పురందేశ్వరికి బీజేపీ నాయకత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా!

Sunday, December 22, 2024

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమితులైన మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి రాష్త్ర పార్టీని ప్రక్షాళన చేసి, కార్యక్రమాలు నిర్వహించడంలో పార్టీ జాతీయ నాయకత్వం స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పార్టీ నాయకత్వంపై సాధారణ ప్రజలలో వ్యాపించిన ప్రతికూల భవనాలను చెదరగొట్టి, పార్టీ పట్ల విశ్వాసం పెంపొందింపచేసే రీతిలో ప్రణాళికాయుతంగా వ్యవహరించామని సూచించినట్లు చెబుతున్నారు.

ఈ నెల 13న విజయవాడ లోని పార్టీ రాష్త్ర కార్యాలయంకు వచ్చి ఆమె బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. అమర్‌నాథ్ యాత్ర చేస్తున్న సమయంలో రాష్త్ర అధ్యక్షురాలిగా నియామకం గురించి పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా నుంచి ఫోన్ కాల్ అందుకున్న పురందేశ్వరి యాత్ర ముగించుకుని వెంటనే ఢిల్లీకి తిరిగొచ్చి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

బాధ్యతలు చేపట్టిన తర్వాతనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను మర్యాదపూర్వకంగా కలవాలని ఆమె భావిస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమితులైన నేపథ్యంలో ఆమె స్పందనను మీడియా కోరగా తాను విజయవాడలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి మీడియా సమావేశాన్ని అక్కడే నిర్వహిస్తానని బదులిచ్చారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని బాధ్యతలు చేపట్టనున్నారు తెలిసింది.

సోము వీర్రాజు కార్యవర్గంలో ఉద్దేశపూర్వకంగా పార్టీలో చాలాకాలంగా పనిచేస్తున్న వారిని పక్కన పెట్టేసి ఒక వర్గాన్ని ప్రోత్సహించారని విమర్శలు నెలకొన్నాయి. పైగా పదవులను అమ్ముకున్నారని ఆరోపణలు కూడా చెలరేగాయి. దానితో మొత్తం కార్యవర్గంలో జనానికి తెలిసిన మొఖాలు రెండు, మూడు తప్ప లేవు.

ఈ పరిస్థితుల్లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ, పార్టీలో నూతన ఉత్తేజం కలిగించే విధంగా రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పరచుకోవడం ఆమెకు ఒక సవాల్ గా పరిణమించే అవకాశం ఉంది.  ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ ఏజెంట్లుగా కొందరు బీజేపీ నేతలకు ముద్ర పడటం రాష్ట్రంలో పార్టీకి తీరని నష్టం కలిగించినట్లు కేంద్ర నాయకత్వం గుర్తించింది. ఆ ముద్ర చెరిపి వేయాల్సిన బాధ్యత ఆమెపై ఇప్పుడు పడింది.

ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వస్తున్న బీజేపీ జాతీయ నేతలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలపై పదునైన విమర్శలు చేయడం ద్వారా రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి వరుస ఢిల్లీ పర్యటనలు, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు వంటి అంశాలను సమాఖ్య స్ఫూర్తిలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలుగా మాత్రమే చూడాలని, రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పిదాలను ఉపేక్షించరాదని అధినాయకత్వం సూచించినట్లు తెలిసింది. 

ప్రభుత్వ తప్పిదాలను గుర్తించి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించేందుకు రాజకీయానుభవంతో పాటు పాలనలో అనుభవం కల్గి, రాష్ట్రమంతటా పరిచయం ఉన్న నేతలకు బీజేపీ జాతీయ నాయకత్వం తాజాగా వివిధ రాష్ట్రాల బాధ్యతలు అప్పగించింది. ఈ విషయంలో సోము వీర్రాజు బృందం విఫలమైనట్లు భావిస్తున్నారు.

ముఖ్యంగా మిత్రపక్షం ఉన్న జనసేనతో సోము వీర్రాజు బృందం సరైన సంబంధాలు ఏర్పాటు చేసుకోలేక పోయింది. సోము వీర్రాజు బృందం వ్యవహారంపై స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ కేంద్ర నాయకులకు ఫిర్యాదులు చేశారనే కధనాలు సహితం అప్పట్లో వచ్చాయి. సోము వీర్రాజు కారణంగానే బిజెపి- జనసేనల మధ్య దూరం పెరిగిందని మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీలో ఉన్నప్పుడే తీవ్రమైన ఆరోపణలు చేశారు.

నాలుగేళ్లుగా బిజెపి, జనసేన మిత్రపక్షాలుగా ఉంటున్న సమిష్టిగా ఇప్పటివరకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కనీసం ఒకరి వేదికలపై మరొకరు ఎప్పుడు కనిపించలేదు. ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఈ అగాధాన్ని పూరించే బాధ్యత పురంధేశ్వరిపై పడింది. సున్నితమైన టిడిపితో సంబంధాల విషయమై కూడా ఆచితూచి అడుగులేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో కేంద్ర పార్టీ తీసుకొనే నిర్ణయంపై ఆమె వ్యవహారం ఆధారపడి ఉంటుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles