పాస్టర్లకు జగన్ చేసిన ద్రోహం సరిదిద్దిన చంద్రబాబు!

Friday, November 22, 2024

వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీ ని పాటిస్తారు. ఆయన మతం గురించిన ప్రస్తావన ప్రత్యేకంగా చెప్పుకోవడం ఎందుకంటే.. ఆయన తన మతాన్ని ప్రచారం చేస్తూ ఉండే పాస్టర్లకు కూడా తన పాలనలో పెద్ద ద్రోహమే చేశారు. తద్వారా వారిని ఎప్పటికీ తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని.. తద్వారా నిత్యం వారు తన దయతో బతుకుతున్నారనే భావనలో ఉంచాలని ఆయన అనుకున్నారు. దానికి తగినట్టుగా పాస్టర్లందరూ గగ్గోలు పెట్టే నిర్ణయాన్ని తీసుకున్నారు. కానీ.. ఎన్డీయే ఆధ్వర్యంలో  కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పాస్టర్లకు జగన్ చేసిన ద్రోహాన్ని కూడా తాజాగా చంద్రబాబునాయుడు సరిదిద్దారు.
వివరాల్లోకి వెళితే.. క్రైస్తవుల వివాహాలు చేసేందుకు పాస్టర్లకు ప్రభుత్వ లైసెన్సు అవసరం ఉంటుంది. ఈ లైసెన్సు గడువు గతంలో శాశ్వత ప్రాతిపదికన జారీ అవుతుండేది. అంటే ఒకసారి పాస్టరు వివాహాలు చేయించడానికి లైసెన్సు తీసుకున్నారంటే.. జీవితాంతం అలా పెళ్లిళ్లు చేయిస్తూ ఉండవచ్చు. అయితే స్వతహాగా తాను కూడా క్రిస్టియను అయిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఈ పద్ధతిలో మార్పు తీసుకువచ్చారు. ఈ ఏర్పాటు వల్ల పాస్టర్లు ఏం బావుకుంటారని అనుమానించారో తెలియదు గానీ.. జగన్మోహన్ రెడ్డి.. వివాహాలు చేయించే లైసెన్సుకు కాలపరిమితి విధించారు. మూడేళ్ల తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకోవాలనే పద్ధతి తెచ్చారు.

దీనివల్ల.. మూడేళ్లకోసారి పాస్టర్లందరూ ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తుండాలి. ఆశ్రయించిన ప్రతిసారీ.. మీకు నేను మేలు చేకూరుస్తున్నాను.. నాకు రుణపడి ఉండండి అనే బిల్డప్ తో ఆ లైసెన్సులు పునరుద్ధరిస్తుండవచ్చునని.. ఈ ఫిటింగు పెట్టడం వలన పాస్టర్లందరూ తన గుప్పిట్లో ఉంటారని, వారి ద్వారా.. క్రిస్టియన్ ఓటు బ్యాంకును ప్రభావితం చేయడం కుదురుతుందని జగన్మోహన్ రెడ్డి బహుశా తలపోసి ఉంటారు. ఈ నిర్ణయం పట్ల జగన్ పాలన కాలంలోనే.. పెద్దఎత్తున పాస్టర్లనుంచి నిరసన వ్యక్తమైంది. తతిమ్మా అన్నింటిలాగానే ఆ నిరసనల్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు.
తీరా ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాస్టర్ల మొరాలకించింది. ఇప్పుడు ఆ లైసెన్సు గడువును పదేళ్ల వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పాస్టర్లకు జగన్ చేసిన అన్యాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం చక్కిదిద్దినందుకు పాస్టర్ల నుంచి, క్రిస్టియన్ వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles