బిజెపికి మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన అనంతరం పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఇంతెత్తున ఎగిరిపడటం తన తండ్రి ఎన్టీఆర్ గురించి చులకనగా అన్నందుకు ఆవేశంతో అన్నమాటలు కావని తెలుస్తున్నది. బిజెపి నుండి బయటపడేందుకు తొలిమెట్టు అన్నట్లుగా ఆమె బాణం వదిలారని పలువురు భావిస్తున్నారు.
“ఆ ఇద్దరు కాదు, ఆ మహానుభావులు…. ” అంటూ ఆమె ఎన్టీఆర్ ను, దిగవంత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని సమస్థాయిలో చూపే ప్రయత్నం చేయడం ఒకవిధంగా ఎన్టీఆర్ అభిమానులకు షాక్ తగిలినట్లయింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఫ్యాక్షనిజం నేపధ్యం నుండి రాజకీయాలలోకి వచ్చిన వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి కాగానే ఎన్టీఆర్ ద్వారా రాజకీయాలలో ప్రవేశించిన అనేకమంది హత్యలకు గురయ్యారు. అటువంటి నేతను ఎన్టీఆర్ తో సమానంగా `మహానుభావుడు’ అని ఆమె పేర్కొనడం కేవలం రాజకీయ అవసరాలకోసమే అనే అభిప్రాయం బలపడుతుంది.
బీజేపీలో చేరి ఎనిమిదేళ్ళయినా పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడం, కనీసం రాష్త్ర పార్టీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వకపోవడంతో ఆమె తీవ్ర అసహనంగా ఉన్నట్లు తెలుస్తున్నది. పైగా, ఆమె బీజేపీలో చేరినా ఆమె ద్వారా మరెవ్వరూ పార్టీలోకి రాకపోవడం, రాష్ట్ర పార్టీ నాయకులు ఎవ్వరు ఆమెను పట్టించుకొనకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు స్పష్టం అవుతుంది.
అయితే, బిజెపి- టిడిపి పొత్తు తిరిగి ఏర్పడే అవకాశం ఉండనే ఆశతో, పొత్తులో లోక్ సభకు పోటీచేసి గెలుపొందవచ్చని ఆమె ఎదురుచూస్తూ ఉన్నారు. అందుకే ఆమె చంద్రబాబు నాయుడు పట్ల ఈ మధ్యకాలంలో కొంచెం సానుకూలంగా కనిపిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఆ రెండు పార్టీల మధ్య పొత్తు అవకాశాలు కనిపించకపోవడంతో ఇక బీజేపీలో భవిష్యత్ లేదనే నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు.
ఈ లోగా ఆమెను వైసిపిలో చేరమని సీఎం జగన్ మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. పార్టీలో చేరితే విశాఖపట్నం లోక్ సభ సీట్ ఇస్తానని కూడా హామీ ఇచ్చారని వినికిడి. గతంలో 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజశేఖరరెడ్డి హయాంలో ఆమె అక్కడి నుండి గెలుపొందారు కూడా. 2014లో బీజేపీలో చేరినప్పుడు ఆమె అక్కడి నుండే పోటీచేయాలనుకొంటే సాధ్యపడలేదు. అక్కడి నుండి పోటీ చేసిన డా. హరిబాబు గెలుపొందడం, తాను రాజంపేట నుండి పోటీచేసి ఓటమి చెందడం ఆమె ఇంకా మరచిపోలేదు.
విశాఖపట్నంకు రాజధానిని మార్చేందుకు పట్టుదలగా ఉన్న జగన్, అక్కడ సీట్లు కూడా గెలుపొందేందుకు కసరత్తు చేస్తున్నారు. పురంధేశ్వరి పోటీ చేస్తే సామాజికవర్గం పరంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆమెకూడా పోటీకి ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
ఇటీవలనే, తనకు, తన కుమారుడు రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్లు ఆమె భర్త డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. దానితో, వారిద్దరూ దూరంగా ఉన్నప్పటికి అక్కవస్తే విశాఖ నుండి పోటీచేయవచ్చని జగన్ కబురు పంపినట్లు చెబుతున్నారు. 2014లో ఆమె బీజేపీలో ఉన్నప్పటికీ ఆమె కుమారుడును జగన్ అసెంబ్లీ సీటు ఇచ్చారు.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ అనూహ్యంగా పుంజుకొన్నల్టు స్పష్టం అవడంతో ప్రస్తుతం పార్టీలో ఉన్న అభ్యర్థులతో గెలుపొందడం కష్టం అనే నిర్ణయానికి జగన్ వచ్చినట్లు స్పష్టం అవుతోంది. అందుకనే పురందేశ్వరికి బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తున్నది.