్న దో వారందరికీ అవగాహన కల్పించే ప్రయత్నంలో ఉంటారు. జరుగుతున్న రాజకీయ సామాజిక పరిణామాల పట్ల సరైన తార్కికమైన దృష్టి కోణాన్ని వారికి అలవాటు చేస్తుంటారు. నిజంగానే ఈ వ్యవస్థ ప్రస్తుతానికి ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ.. ప్రజల హృదయాలలో బలంగా వేళ్లూనుకోవడానికి ఎంతో కీలకమవుతుందని పార్టీ నాయకులు ఆశలు పెంచుకుంటున్నారు.