పులివెందులలో సిబిఐ సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌

Wednesday, December 18, 2024

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తుకు సుప్రీంకోర్టు విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో సీబీఐ దూకుడు పెంచింది. వైఎస్‌ వివేకా కుమార్తె డా. సునీత ఇటీవల సుప్రీంకోర్టులో వేసిన ఫిటిషన్‌ సోమవారం విచారణకు రానున్న నేపథ్యంలో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా వివేకా, కడప పార్లమెంట్‌ సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి గృహాలను సిబిఐ అధికారులు మరోమారు పరిశీలించారు.

ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో వివేకా ఇంటికి వెళ్లి హత్యజరిగిన స్థలాన్ని పరిశీలించారు. వీరి గృహాల మధ్య దూరాన్ని లెక్కించారు. వివేకా హత్య జరిగిన ఇంట్లోని బాత్రూమ్‌, బెడ్‌ రూమ్‌ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అవినాష్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్లారు. ఆయన ఇంటి పరిసరాలను పరిశీలించారు.

హత్య జరిగిన రోజున భౌతికకాయాన్ని ఫొటోలు, వీడియోలు తీసి వివేకా కుటుంబ సభ్యులకు పంపిన వివేకా కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనయాతుల్లాను కారులో తీసుకొని వెళ్తూ విచారణ చేశారు. హత్య జరిగిన రోజు ఇనయతుల్లా బాత్‌రూంలో మృతదేహాన్ని తన సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసి కుటుంబ సభ్యులకు పంపారు. ఈ ఫొటోలు, వీడియోలు ఎవరికి పంపావని ఆరా తీసినట్లు తెలుస్తోంది.

ఆరోజు ఇనయతుల్లా ఉన్న సమయంలో ఎవరెవరు వచ్చారు? ఏ సమయంలో వచ్చారు? అన్నదానిపై ప్రశ్నించారు. అనంతరం ఇనయతుల్లాను వెంటబెట్టుకుని అవినాశ్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అవినాశ్‌రెడ్డి ఇంటి బయట ఉన్న ఆయన పీఏ రమణారెడ్డిని తీసుకుని పులివెందుల రింగు రోడ్డు వద్దకు వెళ్లి బొగ్గుడుపల్లె సర్కిల్‌ను పరిశీలించారు. అనంతరం అవినాష్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి రమణారెడ్డిని రింగ్‌ రోడ్డు సమీపంలోని శ్రీకృష్ణ దేవాలయం దగ్గరకు తీసుకెళ్లి విచారించింది.

వివేకా హత్యకు ముందు, తర్వాత హంతకులు తిరిగిన ప్రదేశాలను పరిశీలించారు. విచారణలో అవినాష్‌ రెడ్డి చెప్పిన సమాచారాన్ని క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలించారు. ఎంత సమయంలో వివేకా ఇంటికి అవినాష్‌రెడ్డి వచ్చారనే దానిపై సిఐబి ఆరా తీసింది. సిబిఐ విచారణ పట్ల అవినాష్‌రెడ్డి అనుసరించిన సాగదీత పద్ధతులను సవాల్‌ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై వాదప్రతివాదలను విన్న సుప్రీంకోర్టు సోమవారం స్పందించే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో వివేకా హత్య ఎలా జరిగిందో సుప్రీంకోర్టుకు తెలపడానికి సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ ప్రక్రియను సిబిఐ చేపట్టినట్లు సమాచారం. ఇటీవల వైఎస్‌ అవినాష్‌రెడ్డి వేసిన పిటిషన్‌లో వివేకా కుమార్తె సునీత భర్త రాజశేఖర్‌రెడ్డిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం రాజశేఖర్‌రెడ్డిని సిబిఐ రెండు గంటలపాటు విచారించింది.

ఇప్పటికే ఈ కేసులో ఎంపీ అవినాశ్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయగా, అవినాశ్‌ను కూడా అవసరమైతే అరెస్టు చేస్తామంటూ సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలియజేసింది. వివేకా హత్య జరిగిన రోజు అవినాశ్‌రెడ్డి ఇంట్లోనే ఉన్నాడని గూగుల్‌ టేకౌట్‌ ద్వారా సీబీఐ గుర్తించగా, అవినాశ్‌రెడ్డి మాత్రం ఆ రోజు తాను ఎన్నికల ప్రచారం కోసం జమ్మలమడుగు వెళ్లానని చెప్పారు.

దస్తగిరి వాంగ్మూలం తప్ప సీబీఐ వద్ద ఆధారం లేదని, ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పారు. అయితే మూడో వ్యక్తి సమాచారం ఇస్తే ఘటనా స్థలానికి వెళ్లి సాక్ష్యాధారాలను ధ్వంసం చేసి కుట్ర పన్నినట్లు సీబీఐ అధికారులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో నిజానిజాలు తెలుసుకునేందుకు సీబీఐ ప్రత్యేక బృందం పులివెందులకు వచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles