పిళ్ళై అరెస్ట్ తో కవిత అరెస్ట్ ఖాయం! రేపే విచారణ!

Tuesday, November 5, 2024

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని మంగళవారం అరెస్ట్ చేయడంతో ఇక తర్వాత జరిగే అరెస్ట్ బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత కావచ్చని అధికార పార్టీలో ఆందోళన చెలరేగుతుంది.

పిళ్ళై రిమాండ్ రిపోర్ట్ లో పలు సార్లు కవిత పేరు పేర్కొనడమే కాకుండా, కవితకు బినామీగా అతనిని పేర్కొనడంతో అరెస్ట్ అనివార్యంగా భావిస్తున్నారు. గురువారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా పేర్కొంటూ ఆమెకు నోటీసు కూడా పంపింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి కవిత ప్రతినిధిగా తాను వ్యవహరించినట్లు ఈడీ అధికారులకు రామచంద్ర పిళ్లై విచారణలో తెలిపారు. ఈ క్రమంలో కవితకు ఈడీ నోటీసులు రావడంతో కవితను అరెస్ట్ చేయడం ఖాయమని గత కొద్దిరోజులుగా జోరుగా జరుగుతున్న ప్రచారంకు బలం చేకూరినట్లయింది.
 పైగా, ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల డిమాండ్‌పై ఆందోళనకు కవిత పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కవితకు ఈడీ నోటీసులు రావడం, అంతకు ముందు రోజే విచారణకు హాజరుకమ్మనడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
లిక్కర్ స్కాంలో హవాలాపై పిళ్ళైని విచారించాలని ఈడీ సిద్ధం చేసిన 17 పేజీలతో కూడిన రిమాండ్ రిపోర్ట్ లో రామచంద్ర పిళ్లై కవితకు బినామీ అని, ఆమె  ఆదేశాల మేరకే  పనిచేశాడని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం.
అలాగే పిళ్ళై రిమాండ్ రిపోర్ట్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పేర్లు కూడా ఉన్నాయి.

‘‘కవిత బినామీ అరుణ్ రామచంద్ర పిళ్ళై. మాగుంట శ్రీనివాసులురెడ్డి బినామీ ప్రేమ్ రాహుల్. కవిత ప్రయోజనాలు కాపాడేందుకే సౌత్‌గ్రూప్‌లో పిళ్ళై పనిచేశారు. ఇండో స్పిరిట్‌లో పిళ్ళైకి 32.5% వాటా, ప్రేమ్ రాహుల్‌కి 32.5 % వాటా ఉంది. పిళ్ళై, బుచ్చిబాబు, అభిషేక్‌లు సిండికేట్‌ తయారు చేశారు. సిండికేట్‌తో ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌లో 30% వాటా దక్కించుకున్నారు” అంటూ పేర్కొన్నారు.

పైగా, సౌత్‌గ్రూప్ నుంచి ఆప్‌కి ముడుపులు చేర్చడంలో పిళ్ళై కీలక పాత్ర ఉందంటూ కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్ళై వ్యవహరించారని తెలిపారు. అరుణ్ పిళ్ళై సహా అనేక మంది నిందితులు.. కవిత బినామీలమని వాంగ్మూలం ఇచ్చారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.

గతంలోనే 28 సార్లు కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన సమయంలో  కవిత, మాగుంట రాఘవ, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ రెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, ఆడిటర్‌ బుచ్చిబాబు, పెర్నార్డ్‌ రికార్డ్‌కు చెందిన బినయ్‌ బాబు పలుమార్లు ఆప్‌ నేతలతో భేటీ అయ్యారని, హోల్‌సేల్‌, రిటైల్‌ ఉత్పత్తిదారులతో కుమ్మక్కై కార్టెల్‌(సిండికేట్‌)ను ఏర్పాటు చేశారని ఈడీ స్పష్టం చేసింది.

కవిత, మాగుంట రాఘవ, శరత్‌రెడ్డి నిర్వహిస్తున్న సౌత్‌గ్రూప్ ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిందని దినేశ్‌ అరోరా వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ ఈడీ పేర్కొంది. పిళ్లై‌ను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచినప్పుడు  ‘‘బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధినంటూ అరుణ్ రామచంద్ర పిళ్ళై అంగీకరించారు.

ఆయనను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వండి. కేసు దర్యాప్తుకు సహకరించడం లేదు. మనీ ట్రయల్స్ గుట్టు తేల్చడానికి కస్టడీ అవసరం. రూ.25 కోట్లు నేరుగా ట్రాన్స్ఫర్ చేశారు’’ అంటూ ఈడీ వాదనలు వినిపించడం గమనార్హం.

పిళ్లై కస్టడీ మరో వారం రోజులు ఉండడంతో ఈ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని, ఆ  సమాచారం ఆధారంగా రాబోయే రోజుల్లో కవితతో పాటు మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles