పెద్దపెద్ద పదాలు మాట్లాడేస్తున్న ఆర్జీవీ!

Monday, December 30, 2024

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న దర్శకుల్లో రాంగోపాల్ వర్మ స్థాయిలో ఎక్కువ పుస్తకాలు చదివి సంపాదించిన జ్ఞానం, ఆలోచన, స్పష్టమైన దృక్పథం ఉన్న వారు చాలా అరుదు. అలాగని వర్మ మహానుభావుడని, దార్శనికుడని, సమాజానికి దిశానిర్దేశం చేయగల పరిణతి ఉన్నవాడని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. రాం గోపాల్ వర్మ ఒక వ్యక్తిగా గొప్పవాడు కావొచ్చు. కానీ ఫిలింమేకర్ గా ఆయన గొప్పదనం అనేది గతించిపోయిన చరిత్ర! ఒక ఆలోచన కూడా అవసరం లేకుండా.. తను అడిగినంత డబ్బు ఎవరు ఇవ్వగలిగితే వారికి, వారికి ఏం కావాలంటే అలాంటి సినిమా చేసిపెట్టగల తత్వం వర్మకు మాత్రమే సొంతం.
ఇలాంటి తత్వాన్ని దిగజారుడుతనంగా అభివర్ణిస్తే.. అది తప్పు అని ఆయన తన జ్ఞానంతో ఎదుటి వారిని ఓడించగలరు. వర్మ సినిమాలు విడుదలకు ముందే అమ్ముడుపోతుంటాయి. అవి అమ్ముడుపోయేది బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఓటీటీ ప్లాట్ ఫారంలకు కాదు.. ఆయన తీసే సినిమాల ద్వారా అనుచితమైన ఇతర ప్రయోజనాలు ఆశించే వ్యక్తులకు అవి ముందే అమ్ముడుపోతాయి. స్క్రిప్టు దశ కంటె కూడా ముందే ఆ రకంగా సినిమాను అమ్మేసుకుని లాభపడగల ఏకైక ఫిలిం మేకర్ రాంగోపాల్ వర్మ.
ఎన్టీఆర్ జీవితం చాలా గొప్పదని, ఆయన జీవితచరిత్రను తాను డైరక్ట్ చేస్తానని ఎగబడిన రాంగోపాల్ వర్మ చాన్సు వేరే వారికి వెళ్లేసరికి, రామారావును తెగడుతూ, ప్రత్యర్థుల ప్రయోజనాల కోసం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రూపొందించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు వ్యక్తిత్వం గురించి చాలా స్పష్టంగా వివరించే సినిమా తీస్తున్నారట. వైసీపీ కోటరీలో చేరి, వారికి రుచికరంగా ఉండే సినిమాలను రూపొందించి ఈ ఎన్నికల ఏడాదిలో ప్రజల మీదికి సంధించడానికి కాంట్రాక్టు డీల్ కుదుర్చుకున్న రాంగోపాల్ వర్మ.. ‘వ్యక్తిత్వం’ లాంటి పెద్దపెద్ద మాటలు మాట్లాడడమే చాలా చిత్రంగా ఉంది.
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా వైసీపీ దళాలకు చెందిన అనేక మంది విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపకర్త కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను త్వరలో ‘వ్యూహం’ అనే చిత్రం చేస్తున్నట్లు చెప్పారు. ఆ చిత్రంలో చంద్రబాబు వ్యక్తిత్వాన్ని ఆయన తెలియజెబుతారట. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని చెప్పడానికి, వర్మకు ఉన్న వ్యక్తిత్వ అర్హతలేమిటో ఆయన ఎన్నడైనా సమీక్షించుకున్నారా? అనేది ప్రశ్న. రాంగోపాల్ వర్మ.. భారీ మొత్తాలకు అమ్ముడుపోయి ఏ చెత్తను అయినా తీసి థియేటర్లలోకి వదిలిపెట్టవచ్చుగానీ.. ఆయన చెప్పే వ్యక్తిత్వ విశ్లేషణలను జనం నమ్మేస్థితిలో ఉన్నారా?

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles